Thursday, December 11, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి'ఇండిగో' ఇక్కట్లు: కారణాలు, వైఫల్యాలు

‘ఇండిగో’ ఇక్కట్లు: కారణాలు, వైఫల్యాలు

- Advertisement -

ఇండిగో విమానయాన సంస్థ తన సర్వీసులు రద్దు చేయడం, ప్రయాణికులు పడిన అగచాట్లు చూస్తున్నాం. తాజాగా ప్రభుత్వ సంస్థ అయిన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ)కొంత వెనకడుగు (నాటకీయంగా) వేసినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు ఇలా ఎందుకు జరిగింది? అంతర్జాతీయంగా విమాన పైలట్లు, సిబ్బంది పని గంటలు, విరామం తదితర నిబంధనలకు భిన్నంగా భారతదేశంలో అమలు జరుగుతున్నాయి. దీనిపై విమాన పైలట్లపై ఒత్తిడి తగ్గించడం ద్వారా భద్రతను మెరుగుదల చేయాలని విమాన పైలట్ల అసోసియేషన్లు గత కొన్నేండ్లుగా డీజీసీఏతోను, విమానయాన సంస్థలతోనూ విజ్ఞప్తులు, రాయబారాలు నడిపింది. చివరకు డీజీసీఏ విమాన పైలట్ల పని గంటల తగ్గింపు తదితర అంశాలపై ఒక ముసాయిదా విధానాన్ని రూపొందించింది. దాన్ని విమానయాన సంస్థలన్నింటికీ పంపి తన వెబ్‌ సైట్‌లో కూడా వివరాలు అప్‌లోడ్‌ చేసింది. చివరిగా 2024 మే నెలలో తుది నియమ, నిబంధనలను ఖరారు చేసి విడుదల చేసింది.2025 డిసెంబర్‌ నుండి వాటిని అమలు చేయాలని అన్ని విమానయాన సంస్థలను ఆదేశించింది.

అయితే ఇండిగో విమానయాన సంస్థ డీజీసీఏ ఆదేశాలను నిర్లక్ష్యంగా, అహంభావ ధోరణితో పక్కన పెట్టింది. కొత్త నిబంధనల ప్రకారం వేలాది సిబ్బంది నియామకం జరగాలి. ఈపాటికి ఇండిగోలో పైలట్ల కొరత ఉన్నది. దేశంలో పైలట్లకు కొరత లేదు, పెద్ద సంఖ్యలో పైలట్లు నిరుద్యోగులుగా ఉన్నారు. పైలెట్ల సిబ్బంది విషయాల పట్ల, విమాన నిర్వహణ పట్ల పైలట్ల అసోసియేషన్‌తో గాని, రోస్టరింగ్‌ స్టాప్‌తో కానీ ఇండిగో యాజమాన్యం కనీసం సంప్రదించలేదు. ఇండిగో సంస్థ 420 విమానాలతో భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా, ప్రపంచంలో ఎనిమిదవ పెద్ద సంస్థగా ఎదిగింది. విమానయాన రంగంలో 20 బిలియన్‌ డాలర్ల వాటా కలిగి ఉంది. కింగ్‌ ఫిషర్‌, జెట్‌ ఎయిర్‌ వేస్‌, గో ఎయిర్‌ లాంటి సంస్థలు దివాలా తీయడం, స్పైస్‌ జెట్‌ విమానాల సంఖ్య100 నుంచి 20కి పడిపోవటం వంటివన్నీ ఇండిగో తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి దోహద పడ్డాయి. వీటన్నిటి ఫలితంగా కొన్ని సంవత్సరాలుగా ఇండిగో యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా, అహంభావ పూరితంగా వ్యవహరిస్తున్నది. భారీ విమాన ప్రమాదాలు జరగకపోయినప్పటికీ పలు ఫిర్యాదులైతే ఉన్నాయి.

డీజీసీఏ ఆదేశాలు అమలు చేయడానికి భారీ సంఖ్యలో విమాన పైలట్ల కొత్త నియామకాలు జరగాలి. అందుకు చాలా సమయం పడుతుంది. నియామకాలు జరిగిన తర్వాత వారందరికీ కనీసం మూడు నెలలపాటు డీజీసీఏ నిబంధనల అమలుకు అవసరమైన శిక్షణ నివ్వాల్సి ఉంటుంది. అలాగే విమాన పైలెట్లు, ఇతర సిబ్బంది పని గంటలకు సంబంధించి మార్పులు సాఫ్ట్‌వేర్‌లో చేయాలి. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ప్రపంచస్థాయి కొన్ని సంస్థలు మాత్రమే ఈ షెడ్యూలింగ్‌ చేయగలుగుతాయి. వాటికి విమానయాన సంస్థలు తన విమానాల సంఖ్య, ఒక్కోవిమానం రోజుకు ఎన్ని షెడ్యూల్స్‌ తిరుగుతుంది, పైలెట్లు, ఇతర సిబ్బంది ఎంతమంది ఉన్నారు, వారి అనుభవాలు తదితర వివరాలన్నిటిని ఆ సంస్థలకు అందజేయాలి. అప్పుడే సక్రమమైన షెడ్యూలింగ్‌ సాధ్యమవు తుంది. ఇవన్నీ భారీఖర్చుతో కూడినవి. అందుచేత ఉద్దేశ పూర్వకంగానే ఇండిగో సంస్థ డీజీసీఏ ఆదేశాలను బేఖాతరు చేసింది. తనకు గల పలుకుబడి, తన ఆధిపత్యం చూసుకొని తనను డీజీసీఏ ఏమీ చేయలేదనే అహంభావంతో ఇండిగో వ్యవహరించింది.

డీజీసీఏ తన ఆదేశాలను వెనక్కి తీసుకుంటుందనే ధృడనమ్మకంతో యాజమాన్యం ఉంది.కానీ, ‘డామిట్‌ కథ అడ్డం తిరిగింది’ అన్నట్లు డీజీసీఏ తన ఆదేశాలను ముందుగా నిర్దేశించిన తేదీ నుండి అమలు పూనుకున్నది. దానికి ఎలాంటి సన్నాహాలు చేయని ఇండిగో సంస్థ తన విమాన సర్వీసులను భారీగా రద్దు చేయాల్సి వచ్చింది. (మొదటిరోజు 200 రెండవ రోజు 500 మూడో రోజు వెయ్యి విమానాలు రద్దు చేసింది). ఇదే అదునుగా మిగిలిన విమానయాన సంస్థలు ప్రయాణ చార్జీలను 10 నుంచి 15 – 20 రెట్లు పెంచేశాయి. ప్రయాణికులను దిమ్మ తిరిగేటట్లుగా బాదాయి. ప్రయివేటీకరణ దుష్ఫలితాలు ఎలా ఉంటాయో మరొకసారి రుజువైంది. వెరసి ప్రయాణికులు బలిపశువులు చేయబడ్డారు. చివరకు డీజీసీఏ తాత్కాలికంగా కొంత వెనకడుగు వేసింది. తన ఆదేశాల అమలు తేదీని 2026 ఫిబ్రవరి 10 వరకు పొడిగించింది.

అయితే సుమారు పదిహేను నెలల గడువులో భారీ నియామకాలు తదితర ఏర్పాట్లు చేయని ఇండిగో సంస్థ కేవలం రెండు నెలల్లో డీజీసీఏ ఆదేశాలను ఎలా అమలు చేస్తుందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. 2024 మే నెల నుంచి 2025 డిసెంబరు దాకా తన ఆదేశాల అమలుకు అవసరమైన సన్నాహాలు విమానయాన సంస్థలు, ముఖ్యంగా ఇండిగో తీసుకుంటున్నది లేనిది డీజీసీఏ పర్యవేక్షణ చేసిన దాఖలాలు లేవు. చేస్తే ఇలాంటి పరిస్థితి దాపురించేది కాదు. ఈ మొత్తం ఎపిసోడ్‌ పరిశీలించినప్పుడు కేంద్ర ప్రభుత్వం, పౌర విమానయాన శాఖ మంత్రిత్వ శాఖ ఘోరంగా విఫలమయ్యాయని అర్థమవు తున్నది. దీనికి కేంద్ర ప్రభుత్వం, ఇండిగో సంస్థ ప్రజలకు సమాధానం చెప్పాలి. 2026 ఫిబ్రవరి నాటికి సన్నహాలన్నీ పూర్తిస్థాయిలో నిబంధనలు అమలు చేయడానికి గ్యారెంటీ ఇవ్వాలి.

లేదా ‘మేము ఆదేశాలిస్తాం, మీరు వాటిని ఉల్లంఘిస్తూ ఉండండి, మరల పొడిగిస్తూ ఉంటాం’ అని లోపాయికారిగా కేంద్ర ప్రభుత్వం (డీజీసీఏ), ఇండిగో సంస్థ ఒక అంగీకారానికి వచ్చాయా? ఇదంతా వెండితెరమీద చూడాల్సిన సినిమా మాత్రమే. ఏ రంగంలోనైనా ప్రయివేటు వారి గుత్తాధిపత్యం ఉంటే పరిస్థితులు ఇలానే ఉంటా యని ఏవియేషన్‌ రంగంలో నిపుణులు, ఎయిర్‌ దక్కన్‌ వ్యవస్థాపకులు అయిన కెప్టెన్‌ గోపీనాథ్‌ ‘ది వైర్‌’ కరణ్‌ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ప్రపంచంలో అనేక దేశాల్లో విమానయాన సంస్థలు ప్రభుత్వ సంస్థలుగా లేదా అత్యధిక వాటాలు కలిగిన సంస్థలుగా ఉన్నాయి. కానీ, మనదేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థని ప్రయివేటు యాజమాన్యానికి మోడీ ప్రభుత్వం అప్పగించింది.

ఆర్‌.లక్ష్మయ్య
9971511954

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -