నవతెలంగాణ-హైదరాబాద్: వివేకా హత్యకేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ అధికారులు కోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు ముగిసిందని సీబీఐ అధికారులు సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. వివేకా హత్య కేసులో ఇంకా విచారించాల్సిందేమీ లేదని తేల్చిచెప్పారు. తమ తరఫు నుంచి దర్యాప్తు ముగిసిందని తెలిపారు సీబీఐ అధికారులు. న్యాయస్థానం దర్యాప్తుపై ఏమైనా ఆదేశాలిస్తే వాటిని అమలు చేస్తామని పేర్కొన్నారు. జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు వివేకా హత్య కేసు విచారణ జరిగింది.
వివేకా కుమార్తె సునీత తరఫు సీనియర్ కౌన్సిల్ వేరే కోర్టులో ఉన్నందున జూనియర్ లాయర్ విచారణ పాస్ ఓవర్ కోరారు. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే వివేకా హత్య కేసును తదుపరి కొనసాగిస్తామని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనానికి సీబీఐ అధికారులు వివరించారు. కాగా, వివేకా కేసుపై ఇవాళ (మంగళవారం) మరోసారి జస్టిస్ ఎంఎం సుందరేశ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.