ఇచ్చిన హామీని నిలుపుకోలేకపోతున్న ప్రభుత్వం
సన్న వడ్లకు రూ.500 బోనస్ కోసం
రాష్ట్రంలో 4.09 లక్షల మంది నిరీక్షణ
వానాకాలం కొనుగోళ్లు ఆసన్నమైనా అందని యాసంగి బోనస్
ఖరీఫ్‌లో గణనీయంగా పెరిగిన సన్నాల సాగు
రైతులకు ప్రభుత్వం రూ.1,160 కోట్లు బాకీ
‘స్థానిక’ ఎన్నికల్లో అధికార పార్టీ విజయావకాశాలపై ప్రభావం!
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సన్న వడ్లు క్వింటాల్‌కు రూ.500 చొప్పున ఇప్పటి వరకు ఒక్క సీజన్‌కు మాత్రమే బోనస్ ఇచ్చింది. వానాకాలం వడ్ల కొనుగోళ్ల సమయం ఆసన్నమైనా యాసంగి బకాయి రూ.1,160 కోట్ల చెల్లింపులో తాత్సారం జరుగుతోంది. రాష్ట్రంలో 4.09 లక్షల మంది రైతులు బోనస్ కోసం నిరీక్షిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రూ.2 లక్షల ‘రుణమాఫీ’ హామీని పూర్తిస్థాయిలో అమలు చేయటంలో వైఫల్యం చెందిన ప్రభుత్వం బోనస్ విషయంలోనూ అదే బాటలో పయనిస్తోందన్న అభిప్రాయం రైతాంగంలో ఉంది. ‘స్థానిక’ ఎన్నికల్లో దీని ప్రభావం రైతుల్లో ఎక్కువ చూసే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
23.19 లక్షల టన్నులకు బోనస్ బాకీ
గత రబీ సీజన్‌లో ప్రభుత్వం 74 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. దీనిలో దొడ్డు రకాలు 51 లక్షల టన్నులు కాగా, 23.19 లక్షల టన్నుల సన్నాలను 4.09 లక్షల మంది రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. రబీలో సన్నాల దిగుబడులు ఆశాజనకంగా ఉండవు కాబట్టి మెజార్టీ రైతులు దొడ్డు రకాలనే సాగు చేశారు. సన్నాలను పండించిన రైతుల్లోనూ అనేక మంది కొనుగోలు కేంద్రాల్లో విక్రయించలేదు. కేంద్రాల్లో కొనుగోళ్ల కోసం నిరీక్షణ, క్వింటాకు 5 నుంచి 10 కేజీల మిల్లర్ల కోతలతో వేగలేక.. బోనస్‌పై ఆశలు వదులుకొని తూకమైనా కలిసి వస్తుందని పచ్చి వడ్లను ప్రయివేటు వ్యాపారులకు విక్రయించారు. మే నెలలో కొనుగోళ్లు పూర్తయితే ఇప్పటికీ ఐదు నెలలు కావస్తున్నా బోనస్ రూ.500 ఇప్పటికీ రాకపోవడంతో రైతాంగం ఆవేదన చెందుతోంది.
ఖరీఫ్‌లో పెరిగిన సన్నాల సాగు
బోనస్ ఐదునెలల పాటు ఆలస్యమవు తుందని రైతులు ఊహించలేకపోయారు. బోనస్‌పై ఆశతో ఈ వానాకాలం సీజన్‌లో సన్నాల సాగును జూన్, జులై నుంచి భారీగా చేపట్టారు. రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 67.33 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. దీనిలో 60శాతానికి పైగా సన్నరకాలే ఉండటం గమనార్హం. ఈసారి కొనుగోలు కేంద్రాలకు 80 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యం వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. దీనిలో 40 నుంచి 45 ఎల్‌ఎంటీల సన్న వడ్లు మార్కెట్, కొనుగోలు కేంద్రాలకు వస్తాయని భావిస్తోంది. ఈ మొత్తానికి బోనస్ క్వింటాకు రూ.500 చొప్పున లెక్కిస్తే రూ.2,200 కోట్లు అవుతాయి. ఇప్పటికే ఉన్న రబీ బోనస్ బకాయి రూ.1,159.64 కోట్లు దీనికి కలిపితే దాదాపు రూ.3,400 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
‘స్థానిక’ ఎన్నికలపై బోనస్ ప్రభావం
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారపార్టీ విజయావకాశాలపై సన్నాల బోనస్ ప్రభావం పడనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రైతు పక్షపాతిగా చెప్పుకుంటున్న ప్రభుత్వం అన్నదాతల పట్ల నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందనే చర్చ సాగుతోంది. రాజకీయాలకు అతీతంగా జెడ్పీటీసీ ఎన్నికల్లో రైతులంతా మూకుమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంటున్నారు. ఉమ్మడి మహబూ బ్‌నగర్ జిల్లాలోని కృష్ణా డెల్టా ప్రాంత రైతాంగం ఈ మేరకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోనూ పలుచోట్ల కాంగ్రెస్ వాదులు సైతం ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.
ప్రభుత్వంపై కోపం వస్తోంది
రైతు మోర కోటిరెడ్డి, మేడిదపల్లి, తిరుమలాయపాలెం
నేను ఏప్రిల్ నెలలో 230 క్వింటాళ్ల సన్నధాన్యం తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లి కొనుగోలు కేంద్రంలో అమ్మాను. క్వింటాకు రూ.500 చొప్పున రూ.1.15 లక్షల బోనస్ డబ్బులు నాకు రావాలి. మా తాతలతండ్రుల కానుంచి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నాం. ఈ ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న తీరును బట్టి ఆ పార్టీని తిట్టాల్సి వస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఇంకో రెండు నెలలు వరకు బోనస్ డబ్బులు వస్తాయన్న ఆశలేదు. కోర్టు తీర్పుతోనైనా ఎన్నికలు ఆగి బోనస్ చెల్లించాక షెడ్యూల్ వస్తే బాగుణ్ను అనిపిస్తోంది.
బోనస్ ఒక్క సీజన్‌కేనా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES