– మండల ప్రత్యేక అధికారి తిరుమల ప్రసాద్
– ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి, డ్రైడే కార్యక్రమం పరిశీలన
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు వేగవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారి, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ తిరుమల ప్రసాద్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడారు.
ఇందిరమ్మ గృహాలను నిర్మించుకుంటున్న లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అధికారుల సహకారంతో ఇండ్ల నిర్మాణాల్లో ఎలాంటి జాప్యం లేకుండా, వేగంగా ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా లబ్ధిదారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన వెంటనే దశలవారీగా బిల్లులు చెల్లించడం జరుగుతుందన్నారు.
అనంతరం గ్రామంలో ఆరోగ్య సిబ్బంది నిర్వహిస్తున్న మంగళవారం డ్రై డే కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి సదాశివ్, హౌసింగ్ ఏఈ రాకేష్, పంచాయతీ కార్యదర్శి గంగా జమున, ఆశ కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.