నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్నవారి ప్రేమకు నోచుకోవాల్సిన నెల రోజుల వయసున్న ఓ ఆడశిశువు మురుగు కాలువలో విగతజీవిగా తేలియాడింది. ఈ అమానవీయ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్‌నగర్ పరిధిలోని అరుంధతికాలనీలో ఉన్న మురుగు కాలువలో ఓ పసికందు మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఓ స్థానిక వ్యక్తి మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో కాలువలో శిశువును గమనించి, వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
సిబ్బంది సహాయంతో కాలువలో నుంచి పసికందు మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శిశువు మృతదేహాన్ని ఎవరైనా ఇక్కడకు తెచ్చి పడేశారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. నిజానిజాలు తేల్చేందుకు పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.



