నవతెలంగాణ-హైదరాబాద్: ఇండిగోలో తలెత్తిన సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. మూడు రోజులుగా విమానాలు రద్దవ్వడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురువుతున్నారు. మూడు రోజులుగా విమానాశ్రయాల్లోనే ప్యాసింజర్స్ పడిగాపులు కాస్తున్నారు. ఎయిర్‌లైన్స్ నుంచి సరైన సమాధానం లేక ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి వరకు అన్ని ఇండిగో దేశీయ విమానాలను రద్దు చేసింది. దాదాపు 400 సర్వీసులు రద్దయ్యాయి. అర్ధరాత్రి వరకు బయలుదేరే అన్ని విమానాలను ఇండిగో రద్దు చేసిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లుగా ఎయిర్‌లైన్స్ చెబుతోంది. అయితే ఫిబ్రవరి 10 వరకు నిబంధనల్లో మినహాయింపు ఇవ్వాలని డీజీసీఏను ఇండిగో అధికారులు కోరారు. అందుకు డీజీసీఏ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని తెలుస్తోంది. దీంతో ఇండిగో ప్రయాణికుల కష్టాలు మరిన్ని రోజులు ఉండక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.


