పెరిగిన అనైతిక విక్రయాలు
గతేడాది 26,667 ఫిర్యాదులు
ఐఆర్‌డీఏఐ వార్షిక రిపోర్ట్‌లో వెల్లడి
న్యూఢిల్లీ : బీమా కంపెనీలు వ్యాపార కక్కుర్తితో ప్రజలను తప్పుదోవ పట్టించి భారీగా మోసపూరిత పాలసీలను అంటగడుతున్నాయి. వ్యక్తుల అవసరాలకు సరిపడని, నియమ, నిబంధనలు, షరతులు గురించి పూర్తిగా వివరించకుండా కేవలం ప్రయోజనాల గురించే చెబుతూ తప్పుడు పాలసీలను (మిస్ సెల్లింగ్) విక్రయిస్తున్నాయి. ఇవి ఏడాదికేడాదికి పెరగడం గమనార్హం. ఇన్సూరెన్స్ రెగ్యూలేటరీ అండ్ డెవల ప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) 2024-25 రిపోర్ట్ ప్రకారం.. 2023-24లో జీవిత బీమా కంపెనీలకు వ్యతిరేకంగా 1,20,726 ఫిర్యాదులు నమోదయ్యాయి. 2024-25లోనూ ఇదే స్థాయిలో 1,20,429 ఫిర్యాదులు వచ్చాయి. కాగా.. బీమా కంపెనీల అనైతిక వ్యాపార విధానాలపై ఫిర్యాదులు 26,667కు పెరిగాయి. 2023-24లో 23,335 అనైతిక ఫిర్యాదులు నమోదయ్యాయి. గతేడాది మొత్తం ఫిర్యాదుల్లో అనైతిక వ్యాపార పద్ధతులకు సంబంధించినవి 19.33 శాతం నుంచి 22.14 శాతానికి పెరిగాయని ఐఆర్‌డీఏఐ వెల్లడించింది. పలు బ్యాంక్‌లు, బీమా ఏజెంట్ల ద్వారా మిస్ సెల్లింగ్ పాలసీ విక్రయాలు జరుగుతున్నాయి.
”అనైతిక బీమా పాలసీ విక్రయాలను నిరోధించేందుకు గాను తగిన విధానాలను అమలు చేయాలని బీమా సంస్థలకు సూచించాం. పాలసీదారునకు అనుకూలమైనా ప్లాన్‌ను అంచనా వేయడం, పంపిణీ ఛానల్ వ్యాప్తంగా కొన్ని నియంత్రణలు అమలు చేయడం, మిస్ సెల్లింగ్‌పై ఫిర్యాదుల పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాలని.. తప్పుడు పాలసీల విక్రయానికి మూల కారణాలను గుర్తించేందుకు అధ్యయనం చేయాలని సూచించాము.” అని ఐఆర్‌డీఏఐ తన నివేదికలో పేర్కొంది.
2024-25 సంవత్సరానికి జీడీపీలో బీమా రంగం వాటా 3.7 శాతంగా ఉందని ఐఆర్‌డీఏఐ తెలిపింది. ఇది ప్రపంచ సగటు 7.3 శాతం కంటే చాలా తక్కువ. 2024-25లో ఐఆర్‌డిఎఐ గ్రివెన్స్ కాల్ సెంటర్, బీమా బరోసాకు మొత్తంగా 2.57 లక్షల కాల్స్ వచ్చాయని తెలిపింది. ఇందులో 1.20 లక్షలు జీవిత బీమా, 1.37 లక్షల కాల్స్ వైద్య, సాధారణ బీమా అనుమానాలు, ఫిర్యాదులకు సంబంధించినవి ఉన్నాయి.
బీమా కంపెనీల కక్కుర్తి
- Advertisement -
- Advertisement -



