ముంబయి : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోమారు వడ్డీ రేట్లకు కోత పెట్టింది. రెపోరేటును పావు శాతం తగ్గించి 5.25 శాతానికి పరిమితం చేసింది. ఆర్‌బిఐ గవర్నర్ సంజరు మల్హోత్రా అధ్యక్షతన మూడు రోజుల పాటు సాగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలను ఆయన శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ కాలంలో మూడు సార్లు వడ్డీ రేట్లను 100 బేసిస్ పాయింట్లు తగ్గించామని గుర్తు చేశారు. నాలుగోసారి కూడా 25 బేసిస్ పాయింట్లు తగ్గించామని చెప్పారు. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు రెపో రేటు 1.25 శాతం వరకు దిగొచ్చింది. ఈ క్రమంలో గృహ, వాహన, రిటైల్, వ్యక్తిగత రుణాలపై భారం తగ్గుతోంది. రూపాయి పతనం కొనసాగుతున్నప్పటికీ.. ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి పడిపోవడంతో వృద్ధి రేటు పెరగడంతో రేట్ల కోత చేపట్టామని మల్హోత్రా అన్నారు. బాహ్య వాతావరణం ప్రతికూల సవాళ్లతో కూడుకున్నప్పటికీ భారతీయ ఆర్థిక వ్యవస్థ మెరుగైన ప్రగతిని ప్రదర్శించిందన్నారు.
తగ్గిన ద్రవ్యోల్బణం మరింత వృద్ధికి మద్దతుగా నిలవడానికి వీలు కల్పించనుందని పేర్కొన్నారు. ”జీఎస్టీ శ్లాబుల తగ్గింపునతో కొనుగోళ్లు పెరగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో 8.2శాతం వృద్ధి నమోదయ్యింది. దీంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ జీడీపీ అంచనాలను 6.8 శాతం నుంచి 7.3 శాతానికి పెంచుతున్నాం. ధరలు కూడా తగ్గుముఖం పట్టినందున 2025-26కు గాను ద్రవ్యోల్బణం అంచనాలను 2.6 శాతం నుంచి 2 శాతానికి అంచనా వేస్తున్నాము. విదేశీ మారక నిల్వలు 686 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. రాబోయే 11 నెలల వరకు దిగుమతులకు ఇవి సరిపోతాయి.” అని మల్హోత్రా తెలిపారు. ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వార్తలతో స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడింగ్ అయ్యాయి. వారాంతం సెషన్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 447 పాయింట్ల లాభంతో 85,712కు చేరింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 26,186 వద్ద ముగిసింది.
వడ్డీ రేట్లు మరో పావు శాతం తగ్గింపు : ఆర్బీఐ
- Advertisement -
- Advertisement -



