– న్యూజిలాండ్‌తో తొలి వన్డే నేడు
– కొత్త ముఖాలతో బలహీనంగా కివీస్
– మ|| 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-వడోదర
ఆధునిక క్రికెట్‌లో భారత జట్టుకు విరామం అరుదు. 22 రోజుల విరామం అనంతరం భారత్ అంతర్జాతీయ క్రికెట్ సీజన్‌కు సిద్ధమైంది. ఈ ఏడాది వన్డేలకు ప్రాధాన్యత లేకపోయినా.. 2027 ఐసీసీ ప్రపంచకప్ నేపథ్యంలో టీమ్ ఇండియా ప్రణాళికల్లో ఈ ఫార్మాట్ కీలకం. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మెరుపుల కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా.. ప్రత్యర్థి బలహీనంగా కనిపిస్తోంది. కివీస్ శిబిరంలో 8 మంది క్రికెటర్లకు భారత్‌లో ఆడిన అనుభవం లేదు, ఇద్దరికి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం సైతం లేదు. ఐదుగురు పది వన్డేలు కూడా ఆడలేదు. దీంతో బలమైన భారత్‌కు ఎదురుందా? కొత్త ముఖాలతో కూడిన న్యూజిలాండ్ ఆతిథ్య జట్టుకు సవాల్ విసరగలదా? ఆసక్తికరం. వడోదరలో భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే నేడు.
ఆ ఇద్దరు వస్తున్నారు
శ్రేయస్ అయ్యర్ మూడు నెలల విరామం తర్వాత మళ్లీ వన్డే ఆడనున్నాడు. జాతీయ జట్టుకు ఈ ఒక్క ఫార్మాట్‌లోనే ఆడుతున్న అయ్యర్.. పునరాగమనంలో సత్తా చాటేందుకు చూస్తున్నాడు. దేశవాళీలో దుమ్మురేపిన శ్రేయస్ అయ్యర్ నేడు వడోదరలో మెగా ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. జశ్‌ప్రీత్ బుమ్రా లేని వేళ పేసర్ మహ్మద్ సిరాజ్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఈ ఫార్మాట్‌లో తనేంటో మళ్లీ నిరూపించుకోవాలనే తపన సిరాజ్‌లో కనిపిస్తోంది. నేడు వడోదర వన్డేలో బ్యాట్‌తో శ్రేయస్, బంతితో సిరాజ్‌లు ఏం చేస్తారనే ఆసక్తి ఉంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గత ఏడాదిని సారథిగా మిశ్రమ ఫలితాలు చవిచూసినా.. ఈ ఫార్మాట్‌లో గిల్‌కు మంచి గణాంకాలు ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌లో నిరాశపరిచిన గిల్.. వన్డేల్లో మెరవాలని భావిస్తున్నాడు. స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. దక్షిణాఫ్రికాతో వన్డేల్లోనూ ఈ ఇద్దరు దంచికొట్టారు. శతక దాహంతో తపిస్తున్న విరాట్ కోహ్లి న్యూజిలాండ్‌పై మూడంకెల గణాంకాలు నమోదు చేస్తాడనే అంచనాలు భారీగా ఉన్నాయి. కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ సహా వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు భారత్‌కు కీలకం కానున్నారు.
కుర్రాళ్లు మెప్పిస్తారా?
మిచెల్ శాంట్నర్, మాట్ హెన్రీ, మార్క్ చాప్‌మన్ గాయాల నుంచి కోలుకుంటుండగా.. టామ్ లేథమ్ పితృత్వ సెలవులో ఉన్నాడు. కేన్ విలియమ్సన్ అందుబాటులో లేడు. దీంతో న్యూజిలాండ్‌లో కుర్ర క్రికెటర్లకు అవకాశం దక్కింది. డెవాన్ కాన్వే, మైకల్ బ్రాస్‌వెల్, విల్ యంగ్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, కైల్ జెమీసన్, డార్లీ మిచెల్ ఆ జట్టులోని సీనియర్ క్రికెటర్లు. అందులో కాన్వే, డార్లీ, ఫిలిప్స్, జెమీసన్‌లకు భారత్‌లో మంచి రికార్డుంది. కుర్రాళ్లు మైకల్ రే, ఆదిత్య అశోక్, నిక్ కెల్లీ, జాక్ ఫౌల్కీస్ దేశవాళీ సర్క్యూట్‌లో ప్రతిభ చాటారు. సీనియర్, జూనియర్ మేళవింపుతో కివీస్ కొత్త చరిత్ర సృష్టించాలనే ఆలోచనలో ఉఉఉంది. భారత్‌లో తొలిసారి టెస్టు సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్.. ఇప్పుడు తొలిసారి వన్డే సిరీస్ విజయం అందుకోవాలని ఉవ్విళ్లూరుతుంది.

సన్నద్థతకు సమయం అవసరం
విదేశీ పర్యటనల నుంచి నేరుగా స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడటం, వైట్‌బాల్ ఫార్మాట్ సిరీస్ తర్వాత వెంటనే రెడ్‌బాల్ సిరీస్ ఉండటంతో సన్నద్ధతకు సమయం చిక్కటం లేదని భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. ఆసియా కప్ తర్వాత వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్.. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఉండటంతో సన్నద్థతకు ఆస్కారం లేకుండా పోయిందని, భవిష్యత్‌లో ఇటువంటి షెడ్యూల్‌ను పునరావృతం చేయవద్దని బీసీసీఐని కోరాడు.



