నవతెలంగాణ హైదరాబాద్: ప్రజలకు ఇచ్చిన మాట మేరకే ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితం అయిందని, ప్రజలకే జవాబుదారీగా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యనించారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేసే వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చింది, 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన గుర్తుచేశారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇండ్లు ఎంత త్వరగా నిర్మించుకుంటే, అంత వేగంగా బిల్లులు మంజూరు అవుతాయని భట్టి తెలిపారు. ప్రజల డబ్బు దోపిడీకి గురి కాకుండా ప్రతి పైసా ప్రజల అవసరాలకు ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. ‘ప్రజల సొమ్ము దోపిడికి గురైతే అది అత్యంత ప్రమాదకరం’ అని హెచ్చరించారు.
విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, మన బిడ్డల భవిష్యత్తు మన భవిష్యత్తు. వారి భవిష్యత్తు తీర్చిదిద్దేందుకు భారీగా నిధులు ఖర్చు చేస్తున్నాం.. అని అన్నారు. మహిళల ఆత్మగౌరవం కోసం వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, ఐదు సంవత్సరాల్లో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడం లక్ష్యమని చెప్పారు. మధిర నియోజకవర్గంలో 60 వేల మంది మహిళా సభ్యులతో ఉన్న ఇందిరా మహిళా డైరీ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని భట్టి పేర్కొన్నారు.
రెండేండ్లలో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్టు గుర్తుచేస్తూ, యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎక్కడ ఉన్న ప్రజల సంక్షేమమే నా ధ్యేయం.. మధిర నియోజకవర్గ ప్రజలు వేసిన ప్రతి ఓటుకూ గౌరవం తీసుకువస్తాను.. అని భట్టి హామీ ఇచ్చారు.
రెండు సంవత్సరాల్లో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు గుర్తుచేస్తూ, యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎక్కడ ఉన్న ప్రజల సంక్షేమమే నా ధ్యేయం.. మధిర నియోజకవర్గ ప్రజలు వేసిన ప్రతి ఓటుకూ గౌరవం తీసుకువస్తాను.. అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.



