ప్రపంచ దేశాలన్నీ యుద్ధ వాతావరణంలో మునిగి తేలుతున్న సమయంలో – మూడవ ప్రపంచ యుద్ధం తప్పదని కొందరు పరిశీలకులు చెపుతున్న తరుణంలో -మానవ సమాజానికి యుద్ధం అవసరమా? పరిణతి సాధించిన మానవుడు సహదయంతో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోలేడా? – అని అనిపిస్తుంది. ఒక్క యుద్ధం కొన్ని తరాల మీద ప్రభావం చూపుతుంది కదా? కాలుష్యం పెరిగిపోయి ప్రగతి కుంటుపడుతుంది కదా? కుట్రలు, కుతంత్రాలతో వివేచన లేని నాయకులంతా అధికారం చేజిక్కించుకోవడం వల్ల, అహంభావంతో నిర్ణయాలు తీసుకుంటున్నందువల్ల కదా ప్రపంచం సమస్యలు ఎదురోవాల్సి వస్తోంది? ఏదిఏమైనా, యుద్ధం ఎప్పుడూ వాంఛనీయం కాదు. అది మానవ సమాజాన్ని అతలాకుతలం చేస్తుంది. మానవీయ విలువలకు విలువిచ్చేవారు ఎవరూ యుద్ధాన్ని కోరుకోరు. ఉగ్రవాదాన్ని అసలే సమర్ధించరు. అది ఏ మతానికి చెందిన ఉగ్రవాదమైనా! ఇప్పుడు ప్రపంచానికి కావల్సింది యుద్ధమా? బౌద్ధమా?-అన్న ఆలోచన రాగానే అశోకుడి కళింగ యుద్ధం గుర్తుకొస్తుంది. -పశ్చాత్తాపంతో ఛండాశోకుడు కరుణామయుడిగా మారడం, ఆయుధాలు వదిలేసి, బౌద్ధం స్వీకరించడం గుర్తుకొస్తుంది. అంతేకాదు, ఈ దేశాన్ని చుట్టుపక్కల దేశాలన్నింటినీ బౌద్ధ దేశా లుగా మార్చిన విషయం గుర్తుకొస్తుంది. తన స్వంత కొడుకును, కూతురినీ అందుకు వినియోగించడం గుర్తుకొస్తుంది. ఆధునిక సాహి త్యంతో పరిచయం ఉన్నవారికి ప్రపంచ ప్రసిద్ధ రచయిత లియోటాల్‌స్టారు నవల ‘వార్ అండ్ పీస్’ గుర్తుకొస్తుంది
మహాశాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఏమన్నాడంటే – ”ఈ ప్రపంచం నాశనమైతే అది తుపాకుల వల్లనో, మిస్సైల్స్ వల్లనో, ఆణు బాంబుల వల్లనో కాదు – నైతిక విలువల పతనం వల్ల నాశనమౌతుంది.”అని అన్నాడు.”శాంతిని నెలకొల్పే శక్తి ఒక్క బోధిసత్వుడికి మాత్రమే ఉంది. బుద్ధుడు ఏసుకు గురువు. ఏసు కశ్మీర్‌లో పదమూడేండ్లు ఉండి, బౌద్ధసారం గ్రహించి, బౌద్ధ జీవన విధానం నేర్చుకుని వెళ్లాడు. ఏసు ద్వారానే బుద్ధుడి బోధనలు యూరప్ దేశాలకు చేరాయి. జాలి, కరుణ, దయ గురించి మొదట చెప్పింది బుద్ధుడే! ప్రక తినీ, ప్రాణులన్నింటినీ ప్రేమించాలని చెప్పింది బుద్ధుడే! ఇప్పుడు యూరోపియనులు ఈ విషయం ఒప్పుకోరు. మళ్లీ, అది వేరే విషయం! కానీ వాస్తవం ఇదే!” అని ఐన్‌స్టీన్ రాసుకున్నాడు.
యుద్ధం అనగానే, ఇతర దేశాల్లో జరుగుతున్న యుద్ధాలతో పాటు, మన దేశంలో ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ కూడా గుర్తుకువస్తుంది కదా? ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వివరాలు ఇద్దరు మహిళా ఆర్మీ ఆఫీసర్లు ప్రపంచానికి వెల్లడించారు (బ్రీఫింగ్). అది దేశ ప్రజలకు ఎంతో గర్వాన్నిచ్చే సన్నివేశం! ఇద్దరు మహిళలు రెండు వేర్వేరు యూనిఫాంలు. వారివి భిన్నమైన మత విశ్వాసాలు, భిన్నమైన నేపథ్యం గల కుటుంబాల నుండి వచ్చినవారు. కానీ, దేశానికి సేవలందించడమే వారి లక్ష్యం! ఆ ఇద్దరు మహిళా ఆర్మీ అధికారుల్లో ఒకరు సోఫియా ఖురేషీ అయితే, మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. భారత దేశానికి ఉన్న శక్తి అదే- వివిధ మతాల, వివిధ ప్రాంతాల సమైక్యతతోనే దేశం ముందుకొచ్చింది. దేశమంతటా ప్రతిరంగంలో ప్రతిరోజూ మనం ఇలాంటి ఏకతను సాధిస్తూ వస్తున్నాం. ‘హం ఏక్ హై’ అన్న నినాదమే మనల్ని బలంగా, స్థిరంగా ఉంచుతుంది.
సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్‌ల వలెనె సావిత్రిబాయి ఫూలే, ఫాతిమా షేక్‌లు కూడా ఒకరు హిందు, మరొకరు ముస్లిం. జ్యోతి బాఫూలే నేతత్వంలో దేశంలో బాలికలకు విద్య అత్యవసరమని వీరిద్దరు 1848లో పాఠశాలలు ప్రారంభించి నిర్వహించారు. దాని ఫలితం 177 ఏండ్ల తర్వాత, తొలిసారిగా దేశంలో ఇప్పుడు మళ్లీ కనిపించింది. మిలట్రీ ఆపరేషన్‌లో ఇద్దరు మహిళలు ముందుండి నాయకత్వం వహించడం దేశం గర్వించదగ్గ అంశం. ఆనాడు అవమానాలకు, అవహేళనలకు గురైన ఫూలే దంపతుల కషి, ఫాతిమా షేక్ తోడ్పాటు వథా పోలేదని అనిపించింది. ”మా ప్రాధాన్యత మొదట దేశానికి! తరువాతే మతమైనా, మరేదైనా”- అని అన్నాడు తాజుద్దీన్. ఈయన కల్నల్ సోఫియా ఖురేషి తండ్రి. తాజుద్దీనే కాదు, ఆయన తండ్రి కూడా భారత సైన్యంలో పనిచేసిన వారే. ఇప్పుడు తాజుద్దీన్ కూతురు కల్నల్ సోఫియా ఖురేషి ‘ఆపరేషన్ సింధూర్’కు నాయకత్వం వహించింది. సోఫియా భర్త కల్నల్ తాజుద్దీన్ బాగే వాడి కూడా ఆర్మీ ఆఫీసరే. బరోడాకు(గుజరాత్) చెందిన సోఫియా, బెలగావి-బెల్షామ్ (కర్నాటక)కు చెందిన బాగేవాడిని 2015లో పెండ్లిచేసుకుంది. ఒక స్త్రీ ఎక్కడా మసీదులో మౌలానా కాలేదు. గుళ్లో పూజారి కాలేదు. చర్చ్‌లో ఫాదర్ (పోప్) కాలేదు. కానీ, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి, ప్రధానివంటి ఏ పదవికౖౖెనా ఎదగొచ్చు. ఈ రోజు ఆపరేషన్ సిందూర్‌కు నాయకత్వం వహించే అవకాశం రాజ్యాంగమే ఇచ్చింది. అందువల్ల డా.బి.ఆర్.అంబేద్కర్ ఈ దేశ ప్రజలకు ఎంత విలువైనది సమకూర్చాడో అర్థం చేసుకోవాలి!
ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది ఎందుకంటే – రాజ్యాంగం ప్రకారం దేశరక్షణకు ఏర్పాటైన త్రివిధ దళాల భారత సేన యొక్క అంకిత భావం, నైపుణ్యం మాత్రమే – మతతత్వంతో దశాబ్దకాలంగా దేశంలో ఊగిపోతున్న ‘జై శ్రీరామ్ సేన’ ప్రమేయం ఇందులో ఏమీ లేదు. అందుకే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఏమన్నాడు? ”మేం భారత సైన్యానికి వెన్నుదన్నుగా ఉంటాం. ఉగ్రవాదాన్ని రూపుమాపడంలో దేశవ్యాప్తంగా మాకేడర్ అంతా సైన్యం వెంటే ఉంది!” అని అన్నాడు. పాలకుల పేర్లు ఎవరివీ తీసు కోలేదు. మరోవైపు కొన్ని కొన్ని దారుణాలు జరుగుతున్నాయి కదా? పహల్గామ్ ఉగ్రదాడిలో అమరుడైన నేవీ ఆఫీసర్ వినరు సతీమణి పై సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం చాలా దారుణమైన విషయంగా పరిగణించాలి. ఆ సోషల్ మీడియా ఎకౌంట్లు అధికార బీజేపీకిి సంబంధించిన వ్యక్తులనే అధికంగా ఉన్నాయని తేలింది. అలాంటి ఎకౌంట్లు ఎందుకు బ్లాక్ చెయ్యలేదూ? అధికారంలో ఉన్న నాయకుల జాతీయవాదం ఇదేనా? కల్నల్ సోఫియా ఖురేషిని ‘ఉగ్రవాదుల సోదరి’గా అభివర్ణించారొక అధికార పార్టీ నేత. పాకిస్థాన్‌కు దేశరహస్యాలు అందించిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అధికార పార్టీకి సంబంధాలున్న వ్యక్తి. మరో అధికార పార్టీ నేత ‘తప్పంతా పహల్గామ్ దాడిలో భర్తల్ని కోల్పోయిన మహిళలది’ అన్నాడు. ‘భర్తల్ని కాల్చి చంపుతుంటే, ఈ మహిళలు ఉగ్రవాదులపై ఎందుకు తిరగబడలేదని’ ప్రశ్నించాడు. టూరిస్టులకు భద్రత కల్పించలేని కేంద్ర ప్రభుత్వం, ఈ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి, పౌరులదే తప్పు అన్నట్లు మాట్లాడొచ్చా? మరో అధికార పార్టీ నేత హైవే మీదనే ఒక మహిళతో లైంగిక కార్యక్రమం నిర్వహించాడు. నైతికతలేని, విద్యలేని, దార్శనికులు కాని వారంతా అధికారంలో ఉంటే- దేశం ఎలా ఉంటుందో దేశ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు.
నీతి, నిజాయితీ వదిలేసి మనువాదానికి భజనలు చేసే వారంతా ఎన్నికుట్రలు చేసైనా – అధికారం చేజిక్కించుకుంటున్నారు. అందుకే దేశం ఇంత ప్రమాదకరంగా తయారయ్యింది. రాజ్యాంగం స్థానంలో ‘మనుస్మృతి’ని తేవాలని పన్నుతున్న కుట్రలు దేశ ప్రజలకు స్పష్టంగా తెలిసిపోతున్నాయి. ఈ దేశం శతాబ్దాలుగా మనువాదానికి బలైపోతూ, చివరకు ఇలా తయారైంది. ‘భారత దేశ చరిత్ర అంతా బౌద్ధానికి బ్రాహ్మణిజానికి జరిగిన సంఘర్షణే’ అని అన్నారు అంబేద్కర్. నిజమేకదా? ఈ దేశం బయటి ఉగ్రవాదం కంటే అంతర్గత ఉగ్రవాదానికి ఎక్కువగా బలైపోతూ ఉంది. ఒకప్పుడు మహాన్నతమైన విలువలతో బౌద్ధ దేశంగా, విశ్వగురువుగా ప్రపంచానికి వెలుగులు పంచిన దేశాన్ని – మనువాదులు వారి ఆధిపత్యం కోసం నాశనం చేసుకుంటూ వచ్చారు. ప్రపంచంలోనే తొలి బౌద్ధ విశ్వవిద్యాలయాలు ఏర్పరిచి దేశ దేశాల విద్యార్థులకు విద్య నందించిన దేశం ఇది. ఎవరు నాశనం చేశారు? ఎందుకు నాశనం చేశారు? చరిత్ర పుటల్లోకి పరిశీలనగా చూస్తే తెలుస్తుంది.
మనం చిన్నప్పుడు తరగతి గది గోడల మీద రాసిపెట్టిన వాక్యాలు చదువుతూ పెరిగాం. సత్యమునే పలుకుము/ అబద్దమాడరాదు /జీవహింస చేయరాదు/ మంచి అన్నది పెంచుము/ ప్రేమ, కరుణ, జాలి ముఖ్యము – వంటివి. చదివీ చదివీ అవి మనకు కంఠతా వచ్చేశాయి కానీ, వాటిని ప్రపంచానికి మొదటగా చెప్పిన మహనీయుడెవరు – అన్న విషయం మన ఉపాధ్యాయులు మనకు చెప్పలేదు. తర్వాత కాలంలో సత్యాన్నీ, అహింసని ఆయుధాలుగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహానుభావులు ఎన్నో ఉద్యమాలు చేప ట్టారని తెలుసుకున్నాం. కానీ, వాటిని మొట్టమొదటగా చెప్పి, ప్రపంచం కండ్లు తెరిపించిన పరిపూర్ణుడు బుద్ధుడన్న విషయం మనం చర్చించుకోలేదు. కారణం-మనువాదుల కుట్రలు! బుద్ధుణ్ణి మరిపించి, వారు మనల్ని కల్పించిన దేవీదేవతల ఆరాధన వైపు, మూఢభక్తి వైపు మళ్లించారు. వాస్తవాల్ని మరిపించి, భ్రమల్లో ముంచేశారు. సుమారు 2,500 ఏండ్ల క్రితం ప్రపంచంలో ఎక్కడా ఏ జ్ఞానం అందు బాటులో లేని రోజుల్లో ‘కార్యకారణ సిద్ధాంతాన్ని’ చెప్పి ఆధునిక వైజ్ఞానిక పరిశోధనలకు దారివేసినవాడు బుద్ధుడు. బుద్ధుణ్ణి, బుద్ధుడి బోధనల్ని అర్థం చేసుకున్న వారెవరైనా అసలు యుద్ధాన్ని సమర్ధిస్తారా? మా’నవ’వాదమన్న పదం ఆ ప్రాచీనయుగంలో లేదు గానీ, బుద్ధుడు బోధించింది, అశోకుడు ప్రచారం చేసింది మా’నవ’వాదమే కదా?
పశ్చిమ దేశాలకు బౌద్ధాన్ని పరిచయం చేసిన జర్మన్- అమెరికన్ రచయిత,PAUL CARUS కారస్ (18 జులై 1852 – 11 ఫిబ్రవరి 1919) THE GOSPEL OF BUDDHA (1894) అనే గ్రంథం ప్రకటించాడు. అందులో బుద్ధుడు రాజగహలో చెప్పిన మాటలు కొన్ని పొందుపరిచాడు. అవి ఇలా ఉన్నాయి – ”ఒకరి నొకరు మోసగించుకోకండి. ఒకరి నొకరు తక్కువ చేసుకోకండి. మీ ఆధిక్యతను ప్రదర్శించకండి. అది, క్షణికం! కోపాల్ని, ద్వేషాల్ని, పగల్ని వదిలేయండి. తల్లి బిడ్డను వేయికండ్లతో ఎలా రక్షించుకుంటుందో ప్రాణమివ్వడానికి ఎలా సిద్ధపడుతుందో అలాంటి ప్రేమను మీరు మీతోటి వారికి పంచండి. ప్రేమకు హద్దులుండవని నిరూపించండి. జాతి, కరుణలతో కరిగిపోయే మదువైన వ్యక్తిత్వాన్ని పెంచుకోండి! ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరినైనా అక్కున చేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. అసూయా ద్వేషాలను పారద్రోలి- ఏ స్థితిలో ఉన్నా, అందరినీ ప్రేమిస్తూ, అన్యోన్యంగా ఉండటమే ఉత్తమ జీవిత మార్గం!” అన్నది బుద్ధుడు చెప్పిన జీవన సూత్రం! ఇది జీర్ణించుకున్న వారెవరైనా యుద్ధాలకు పూనుకుంటారా? ఆపరేషన్ సిందూర్‌కు నాయకత్వం వహించిన కల్నల్ సోఫియా ఖురేషి వ్యక్తిగతంగా బౌద్ధ అనుయాయి. అందువల్ల, ఈ దేశప్రజలు ఉద్యమించాలి. విజ్ఞత లేని నాయకత్వాన్ని గద్దెదించాలి!!
- కవిరాజు త్రిపురనేని రామస్వామి
జాతీయ పురస్కార తొలిగ్రహీత. - డాక్టర్ దేవరాజు మహారాజు