– ట్రంప్ సుంకాలతో దిగాలు పడిన కట్ డైమండ్ పరిశ్రమ
– మూతపడనున్న యూనిట్లు
– లక్షలాది కార్మికుల ఉపాధికి గండం
న్యూఢిల్లీ : వారంతా వజ్రాలకు మెరుగులు పెడతారు. కానీ ఇప్పుడు వారి జీవితాలలో వెలుగులు కన్పించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన యాభై శాతం సుంకం వారి పాలిట శాపంగా మారబోతోంది. మన దేశంలో ఒక్క గుజరాత్ రాష్ట్రంలోనే వజ్రాలకు మెరుగులు పెట్టే యూనిట్లలో ఇరవై లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. సహజంగా లభించే వజ్రాన్ని ఆభరణాల తయారీలో ఉపయోగించడా నికి అనువుగా కోసి, పాలిష్ చేసి, ఓ నిర్దిష్ట ఆకారాన్ని ఇవ్వడం వీరి పని. ఈ ప్రక్రియను కట్ డైమండ్ అంటారు. ట్రంప్ సుంకాల దెబ్బకు ఇప్పుడీ పరిశ్రమ విలవిలలాడుతోంది.
వ్యాపారాలు వెలవెల
సాధారణంగా దీపావళి పండుగకు వీరికి ఎక్కువగా బయట నుంచి ఆర్డర్లు వస్తుంటాయి. అయితే అమెరికాలో సుంకాలు అధికంగా ఉన్నందున ఎగుమతిదారులు తమ ఆర్డర్లను రద్దు చేసుకుంటున్నారని వ్యాపారులు వాపోయారు. దీపావళి పండుగ సమయంలో కళకళలాడాల్సిన తమ వ్యాపారాలు వెలవెలపోయే ప్రమాదం పొంచి ఉన్నదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పండుగకు ముందే వ్యాపారాలు మూసేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. ఆర్డర్లు పడిపోవడంతో జీతాలు చెల్లించడం, ఇతర ఖర్చులు భరించడం కష్టంగా ఉన్నదని చెప్పారు. గుజరాత్‌లోని సూరత్ పట్టణంలో కట్ డైమండ్ వ్యాపారం చేసే చిన్న, మధ్యతరహా వ్యాపారులు ఇరవై వేల మంది వరకూ ఉంటారు. సూరత్‌కు ‘డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా’ అని పేరు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్రతి పదిహేను వజ్రాలలో పధ్నాలుగు వజ్రాలను సూరత్‌లోనే కట్ చేసి, పాలిష్ పెడతారు.
రద్దవుతున్న ఆర్డర్లు
ప్రపంచంలో కట్ డైమండ్స్ ఎక్కువగా అమెరికాకే ఎగుమతి అవుతాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి కట్ చేసి, పాలిష్ చేసిన 4.8 బిలియన్ డాలర్ల విలువైన రత్నాలను అమెరికాకు ఎగుమతి చేశారు. భారత్ నుంచి జరుగుతున్న మొత్తం ఎగుమతులలో ఇది మూడో వంతు కంటే ఎక్కువే. ట్రంప్ విధించిన అధిక సుంకాల కారణంగా ఇప్పటికే ఆర్డర్ల రద్దు ప్రారంభమైందని కొల్‌కతాకు చెందిన వజ్రాల ఎగుమతిదారు దింపల్ షా చెప్పారు. అమెరికాలోని కొనుగోలుదారులు అధిక సుంకాలను కారణంగా చూపి సరుకును తీసుకునేందుకు నిరాకరిస్తున్నారని, రెండు దశాబ్దాల వజ్రాల వ్యాపారంలో ఇలాంటి దుస్థితిని ఎన్నడూ చూడలేదని ఆయన అన్నారు.
దెబ్బ మీద దెబ్బ
భారత వస్తువులపై ట్రంప్ విధించిన పాతిక శాతం సుంకాలు ఈ నెల 7వ తేదీనే అమలులోకి వచ్చాయి. పులి మీద పుట్రలా ఈ నెల 6న ట్రంప్ మరో పాతిక శాతం టారిఫ్ విధించారు. ఇది ఈ నెల 27న అమలులోకి వస్తుంది. రత్నాల పరిశ్రమపై ఇదివరకే 2.1 శాతం సుంకం అమలులో ఉంది. అంటే ఈ నెల 27 తర్వాత సుంకాల భారం 52.1 శాతానికి చేరుతుందన్న మాట. గుజరాత్‌లోని సూరత్, అహ్మదాబాద్, రాజ్‌కోట్ నగరాలలో వజ్రాలను కోసి సాన పెట్టే వేలాది యూనిట్లు ఉన్నాయి. తొలుత కోవిడ్ సమయంలో ఈ పరిశ్రమ కుదేలైపోయింది. ఆ తర్వాత ఉక్రెయిన్‌పై రష్యా సాగించిన యుద్ధంతో మరింతగా దెబ్బతిన్నది. కోవిడ్ దెబ్బతో అంతర్జాతీయంగా హాంగ్‌కాంగ్, చైనా మార్కెట్లలో ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా నుంచి ముడి వజ్రాల దిగుమతులపై పశ్చిమ దేశాలు నిషేధం విధించడం, రష్యాపై జీ7 దేశాల నిషేధంతో దేశీయ వ్యాపారం కుంటుపడింది.
కృత్రిమ వజ్రాలతో ముప్పు
ఆర్థిక సంక్షోభం కారణంగా గత రెండు సంవత్సరాల కాలంలో గుజరాత్‌లో 80 మంది కార్మికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితి వల్ల కార్మికుల నెలసరి వేతనం రూ.15,000-17,000 మధ్యే ఉండిపోతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో వారి జీవితాలు దుర్భరమవుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ సుంకాల భారంతో గుజరాత్‌తో రెండు లక్షల మంది కార్మికుల జీవనోపాధికి ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే వజ్రాల రంగంలో గతంలో పనిచేసిన 1,20,000 మంది కార్మికులు తమకు రావాల్సిన ప్రయోజనాల కోసం దరఖాస్తు చేశారు. ట్రంప్ సుంకాలు, కోవిడ్, ఉక్రెయిన్ యుద్ధం మాత్రమే సంక్షోభానికి కారణం కాదు. ల్యాబ్‌లలో తయారవుతున్న వజ్రాలు నెమ్మదిగా మార్కెట్‌లో ప్రవేశించి సహజ ఉత్పత్తులను దెబ్బతీస్తున్నాయి. వీటి ధర సహజ ఉత్పత్తులలో కేవలం పది శాతంగా మాత్రమే ఉంటోంది.
గత ఆర్థిక సంవత్సరంలో భారత్ ముడి వజ్రాల దిగుమతులు పడిపోయాయి. అలాగే కట్ చేసి, పాలిష్ చేసిన సహజ వజ్రాల ఎగుమతులు కూడా తగ్గాయి. దేశీయ డిమాండ్‌ను పెంచుకోవడం, కొత్త మార్కెట్లలో ప్రవేశించడం వంటి చర్యలతో నష్టాలను కొంతమేర అధిగమించవచ్చునని వ్యాపారులు చెబుతున్నారు.
మెరుగుకు వెలుగేది?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES