ఇడ్లీ, దోశ వంటి టిఫెన్స్ చేయాలంటే కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే వీటి కోసం ముందురోజే పిండి సిద్ధం చేసుకోవాలి. అందుకే ఈ ప్రాసెస్ అంత లేకుండా చాలా మంది ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. మరి మీరు కూడా త్వరగా అయ్యే అలాంటి టిఫెన్స్ చేయాలనుకుంటున్నారా అయితే మీకోసమే కొన్ని ఇన్‌స్టంట్ దోశలు. వీటి తయారీ కోసం ఎలాంటి పప్పులు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. అతి తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా..!
టమాటా సేమియాతో
కావాల్సిన పదార్థాలు: టమాటాలు – మూడు, ఎండుమిర్చి – నాలుగు, బొంబాయి రవ్వ – అర కప్పు, సేమియా – అర కప్పు, బియ్యప్పిండి – అర కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, జీలకర్ర – అర టీస్పూన్, ఉల్లిగడ్డ – ఒకటి, కరివేపాకు – రెండు, రెమ్మలు, కొత్తిమీర – కొద్దిగా.
తయారీ విధానం: టమాటాలను శుభ్రంగా కడిగి తొడిమ తీసేసి మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీరను వీలైనంత సన్నగా కట్ చేసి పక్కన పెట్టాలి. మిక్సీజార్‌లోకి టమాటా ముక్కలు, ఎండుమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసి మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు టమాటా మిశ్రమంలోకి బొంబాయి రవ్వ, సేమియా, బియ్యప్పిండి, ఉప్పు, జీలకర్ర, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి ఓసారి కలపాలి. ఆ తర్వాత మూడు కప్పుల నీళ్లు పోసి పిండిని రవ్వ దోశ వేసేందుకు సరిపడేలా కలుపుకోవాలి. దీన్ని పది నిమిషాలు పక్కనుంచాలి. సేమియా మెత్తగా మారిన తర్వాత మరోసారి కలిపి దోశలు పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టి హీట్ చేసుకోవాలి. పెనం వేడెక్కిన తర్వాత లైట్‌గా ఆయిల్ చల్లి టిష్యూ పేపర్‌తో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత గరిటెతో పిండిని తీసుకుని రవ్వ దోశ మాదిరి పెనం మీద పోసుకోవాలి.
చిట్కాలు: టమాటాలు పండినవి తీసుకుంటే గుజ్జు ఎక్కువ రావడంతో పాటు దోశల రుచి బాగుంటుంది.
రవ్వ, సేమియా ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పు కొలత ప్రకారం మిగిలినవి తీసుకోవాలి. అయితే నీటిని పైన చెప్పిన కొలత ప్రకారం కాకుండా రవ్వ దోశ కన్సిస్టెన్సీ వచ్చేవరకు కలుపుకుంటే సరిపోతుంది.
క్యాబేజీతో
కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ తురుము – రెండు కప్పులు, గోధమ రవ్వ 2 కప్పులు (లావుగా ఉండేది), పెరుగు – కప్పు, కొత్తిమీర – గుప్పెడు, పచ్చి మిర్చీ – రెండు లేదా మూడు, అల్లం ముక్క – కొద్దిగా, జీలకర్ర – కాస్త.
తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ రవ్వ వేసుకోవాలి. అందులోనే పెరుగు, ఒకటిన్నర కప్పుల నీరు పోసుకొని అన్నీ బాగా కలిసేలా స్పూన్‌తో మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కనీసం పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అవకాశం ఉన్నవారు ఎక్కువ సేపు నానబెడితే మంచిది. పది నిమిషాల తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ రవ్వ మిశ్రమం వేసుకోవాలి. అందులోనే క్యాబేజీ తురుము, కాస్త కొత్తిమీర, పచ్చిమిర్చీ కూడా వేసుకోవాలి. అలాగే అల్లం ముక్క, జీలకర్ర వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ పేస్టు మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు ఎక్కువైతే పిండి పల్చగా అవుతుంది. దాంతో దోశ వేస్తున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. రుచికి తగినంత ఉప్పు వేసుకొని, పిండి మొత్తాన్ని ఓసారి కలుపుకోవాలి. తర్వాత దోశలు వేసుకుంటే సరిపోతుంది. అదిరిపోయే క్యాబేజీ దోశలు సిద్ధమవుతాయి. ఎంతో టేస్టీగా, హెల్దీగా ఉండే దోశలను పిల్లల నుంచి పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు.
పచ్చికొబ్బరితో…
కావల్సిన పదార్థాలు: పచ్చికొబ్బరి చిప్పలు – రెండు, ఉప్మా రవ్వ – రెండు కప్పులు, ఉల్లిగడ్డ – రెండు(మీడియం సైజ్‌వి, జీలకర్ర – రెండు టీస్పూన్లు, ఉప్పు – రుచికి తగినంత, క్యారెట్లు – నాలుగు, నూనె – కొద్దిగా(దోశపై వేసుకోవడానికి).
తయారీ విధానం: ముందుగా కొబ్బరిని సన్నగా తురుముకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కనుంచాలి. అలాగే, ఉల్లిగడ్డలను పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచాలి. అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో ఉప్మా రవ్వ, ముందుగా రెడీ చేసుకున్న పచ్చికొబ్బరి తురుము, ఉల్లిగడ్డ ముక్కలు, జీలకర్ర, టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే రెండు కప్పుల వరకు నీటిని పోసుకొని ఒకసారి కలిపి మిశ్రమం మొత్తాన్ని మెత్తని పిండిలా మిక్సీ పట్టుకోవాలి. పచ్చికొబ్బరి తురుము తీసుకున్న కప్పుతోనే ఉప్మా రవ్వ, నీళ్లు తీసుకోవాలి. అప్పుడే దోశలు పర్ఫెక్ట్‌గా, మంచి రుచికరంగా వస్తాయి. తర్వాత గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆపై మిక్సీ గిన్నెలో మిగిలిపోయిన మిశ్రమంలో కొద్దిగా నీళ్లుపోసి దాన్ని పిండిలో వేసి కలుపుకోవాలి. పిండి మరీ పలుచగా కాకుండా దోశకు కావాల్సిన విధంగా కాస్త చిక్కగానే ఉండేలా చూసుకోవాలి. దీన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆలోపు క్యారెట్లను తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా తురుముకొని సిద్ధంగా ఉంచుకోవాలి. పది నిమిషాల తర్వాత పిండిని మరోసారి గరిటెతో పైకి కిందకి బాగా కలిపి దోశలు వేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా కాస్త మందంగానే దోశలా వేసుకోవాలి. ఊతప్పం మాదిరిగా కాస్త మందంగా దోశ వేసుకున్నాక దానిపై ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని దోశ అంతటా కాస్త వేసుకొని ఆపై కొద్దిగా నూనెను కూడా వేసి రెండువైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే చాలు. ఇలా పచ్చికొబ్బరితో నిమిషాల్లో రుచికరమైన దోశలు చేసుకోవచ్చు. వీటిని కొబ్బరి, పల్లీ చట్నీతో తిన్నారంటే ఆ రుచి చాలా బాగుంటుంది.
అన్నం వార్చిన గంజితో
కావల్సిన పదార్థాలు: బియ్యప్పిండి – కప్పు, గంజి నీళ్లు – తగినన్ని. ఉల్లిగడ్డ – ఒకటి, అల్లం తరుగు – కొద్దిగా, పచ్చిమిర్చి – రెండు, క్యారెట్ తురుము – రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు – కొంచెం, ఉప్పు – రుచికి తగినంత, జీలకర్ర – పావు చెంచా, నూనె – కొద్దిగా(అట్టుపై వేసుకోవడానికి).
తయారీ విధానం: ముందుగా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చిలను వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కనుంచాలి. అలాగే అల్లం తరుగు, క్యారెట్ తురుము, కొత్తిమీర తరుగుని ముందుగానే రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్‌లో బియ్యప్పిండిని తీసుకొని అందులో తగినంత వేడి గంజిని(అన్నం వార్చిన నీళ్లు) కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కాస్త చిక్కగా ఉండేలా కలుపుకోవాలి. అయితే పిండి మరీ పలుచగా, గట్టిగా ఉండకూడదని గుర్తుంచుకోవాలి. కలిపిన తర్వాత అందులో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, సన్నని క్యారెట్ తురుము, సన్నగా తరుక్కున్న కొత్తిమీర తరుగు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు, జీలకర్ర వేసుకొని ఇవన్నీ పిండిలో మంచిగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత గిన్నెపై మూతపెట్టి ఒక అరగంట నుంచి గంట పాటు నాననివ్వాలి. అరగంట తర్వాత పిండిని మరొకసారి కలిపి దోశలు పోసుకోవాలి.
(మనిక: గంజి వీలైనంత వరకు వేడిగానే ఉండాలి. ఒకవేళ చల్లారితే వేడి చేసుకొని తీసుకోవాలి)