Thursday, November 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'ఏకగ్రీవా'లకు ప్రోత్సాహమేదీ?

‘ఏకగ్రీవా’లకు ప్రోత్సాహమేదీ?

- Advertisement -

– గత ప్రభుత్వం చేయిచ్చింది..
– ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో ఏంటో మరి?
– ఇప్పటి వరకు అధికార ప్రకటన లేదు..
– రూ.10లక్షల నుంచి15 లక్షలు ఇస్తామని మంత్రులు, ఎమ్మెల్యేల వెల్లడి
– గ్రామాల్లో ఎన్నికల సందడి
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

సర్పంచ్‌ ఎన్నికలు నగారా మోగడంతో గ్రామాల్లో సందడి మొదలైంది. మూడు దశల్లో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ డిసెంబర్‌ 17తో ముగుస్తుంది. ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది ఆయా రాజకీయ పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు. పోటీలో ఉండాలని చాలా మంది ఉత్సాహపడుతున్నారు. మరోవైపు ఏకగ్రీవాల కోసమూ చూస్తున్నారు. ఏకగ్రీవాల కోసం ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ప్రకటన రాలేదు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు రూ.10లక్షల నుంచి 15 లక్షలు ఏకగ్రీవ పంచాయతీలకు ఇస్తామంటున్నారు. కేంద్ర మంత్రి బండి సంజరు కేంద్రం నుంచి రూ.15 లక్షలు ఇప్పిస్తామని తన నియోజకవర్గం పరిధిలోని గ్రామ పంచాయతీలకు ప్రకటించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో బండి సంజయ్‌ ఇంటింటికీ కేంద్రం నుంచి డబ్బులు ఇప్పిస్తామని ప్రకటించారు. అది నెరవేరలేదు. జీహెచ్‌ఎంసీ పాలకవర్గం కూడా ఫిబ్రవరితో ముగియనుంది. బండి సంజయ్‌ హామీ అలాగే ఉంది. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా రూ.15లక్షలు అంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు చేసే ప్రకటనలకు విలువ ఉంటుందా అన్నదే ప్రశ్న. గత ప్రభుత్వం నజరానాలు భారీగా ప్రకటించినా ఆ నిధులివ్వలేదు. ఈసారి ప్రభుత్వం నుంచి ప్రకటన రాకపోవడంతో ఆయా గ్రామ పంచాయతీల్లోని నేతలు ఎదురు చూస్తున్నారు.

ఐకమత్యంగా ఉండి ప్రజావాతావరణంలో పల్లెలను తీర్చిదిద్దుకోవాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు నజరానాలు ప్రకటించింది. సర్పంచ్‌, వార్డు సభ్యులను ఏకగ్రీవం చేసుకున్న ప్రతి గ్రామపంచాయతీకీ రూ.10 లక్షలు ఇస్తానంది. పైగా నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి ఆయా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కో గ్రామపంచాయతీకి మరో రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులు కేటాయిస్తామని కూడా ప్రకటించారు. వెరసి రూ.20లక్షల నిధులొస్తాయి. దీంతో గ్రామాన్ని ఎంతోకొంత అభివృద్ధి చేసుకోవాలన్న తలంపుతో రాష్ట్ర వ్యాప్తంగా 16శాతం గ్రామపంచాయతీ పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 237 చోట్ల గ్రామ పంచాయతీ పాలకవర్గాలు ఏకగ్రీవమయ్యాయి.

ఏకగ్రీవ పంచాయతీలు ఇలా..
రాష్ట్ర వ్యాప్తంగా 12,760 పంచాయతీలలో 1,13,534 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1,733 జీపీలు ఉన్నాయి. పాలకవర్గాల పదవీకాలం ముగిసినా గత ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వలేదు. అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం తమకిచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఏకగ్రీవంగా గెలిచిన వారు వాపోతున్నారు. గత ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు పాలకవర్గాలను ఏకగ్రీవం చేసుకుంటే నిధులు ఇవ్వలేదని, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకలేకపోయామని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం స్థానిక సంస్థల గ్రామపంచాయతీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. ప్రస్తుతం ఏకగ్రీవ పాలకవర్గాలకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నజరానాలూ ప్రకటించలేదు.

నిధుల కోసం ఎదురుచూశాం ..
గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ప్రభుత్వం నజరానాగా నిధులిస్తుందని ప్రకటించింది. దాంతో గ్రామాభివృద్ధి కోసం ప్రజలను, రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి ఏకగ్రీవం చేసుకున్నాం. నిధులు వస్తాయని ఎంతో కాలం ఎదురుచూశాం. మా పదవీకాలం ముగిసినా నిధులు రాకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యాం. చేయాలనుకున్న పనులు చేయలేకపోయాం. ఇప్పుడు ఏం చేస్తారో తెలియడం లేదు. – అలుగుబెల్లి ఇందిరా సత్తిరెడ్డి, ఏకగ్రీవ మాజీ సర్పంచి, శేరిబావిగూడెం, నార్కట్‌పల్లి మండలం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -