Sunday, December 14, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిపదవి ప్రతిష్టకా? ప్రజాసేవకా?

పదవి ప్రతిష్టకా? ప్రజాసేవకా?

- Advertisement -

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ పూర్తయింది. నేడు రెండో దశ పోలింగ్‌ జరగనుంది. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రచారంలో విచిత్రమైన పరిస్థితి కనిపించింది. గ్రామాభివృద్ధికి హామీలివ్వడం సాధారణం. కానీ ఈసారి బాండుపేపర్లతో దర్శనమివవ్వడం ఆశ్చర్యం. కానీ ఇక్కడే ఒక విషయాన్ని గమనించాలి. గత సర్పంచుల్లో చాలా మంది తమ గ్రామాల కోసం వ్యక్తిగతంగా లక్షల రూపాయలు అప్పులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కొందరు యాభై లక్షలకు పైగానే అప్పులు చేశారు. అవి తీర్చలేని పరిస్థితిలో హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డులు, వాచ్‌మెన్‌లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఫలితంగా, ఈసారి సర్పంచ్‌ ఎన్నికల నుండి పక్కకు తప్పుకున్నారు.

అయినప్పటికీ కొంతమంది పోటీకి సై అంటూ ముందుకు సాగుతున్నారు. సర్పంచ్‌ అనే పదవి ప్రతిష్ట కోసమా? లేక ప్రజాసేవకా? ఇలాంటి ప్రశ్నలకు ఈ ఎన్నికల స్వభావం సమాధానం చెబుతోంది. అప్పులపాలైన వారు కండ్లముందే ఉన్నారు. అయినా ఈ పోటీలకు బాండ్‌ పేపర్‌ మీద ఆస్తులు రాసిస్తామని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో రాజకీయ మార్పులు ప్రజలు గమనించారు. అయితే గ్రామ సర్పంచ్‌ ఎన్నికలలో ఈసారి గ్రామస్థాయి వ్యక్తుల ప్రభావంతో విచిత్రమైన పొత్తులు కుదిరాయి. రాజకీయ పార్టీ భావజాలంతో సంబంధం లేకుండా నిర్ణయించబడ్డాయి. ఇలాంటి ఉదాహరణలు చాలా ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి.

ఇవి రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయాలు కాదు. గ్రామాల్లో ప్రాబల్యం ఉన్న వ్యక్తుల ప్రయోజనాల ఆధారంగా ఏర్పడ్డవి మాత్రమే. కొన్నిచోట్ల ఆధిపత్య కులాల ఆచరణలు ఆందోళనకరంగా ఉన్నాయి. వారి కనుసన్నల్లో పనిచేసే వారిని పోటీలో దించి మరి పెత్తనం సాగించాలని చూస్తున్నారు. మరికొన్ని చోట్ల పోటీచేసే అభ్యర్థులను భయపెట్టడం, విత్‌డ్రా కోసం ఒత్తిడి చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి కోసం ఏకగ్రీవాలు కూడా కొన్ని గ్రామాల్లో జరిగాయి. కొంతమంది నీతి,నిజాయితీగా పనిచేసేందుకు ముందుకు రావడం కూడా మంచి పరిణామం. వారు ఒకరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా పనిచేస్తే సంతోషం. ఈసారి ఎన్నికల సమయంలో, ఓటుకు డబ్బు, మద్యం, చికెన్‌, మటన్‌ పంపిణీ గతంలోలా ఈసారి మరింత బహిరంగంగా జరిగింది. కొందరు అభ్యర్థులు దూరప్రాంతాల ఓటర్లకు రాకపోకల కోసం అదనంగా చెల్లించే స్థితికి చేరారు.

”గెలిచినా, ఓడినా నీ దయ” అంటూ సానుభూతి ఓట్లను కోరడమూ కొనసాగుతోంది. ఓటర్లు కూడా తమ ఆర్థిక పరిస్థితుల వల్ల డబ్బు తీసుకోకుండా ఉండలేని పరిస్థితి కనిపిస్తోంది. మహిళలకు చీరలుపంపిణీ చేసిన ఘటనలు కూడా కోకొల్లలు. కానీ యువత కూడా నగదు, మద్యం ప్రలోభాలకు గురికావడం భవిష్యత్తుకు ప్రమాదం. యువకుల బాధ్యత గ్రామాల్లో చాలా పెద్దది.గ్రామసభల్లో చురుకుగా పాల్గ్గొనాలి.గ్రామానికి వచ్చే నిధులు, జరుగుతున్న పనులు, అవసరమైన సదుపాయాలుు ఇవన్నీ తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం గ్రామంలో అవగాహనా సభ నిర్వహించి ప్రజలకు సమాచారం చేరేలా చూడాలి. విద్య, వైద్యం వంటి కీలక అంశాల్లో గ్రామానికి మార్గదర్శకంగా నిలవాలి. ప్రస్తుతం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో మార్పు కోసం ప్రజలే ముందుకు రావాలి. మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది, గ్రామాభివృద్ధి నిజమవుతుంది.

అక్షర జ్వాల, 9010483021

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -