కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం
ఐదేండ్లయినా ఆదేశాల అమలు ఏదంటూ ఆగ్రహం
న్యూఢిల్లీ : కస్టడీ వేధింపులను నివారించేందుకు సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ వంటి కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తామిచ్చిన ఆదేశాలపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదని సుప్రీంకోర్టు పేర్కొంటూ ఇదంతా చూస్తుంటే కేంద్రం, న్యాయస్థానాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటోందని భావించాల్సి వస్తోందని పేర్కొంది. పోలీసు స్టేషన్లు, ఇంటరాగేట్ చేసే అధికారాలు కలిగిన కేంద్ర లా ఎన్‌ఫోర్స్‌్‌మెంట్ సంస్థల కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చి ఐదేండ్లవుతోందని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన బెంచ్ పేర్కొంది. రాజస్తాన్‌లో 8మాసాల్లో 11 కస్టడీ మరణాలు చోటు చేసుకున్నాయన్న వార్తలు రావడంతో కస్టడీలో క్రూరత్వం ఇంకా తగ్గలేదని తెలుసుకుని కోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీంతో 2020లో ఇచ్చిన తమ తీర్పును కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఏ మేరకు అమలు చేశాయో తెలుసుకోవడానికి తనకు తానుగా పున: పరిశీలించాలని బెంచ్ భావించింది. మంగళవారం ఈ అంశాన్ని పరిశీలించగా కేవలం 11మంది మాత్రమే తమ సమ్మతి తెలుపుతూ నివేదికలు ఇచ్చారు, కేంద్రమైతే కనీసం దీనిపై ఏ రీతిలోనూ స్పందించలేదని వెల్లడైంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానాన్ని ఎందుకు ఇంత తేలిగ్గా తీసుకుంటున్నారని జస్టిస్ నాథ్ ప్రశ్నించారు.కాగా కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ న్యాయస్థానాన్ని తేలిగ్గా తీసుకోవడమంటూ ఏమీ లేదని తిరస్కరించారు. త్వరలోనే అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. అఫిడవిట్ కాదు, సమ్మతిని తెలియచేసే నివేదిక అని జస్టిస్ మెహతా సరిదిద్దారు.
న్యాయస్థానమంటే ఇంత తేలికా ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



