– ఇంటి స్థలం లేనివారికి స్థలం కేటాయించాలి
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జటంగి సైదులు
నవతెలంగాణ – మిర్యాలగూడ
ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి అందజేయాలని, ఇంటి స్థలం లేని పేదలకు వెంటనే ఇంటి స్థలాలు కేటాయించాలని సీపీఐ(ఎం) అడవిదేవులపల్లి మండల కార్యదర్శి జటంగి సైదులు డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ పేదల గృహ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం అమలులో తీవ్ర లోపాలు కనిపిస్తున్నాయని అన్నారు. అర్హులైన అనేక మంది ఇప్పటికీ ఇళ్ల కోసం ఎదురు చూస్తుండగా, కొందరు అనర్హులకు లబ్ధి చేకూరుతున్న పరిస్థితి ఉందని విమర్శించారు.
ప్రత్యేకంగా ఇంటి స్థలం లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ భూములను గుర్తించి వెంటనే ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. గ్రామస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి నిజమైన అర్హులను గుర్తించి, ఎలాంటి వివక్ష లేకుండా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యపై అధికారులు స్పందించకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు చేపడతామని జటంగి సైదులు హెచ్చరించారు.



