దళిత, వ్వవసాయ కార్మిక, రైతు సంఘాల నాయకులు
నవతెలంగాణ – ముషీరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని భూమిలేని వ్యవసాయ కూలీలందరికీ అందజేయాలని దళిత, వ్వవసాయ కార్మిక, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం దళిత బహుజన ఫ్రంట్, తెలంగాణా వ్యవసాయ కార్మిక సంఘం, టీవీవీయూ, డీబీఎస్‌యూ, పీఎంసీ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేలు అందించకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. 2025 జనవరి 10న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసిన జీఓ 42 ప్రకారం.. భూమిలేని వ్వవసాయ కూలీల కుటుంబాలకు సంవత్సరానికి రూ.12 వేలను రెండు విడతలుగా చెల్లిస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో 20 రోజులు పని చేసిన కూలీలకు కూడా చెల్లిస్తామని చెప్పారన్నారు. ఈ మేరకు జనవరిలో గ్రామ సభల్లో 497,545 మంది భూమి లేని వ్వవసాయ కూలీలను గుర్తించగా.. మరో రెండు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దాదాపు 7 లక్షల మంది కూలీలకు మొదటి విడతలో అందించాల్సి ఉండగా, జనవరిలో 83,887 మంది కూలీలకు మాత్రమే రూ.6000చొప్పున అందజేసి ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. రెండో విడత జులైలో చెల్లించాల్సి ఉండగా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు ప్రభుత్వం వివిధ పథకాలకు కోట్లు ఖర్చు చేస్తున్నదని, కానీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించకుండా అన్యాయం చేస్తోందని అన్నారు. తెలంగాణ వ్వవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు మాట్లాడుతూ.. ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి రూ.1200 కోట్లు కేటాయించి.. రూ.50.33 కోట్లను మాత్రమే చెల్లించి చేతులు దులుపుకున్నదన్నారు. ప్రభుత్వ హామీ ప్రకారం వ్వవసాయ కూలీల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అందించాలని డిమాండ్ చేశారు. అందుకోసం ఐక్య ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పథకానికి తమ పేరు గ్రామ సభలో ఎంపిక చేసినప్పటికీ ఆర్థిక సహాయం అందించలేదని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లికి చెందిన ఉపాధి హామీ కూలీలు మంగ, కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పీఎంసీ రాష్ట్ర కన్వీనర్ ఎస్.శివలింగం, టీవీవీయూ రాష్ట్ర నాయకులు నర్సింహ్మ, డీబీఎస్‌యూ రాష్ట్ర నాయకులు రమేష్, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు బి.కొండల్, కన్నెగంటి రవి, డీబీఎఫ్ రాష్ట్ర నాయకులు దుబాషి సంజివ్, దాసరి ఎగొండ స్వామి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు శోభన్, వివిధ సంఘాల నాయకులు తుకారాం, బి.ప్రసాద్, పద్మ, శ్రీనివాస్, మహేష్, జాన్, అంజనేయులు పాల్గొన్నారు.
వ్వవసాయ కూలీలకు ‘ఇందిరమ్మ’ భరోసా అందించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES