Thursday, November 13, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఎంజాయ్ మెంట్‌ సర్వేలో ఉన్నా పరిహారమేదీ?

ఎంజాయ్ మెంట్‌ సర్వేలో ఉన్నా పరిహారమేదీ?

- Advertisement -

దళారుల రంగప్రవేశంతో దగా
కేసులతో బాధితుల లూటీ
పట్టాదారులతో పరేషాన్‌
ఎకరాకు రూ.10 నుంచి రూ.20 లక్షల డిమాండ్‌
రెవెన్యూ అధికారుల అండదండలు
కొర్రీలతో గందరగోళం
ఎయిర్‌పోర్ట్‌ నిర్వాసితుల్లో తీవ్ర ఆందోళన


నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్‌ మామునూరు విమానాశ్రయం భూ నిర్వాసితులకు జిల్లా ఉన్నతాధికారులు నష్టపరిహారం విషయంలో ముందు చెప్పిన పద్ధతి ప్రకారం కాకుండా భిన్నంగా వ్యవహరిస్తుండటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంగళవారం ‘నవతెలంగాణ’ వరంగల్‌ జిల్లా ఖిలావరంగల్‌ మండలం నక్కలపల్లి, గుంటూరుపల్లి గ్రామాలను సందర్శించింది. ఈ సందర్భంగా విమానాశ్రయం భూ నిర్వాసితులను కలుసుకొని నష్టపరిహారం విషయంలో రెవెన్యూ రికార్డుల్లో ఉన్న కొర్రీలు, సమస్యలను అడిగి తెలుసుకుంది. దళారులు రంగప్రవేశం చేసి 1963, 1969 పహానీల ఆధారంగా కాగితాలు సృష్టించి ఎంజారుమెంట్‌ సర్వేలో నిర్ధారించిన రైతులకు నష్టపరిహారం రాకుండా అడ్డుకుంటున్నారని తెలిసింది.

ఈ విషయంలో వరంగల్‌ జిల్లా రెవెన్యూ అధికారులు సైతం దళారులకు ప్రాధాన్యతనిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలుత ఎంజారుమెంట్‌ సర్వేలో కాస్తు కబ్జాలో ఉన్న వాళ్లకే నష్టపరిహారం ఇస్తామన్న అధికారులు, ఇప్పుడు పట్టాదారుల ఆమోదం ఉంటేనే చెల్లిస్తామనడంతో పట్టాదారులు పలువురు ఎకరాకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. కొంత మంది పట్టాదారులు ఎక్కడున్నారో కూడా తమకు తెలీదని నిర్వాసితులు వాపోతున్నారు. కలెక్టర్‌తోపాటు పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు.. తొలుత ఇచ్చిన హామీకి భిన్నంగా నష్టపరిహారంలో కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వరంగల్‌ మామునూరు విమానాశ్రయం భూసేకరణ విషయంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ భూమి ఎంజారుమెంట్‌ సర్వేలో ఉన్న రైతులందరికీ నష్టపరిహారం ఇస్తామని చెప్పారని గుంటూరుపల్లికి చెందిన భూ నిర్వాసితుడు శాఖమూరి నరహరి ‘నవతెలంగాణ’కు తెలిపారు. ఇప్పుడు తమపై ఫిర్యాదు చేశారని, వారు వచ్చి సంతకం పెడితే మీకు నష్టపరిహారం ఇస్తామంటూ రెవెన్యూ అధికారులు చెబుతున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 150 ఎకరాలకు సంబంధించిన నష్టపరిహారం రైతుల ఖాతాల్లో జమ చేశారు. మరో 70 ఎకరాలకు సంబంధించి పలు వివాదాలు తెరపైకి వచ్చాయి. ఇందులో 50 ఎకరాలకు సాదాబైనామాల వివాదాలున్నాయి. ఈ గ్రామం గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో భాగం కావడంతో సాదాబైనామాలను రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి, ధరణిలో నమోదు చేసుకునే అవకాశం లేకుండాపోయింది. 20 ఎకరాలకు సంబంధించి పట్టాదారుల వివాదాలున్నాయి. మరో 10 ఎకరాలకు సంబంధించి పలు కేసులు వేయడంతో పెండింగ్‌లో పడ్డాయి. భూ నిర్వాసితులు వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద, ఆర్డీవో తదితర అధికారులను తప్పుపడుతున్నారు.

రెవెన్యూ ‘కొర్రీ’లతో నిర్వాసితులు పరేషాన్‌
మామునూరు విమానాశ్రయానికి 280.30 ఎకరాల భూసేకరణలో భాగంగా భూనిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చేందుకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లను విడుదల చేసింది. తాజాగా మరో రూ.90 కోట్లు విడుదలయ్యాయి. వ్యవసాయ భూమి ఎకరాకు రూ.1.20 కోట్ల నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ‘నాలా’ ఉన్న వారికి ఒక గజం రూ.5,500 నష్టపరిహారం ఇవ్వడానికి అధికారులు నిర్ణయించారు. తాజాగా ఈ విషయాల్లో రెవెన్యూ అధికారులు కొర్రీలు పెడుతుండటం గమనార్హం. ‘నాలా’ ఉన్నా వ్యవసాయ భూమిగానే పరిగణించి నష్టపరిహారం ఇస్తామని చెబుతుండటంతో నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది నిర్వాసితులకు ఇప్పటికే నష్టపరిహారం వారి ఖాతాల్లో పడటంతో రెవెన్యూ అధికారులు ముందు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని వాపోతున్నారు. వ్యవసాయం చేసుకునేటోళ్లం ప్రతిరోజూ కలెక్టర్‌ ఆఫీసు చుట్టూ తిరగలేమని అంటున్నారు.

దళారుల దందా
ఇదే సమయంలో భూనిర్వాసితుల నష్టపరిహారం కాజేయడానికి కొందరు దళారులు రంగప్రవేశం చేశారు. 1963, 1968 నాటి పహానీల ఆధారంగా కాగితాలను సృష్టించి నిర్వాసితులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీరికి మద్దతుగా ఇదే గ్రామానికి చెందిన ఒక దళారి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కయినట్టు తెలిసింది. దశాబ్దాల క్రితమే తాము కొనుగోలు చేసుకొన్న భూముల్లో రైతులు వ్యవసాయ చేస్తున్నా, తెలంగాణ పాసు పుస్తకాలు, ధరణిలో చూపెడుతున్నా, రైతుబంధు డబ్బులు పడుతున్నా ఇప్పుడు ఈ నష్టపరిహారం ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు మోకాలడ్డుతుండటం పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గుంటూరుపల్లికి చెందిన శాఖమూరి నరహరితోపాటు 19 మంది 1998లో 5.18 ఎకరాలు కొనుగోలు చేశారు. ధరణిలో ఈ భూమిని చూపెడుతుంది. రైతుబంధు నిధులను రాష్ట్ర ప్రభుత్వం వీరి ఖాతాలో జమ చేసింది. వీరికి చెందిన సర్వేనెంబర్‌ 244లో 1968లో పహానీ ఆధారంగా దొంగ కాగితాలు సృష్టించి ఆ భూమి తమదని, నష్టపరిహారం తమకే ఇవ్వాలని పలువురు వ్యక్తులు ఒక దళారి అండదండలతో రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. దాంతో నరహరితోపాటు పలువురు నిర్వాసితులకు నష్టపరిహారాన్ని నిలిపివేశారు. వీరంతా కలెక్టర్‌ను సంప్రదిస్తే వారు సంతకాలు చేస్తే మీకు నష్టపరిహారం ఇస్తామని చెబుతుండటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ముందు చెప్పిందొకటి.. ఇప్పుడు చేస్తుందొకటి : శాఖమూరి నరహరి, భూ నిర్వాసితుడు, గుంటూరుపల్లి
కాస్తు కబ్జాలో ఉన్న వాళ్లకే నష్టపరిహారం ఇస్తామని ముందు చెప్పిన అధికారులు ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. దళారులు రంగంలోకి దిగి 1960నాటి పహానీల ఆధారంగా దొంగ కాగితాలు సృష్టించి మాకు నష్టపరిహారం రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు దళారులకే మద్దతు పలుకుతున్నారు. మంత్రి, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని మాకు వెంటనే నష్టపరిహారం ఇప్పించాలి.

పసుపు, కుంకుమ కింద ఇచ్చి ఇప్పుడు కేసు : కొంగర భాస్కర్‌, గుంటూరుపల్లి
మా మేనమామ పసుపు, కుంకుమ కింద 1992లో 2.20 ఎకరాలు నాకివ్వడంతో ఆయన కూతురిని పెండ్లి చేసుకున్నా. అప్పటి నుంచి ఈ భూమి కాస్తు, కబ్జాలో నేనే ఉన్నా. ఇందులో 30 గుంటల భూమి మామునూరు విమానాశ్రయం కింద పోయింది. పట్టాదారు కాలమ్‌లో మా మేనమామ పేరే ఉంది. దాంతో మా మేనమామే ఇప్పుడు నష్టపరిహారం తనకు రావాలని నాపై కేసు పెట్టిండంట. ఈ విషయం సోమవారం వరంగల్‌ కలెక్టరేట్‌లో ఆర్‌డీవోను కలిసినప్పుడు తెలిసింది. ఈ నష్టపరిహారం వస్తే బిడ్డ పెండ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా.. ఇప్పుడు ఈ కేసుతో పెండ్లి విషయం ఇబ్బందయితాంది.. భూ భారతి చట్టంలో భూనిర్వాసితుల విషయంలో ముందు అధికారుల వద్దే భూ వివాదాలను పరిష్కరించుకోవాలన్న నిబంధన ఉంది. ఈ నిబంధనలను రెవెన్యూ అధికారులే పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌ను మా గ్రామంలో గ్రామసభ పెట్టి కాస్తు, కబ్జాలో ఎవరున్నారో, ఎన్నేండ్ల నుంచి ఉన్నారో నిర్ధారణ చేసుకొని వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -