నవతెలంగాణ-హైదరాబాద్: పలు రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు(Indigo Flights) వందల సంఖ్యలో రద్దు అవుతున్న విషయం తెలిసిందే. ఇండిగో విమానాల రద్దుతో.. ఆ జంట తమ రిసెప్షన్‌కు ఆన్‌లైన్‌లోనే హాజరైంది. కర్నాటకలోని హుబ్లీలో అనూహ్య ఘటన చోటుచేసుకున్నది. హుబ్లీకి చెందిన మేధా కృష్‌సాగర్, భువనేశ్వర్‌కు చెందిన సంగ్మాదాస్ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. బెంగుళూరులో పనిచేస్తున్నారు. హుబ్లీలోని గుజరాత్ భవన్‌లో వాళ్ల రిసెప్షన్ జరగాల్సి ఉంది.
అయితే బుధవారం అమ్మాయి ఇంటి వద్ద ఫార్మల్‌గా రిసెప్షన్ నిర్వహించారు. అబ్బాయి ఇంటి దగ్గర జరగాల్సిన రిసెప్షన్ .. విమానాల రద్దుతో గందరగోళంలో పడింది. డిసెంబర్ 2వ తేదీన భువనేశ్వర్ నుంచి బెంగుళూరుకు కొత్త జంట విమాన టికెట్లు బుక్ చేసింది. కానీ మంగళవారం విమానాలు ఆలస్యం అయ్యాయి. ఆ తర్వాత డిసెంబర్ 3వ తేదీన వాటిని ఏకంగా రద్దు చేశారు. భువనేశ్వర్ నుంచి ముంబై మీదుగా హుబ్లీ వెళ్తున్న అనేకమంది బంధువులు కూడా ఇండిగో తాకిడికి గురయ్యారు. రిసెప్షన్ వేదిక వద్దకు అతిథులు చేరుకోవడంతో.. ఆ సమయంలో కొత్త జంట వర్చువల్‌గా ఆ ఈవెంట్‌లో పాల్గొన్నది.



