Thursday, June 5, 2025
E-PAPER
Homeఆటలుఐపీఎల్‌18బాద్‌షా బెంగళూర్‌

ఐపీఎల్‌18బాద్‌షా బెంగళూర్‌

- Advertisement -

– ఫైనల్లో 6 పరుగుల తేడాతో ఆర్‌సీబీ గెలుపు
– తొలిసారి ట్రోఫీ అందుకున్న ఆర్‌సీబీ
– పంజాబ్‌ కింగ్స్‌కు తప్పని భంగపాటు

18 వసంతాలుగా ఎదురుచూసిన క్షణాలు అహ్మదాబాద్‌లో సాక్షాత్కారం. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 18వ సీజన్‌ చాంపియన్‌గా అవతరించింది. ఐపీఎల్‌ ట్రోఫీ వేటలో గతంలో మూడు సార్లు అంతిమ సమరంలో బోల్తాకొట్టిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌.. మంగళవారం అహ్మదాబాద్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది. సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ఈడెన్‌గార్డెన్స్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్‌పై విజయంతో టైటిల్‌ వేటను ఘనంగా మొదలెట్టిన ఆర్‌సీబీ.. ఫైనల్లోనూ అదరగొట్టింది. ఐపీఎల్‌18లో సొంతగడ్డ ఆవల ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ బెంగళూర్‌ విజయం సాధించటం విశేషం.
పంజాబ్‌ కింగ్స్‌కు భంగపాటు తప్పలేదు. గత సీజన్‌లో కోల్‌కతను చాంపియన్‌గా నిలిపిన శ్రేయస్‌ అయ్యర్‌ ఈసారి రన్నరప్‌ టైటిల్‌తో సరిపెట్టాడు. 191 పరుగుల లక్ష్యానికి 6 పరుగుల దూరంలో నిలిచిన పంజాబ్‌ కింగ్స్‌ టైటిల్‌ను చేజార్చుకుంది. కోహ్లి (43) రాణించటంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ తొలుత 190 పరుగులు చేసింది. ఐపీఎల్‌18 విజేతగా నిలిచిన రాయల్‌ చాలెంజర్స్‌.. ఐపీఎల్‌ టైటిల్‌పై తొలిసారి తన పేరును లిఖించుకుంది.

నవతెలంగాణ-అహ్మదాబాద్‌
ఐపీఎల్‌ కొత్త చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో పంజాబ్‌ కింగ్స్‌పై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 191 పరుగుల ఛేదనలో పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులే చేసింది. శశాంక్‌ సింగ్‌ (61 నాటౌట్‌, 30 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఒంటరి పోరాటం వృథా కాగా..జోశ్‌ ఇంగ్లిశ్‌ (39, 23 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లు), ప్రియాన్షు ఆర్య (24, 19 బంతుల్లో 4 ఫోర్లు), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (26, 22 బంతుల్లో 2 సిక్స్‌లు) ఆశించిన ప్రదర్శన చేయలేదు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (1) ఒక్క పరుగుకే అవుటై పంజాబ్‌ కింగ్స్‌ను ఓటమి కోరల్లోకి నెట్టాడు.కృనాల్‌ పాండ్య (2/17) నాలుగు ఓవర్లలో 17 పరుగులకే రెండు వికెట్లు పడగొట్టి ఇరు జట్లకు వ్యత్యాసంగా నిలిచాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి (43, 35 బంతుల్లో 3 ఫోర్లు), జితేశ్‌ శర్మ (24, 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), లివింగ్‌స్టోన్‌ (25, 15 బంతుల్లో 2 సిక్స్‌లు), రజత్‌ పాటిదార్‌ (26, 16 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) రాణించారు.
శ్రేయస్‌ చేజేతులా..!
పంజాబ్‌ కింగ్స్‌ లక్ష్యం 191 పరుగులు. అహ్మదాబాద్‌ పిచ్‌పై ఇదేమీ కష్టమైన టార్గెట్‌ కాదు. పంజాబ్‌ కింగ్స్‌ బ్యాటర్లు ఫామ్‌లో ఉండటంతో ఛేదన నల్లేరు మీద నడకే అనిపించింది. అందుకు తగినట్టుగానే ఓపెనర్లు ప్రియాన్షు ఆర్య (24), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (26) తొలి వికెట్‌కు శుభారంభం అందించారు. జోశ్‌ ఇంగ్లిశ్‌ (39) సైతం జోరు కొనసాగించగా..72/2తో పంజాబ్‌ కింగ్స్‌ మంచి స్థితిలో నిలిచింది. క్వాలిఫయర్‌2లో అజేయ అర్థ సెంచరీతో కదం తొక్కిన శ్రేయస్‌ అయ్యర్‌ (1) ఎదుర్కొన్న రెండో బంతికే అవుట్‌ కావటం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. రొమారియో షెఫర్డ్‌ వేసిన సాధారణ బంతిని ఆలస్యంగా ఆడిన అయ్యర్‌ వికెట్ల వెనకాల క్యాచౌట్‌గా నిష్క్రమించాడు. శ్రేయస్‌ వికెట్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ శిబిరం రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేయగా.. పంజాబ్‌ కింగ్స్‌ మానసికంగా నైరాశ్యంలోకి వెళ్లింది. 79/3తో నిలిచిన పంజాబ్‌ కింగ్స్‌..98/4తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. నేహల్‌ వధేరా (15), శశాంక్‌ సింగ్‌ (61 నాటౌట్‌) ఆదుకుంటారని ఆశించగా.. భువనేశ్వర్‌ కుమార్‌ ఒకే ఓవర్లో వధేరా, మార్కస్‌ స్టోయినిస్‌ (6)ను సాగనంపాడు. అక్కడితో పంజాబ్‌ కథ ముగిసింది. ఆఖరు నాలుగు బంతులకు శశాంక్‌ సింగ్‌ 22 పరుగులు పిండుకున్నా అప్పటికే బెంగళూర్‌ విజయం ఖాయమైంది. 20 ఓవర్లలో 184 పరుగులు చేసిన పంజాబ్‌ కింగ్స్‌ 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రాయల్‌ చాలెంజర్స్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ (2/38), కృనాల్‌ పాండ్య (2/17), యశ్‌ దయాల్‌ (1/18) రాణించారు.
సమిష్టి మెరుపులతో..
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ఒత్తిడితో కూడిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూర్‌ 190 పరుగులు చేసింది. పవర్‌ప్లే, మిడిల్‌ ఓవర్లు, స్లాగ్‌ ఓవర్లలో బ్యాటర్లు రాణించారు. ఓపెనర్లు ఫిల్‌ సాల్ట్‌ (16), విరాట్‌ కోహ్లి (43) ఆశించిన ఆరంభం అందించలేదు. కానీ రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో సాల్ట్‌ ధనాధన్‌ జోరు చూపించాడు. విరాట్‌ కోహ్లి ఎదుర్కొన్న 20వ బంతికి రెండో బౌండరీ సాధించాడు. 35 బంతుల్లో 43 పరుగులు చేసిన కోహ్లి.. ఒత్తిడిలో నిపించాడు. మయాంక్‌ అగర్వాల్‌ (24), రజత్‌ పాటిదార్‌ (26) మిడిల్‌ ఓవర్లలో బెంగళూర్‌ స్కోరు బోర్డును నడిపించారు. లియాం లివింగ్‌స్టోన్‌ (25), జితేశ్‌ శర్మ (24) సహా రోమారియో షెఫర్డ్‌ (17) ఆఖర్లో అదరగొట్టారు. ఏ ఒక్క బ్యాటర్‌ అర్థ సెంచరీ సాధించకపోయినా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ (3/40) ఆఖర్లో 3 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. కైల్‌ జెమీసన్‌ (3/48), విజరుకుమార్‌ వైశాఖ్‌ (1/30) రాణించారు.

స్కోరు వివరాలు
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ ఇన్నింగ్స్‌ : ఫిల్‌ సాల్ట్‌ (సి) శ్రేయస్‌ (బి) జెమీసన్‌ 16, విరాట్‌ కోహ్లి (సి,బి) అజ్మతుల్లా 43, మయాంక్‌ అగర్వాల్‌ (సి) అర్ష్‌దీప్‌ (బి) చాహల్‌ 24, రజత్‌ పాటిదార్‌ (ఎల్బీ) జెమీసన్‌ 26, లివింగ్‌స్టోన్‌ (ఎల్బీ) జెమీసన్‌ 25, జితేశ్‌ శర్మ (బి) విజరుకుమార్‌ 24, రోమారియో షెఫర్డ్‌ (ఎల్బీ) అర్ష్‌దీప్‌ 17, కృనాల్‌ పాండ్య (సి) శ్రేయస్‌ (బి) అర్ష్‌దీప్‌ 4, భువనేశ్వర్‌ (సి) ప్రియాన్షు (బి) అర్ష్‌దీప్‌ 1, యశ్‌ దయాల్‌ నాటౌట్‌ 1, ఎక్స్‌ట్రాలు : 9, మొత్తం : (20 ఓవర్లలో 9 వికెట్లకు) 190.
వికెట్ల పతనం : 1-18, 2-56, 3-96, 4-131, 5-167, 6-171, 7-188, 8-189, 9-190.
బౌలింగ్‌ : అర్ష్‌దీప్‌ సింగ్‌ 4-0-40-3, కైల్‌ జెమీసన్‌ 4-0-48-3, అజ్మతుల్లా ఓమర్‌జారు 4-0-35-1, విజరుకుమార్‌ 4-0-30-1, యుజ్వెంద్ర చాహల్‌ 4-0-37-1.
పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌ : ప్రియాన్షు ఆర్య (సి) సాల్ట్‌ (బి) హాజిల్‌వుడ్‌ 24, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (సి) భువనేశ్వర్‌ (బి) కృనాల్‌ 26, జోశ్‌ ఇంగ్లిశ్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) కృనాల్‌ 39, శ్రేయస్‌ అయ్యర్‌ (సి) జితేశ్‌ (బి) షెఫర్డ్‌ 1, నేహల్‌ వధేరా (సి) కృనాల్‌ (బి) భువనేశ్వర్‌ 39, శశాంక్‌ సింగ్‌ నాటౌట్‌ 61, మార్కస్‌ స్టోయినిస్‌ (సి) యశ్‌ దయాల్‌ (బి) భువనేశ్వర్‌ 6, అజ్మతుల్లా ఓమర్‌జారు (సి) ఎంఎస్‌ (బి) యశ్‌ దయాల్‌ 1, కైల్‌ జెమీసన్‌ నాటౌట్‌ 0, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం :(20 ఓవర్లలో 7 వికెట్లకు) 184.
వికెట్ల పతనం : 1-43, 2-72, 3-79, 4-98, 5-136, 6-142, 7-145.
బౌలింగ్‌ : భువనేశ్వర్‌ కుమార్‌ 4-0-38-2, యశ్‌ దయాల్‌ 3-0-18-1, హాజిల్‌వుడ్‌ 4-0-54-1, కృనాల్‌ పాండ్య 4-0-17-2, సుయాశ్‌ శర్మ 2-0-19-0, రోమారియో షెఫర్డ్‌ 3-0-30-1.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -