బీఆర్‌ఎస్ కార్యకర్త మృతి
కర్రలు, రాళ్లతో దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తం.. పోలీసు బందోబస్తు
నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో ఘటన
నవతెలంగాణ -నూతనకల్
గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఓ బీఆర్‌ఎస్ కార్యకర్త మృతి చెందాడు. పలువురికి గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..లింగంపల్లి గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీ రిజర్వేషన్ అయింది. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాదాసు వెంకన్న పోటీలో ఉన్నాడు. కాంగ్రెస్ అభ్యర్థిగా దేశపంగు మురళి పోటీలో ఉన్నాడు.
అయితే, బీఆర్‌ఎస్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎలాగైనా బీఆర్‌ఎస్ గెలుపును అడ్డుకోవాలని కాంగ్రెస్ నాయకులు అనుకున్నారు. ఈ క్రమంలో ప్రచారం ముగియడంతో ఓట్ల సందర్భంగా వ్యవహరించాల్సిన విధానాలపై చర్చించేందుకు బీఆర్‌ఎస్ మండలాధ్యక్షులు మున్న మల్లయ్యయాదవ్, ఉప్పుల మల్లయ్య(57), మున్న లింగయ్య మరికొంత మంది కలుసుకున్నారు. దాంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఉప్పుల సతీష్, కొరివి గంగయ్యతోపాటు మరికొంత మంది అక్కడికి చేరుకొని బీఆర్‌ఎస్ నాయకులను అడ్డుకుని.. వెంట తెచ్చుకున్న రాళ్లు, కర్రలతో దాడి చేశారు. మున్న మల్లయ్యపై దాడి చేస్తుండగా అడ్డుకున్న ఉప్పుల మల్లయ్య తలపై కర్రలతో కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు. అయినా వదలకుండా రాయితో తలపై గట్టిగా కొట్టడంతో మెదడు చితికింది. దాడిలో ఇరు పార్టీల వారికి గాయాలయ్యాయి.
అక్కడ ఉన్న కొంతమంది 100కు ఫోన్ చేయడంతో పోలీసులు గ్రామానికి చేరుకోవడంతో పరారయ్యారు. మల్లయ్యను వెంటనే సూర్యాపేట జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మల్లయ్య మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మల్లయ్య మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుని భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. గ్రామాన్ని ఏఎస్పీ రంగారెడ్డి, డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ నర్సింహారావు సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్త్ ఏర్పాటు చేశారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
మల్లయ్య మృతదేహాన్ని సందర్శించిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఉప్పుల మల్లయ్య మృతదేహాన్ని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో కాంగ్రెస్ గుండాల అరాచకాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయన్నారు. తుంగతుర్తిలో రౌడీయిజం పెరుగుతోందని తాము పలుమార్లు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు యథేచ్ఛగా బెదిరింపులు, దాడులకు పాల్పడుతూ రాజకీయ హత్యలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ తదితరులు ఉన్నారు.



