పోటీ నిబంధనల ఉల్లంఘనపై సీసీఐ దృష్టి
నలుగురు ఉన్నతాధికారులపై డీజీసీఏ వేటు
న్యూఢిల్లీ : బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ఇండిగో నిర్వహణ, ఏకచత్రాదిపత్యంపై కాంపీటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణ చేపట్టినట్టు సమాచారం. ఆ సంస్థ నిర్లక్ష్యంతో ఇప్పటికీ వందలాది విమానాల రద్దు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ సంక్షోభంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ జరుపుతోంది. ఈ వ్యవహారంపై కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దృష్టి పెట్టి పెట్టడంతో ఇండిగోకు ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది. దేశీయ పౌర విమానయాన రంగంలో ఇండిగోకు దాదాపు 65శాతం మార్కెట్ వాటా ఉంది. మెజారిటీ వాటా కలిగిన ఈ సంస్థ డిసెంబర్ 2 నుంచి వందల విమానాలను రద్దు చేసింది.
దీంతో కొన్ని లక్షల మంది ప్రయాణాలపై ప్రభావం పడింది. కాగా.. అతిపెద్ద మార్కెట్ వాటా కలిగిన ఇండిగో.. పోటీ నిబంధనలనూ ఉల్లంఘించిందా..? అనే అంశంపై సీసీఐ ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించినట్టు తెలుస్తోంది. పెద్ద ఎత్తున విమానాల రద్దునకు అతిపెద్ద మార్కెట్ వాటా కలిగి ఉండడం కూడా ప్రధాన కారణమై ఉండొచ్చనే కోణంలో సీసీఐ అంతర్గతంగా పరిశీలిస్తోందని సమాచారం. దీనిపై ఎలాంటి ఫిర్యాదూ రాలేదని, సుమోటోగా అంశాన్ని సీసీఐ పరిశీలిస్తోందని ఓ అధికారి తెలిపినట్టు రిపోర్టులు వస్తోన్నాయి. విమానయాన రంగంలో ఆధిపత్య స్థానం, ఆధిపత్య దుర్వినియోగం వంటి అంశాలను సీసీఐ పరిశీలిస్తోంది. కాంపిటేషన్ యాక్ట్ ప్రకారం.. అత్యధిక మార్కెట్ వాటా కలిగి ఉండడం పోటీని ఉల్లంఘించినట్టు కాదు. ఒకవేళ ఆ ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తే పోటీ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని ఓ అధికారి తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు చేసి, అందులో పోటీ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సమగ్ర దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉంటుంది.
ప్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్లపై వేటు
ఇండిగో సంక్షోభంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ క్రమంలో నలుగురు ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్లపై వేటు వేసింది. సిబ్బంది తొలగింపునకు సంబంధించి స్పష్టమైన కారణాన్ని డీజీసీఏ వెల్లడించలేదు. కార్యాచరణ పర్యవేక్షణలో లోపం వల్లే ఈ సంక్షోభం తలెత్తినట్టు డీజీసీఏ భావిస్తోంది.
ఇండిగో ఏకచత్రాధిపత్యంపై దర్యాప్తు..
- Advertisement -
- Advertisement -



