క్రైస్తవులపై పెరుగుతున్న దాడులు
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో
పరిస్థితులు ఆందోళనకరం
మొన్న ఛత్తీస్‌గఢ్‌లో.. నేడు ఒడిశాలో..
భువనేశ్వర్ : భారత్‌లో మైనారిటీలకు భద్రత కరువైంది. వారిపై దాడులు నిత్యకృత్యమవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో క్రైస్తవ మతానికి చెందిన మత బోధకులు, నన్‌లను హిందూత్వ శక్తులు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. మతమార్పిడులకు పాల్పడుతున్నారంటూ నిరాధార ఆరోపణలతో వారిపై దాడులకు దిగుతున్నాయి. ఈ కాషాయశక్తులకు వంత పాడుతున్న కమలం పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు.. బాధితులు, అమాయకులైన నన్‌లు, పాస్టర్లపై కేసులు పెడుతూ వారిని అరెస్ట్ చేపిస్తున్నాయి. ఇవే ఆరోపణలతో హిందూత్వ శక్తులు ఇద్దరు నన్‌లను ఛత్తీస్‌గఢ్‌లో అరెస్ట్ చేయించాయి. ఆదివాసీ ప్రజలు సైతం నన్స్ తప్పేది లేదని చెప్తున్నా.. అక్కడి బీజేపీ ప్రభుత్వం వారిని పీడించింది. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర చర్చగా మారింది. ఈ ఘటన మరవకముందే ఒడిశాలోనూ మరొక ఘటన చోటు చేసుకున్నది. క్రైస్తవ మతబోధకులు, నన్‌లపై కాషాయశక్తులు దాడికి దిగాయి. వారిని దూషిస్తూ ఇష్టం వచ్చినట్టు కొట్టాయి.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడి ఘటనను క్రైస్తవ సంఘాలు ఖండించాయి. నిందితులపై కఠిన చర్యలకు డిమాండ్ చేశాయి. బాలాసోర్ జిల్లాలోని జలేశ్వర్ పారిష్ పరిధిలోని గంగాధర్ గ్రామం సమీపంలో ఈనెల 6న ఈ ఘటన జరిగింది. దాదాపు 70 మందితో కూడిన ఓ మూక.. ఇద్దరు క్యాథలిక్ మతబోధకులు, ఒక మతగురువు, ఇద్దరు నన్‌లను చుట్టుముట్టి దాడి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. వారు సమీపంలోని క్యాథలిక్ ఇంట్లో జరిగిన మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యారు. రాత్రి 9 గంటల సమయంలో వారు తిరిగి వస్తున్న తరుణంలో దుండగులు దాడికి దిగారు. దారుణంగా దూషించారు. గాయపర్చారు. నన్‌లను కొందరు మహిళలు సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. మతబోధకులు మరింత హింసకు గురయ్యారు. ఫాదర్ లిజో మొబైల్ ఫోన్‌ను దుండగులు బలవంతంగా లాక్కున్నారు. అయితే దాడికి పాల్పడిన మూకలోనివారిలో చాలా మంది బయటివారని కొందరు సాక్షులు తెలిపారు.
ఈ ఘటనపై క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ) తీవ్రంగా స్పందించింది. ఈ దాడిని కలవరపరిచిందని ఖండించింది. క్రైస్తవులపై జరుగుతున్న దాడులపై ఆందోళనను వ్యక్తం చేసింది. నేరస్థులను త్వరగా గుర్తించి, వారిపై విచారణ జరపాలని సీబీసీఐ డిమాండ్ చేసింది. మైనారిటీలపై పెరుగుతున్న దాడుల పట్ల మేధావులు, ఇతర క్రైస్తవ సంఘాలు కూడా తీవ్రంగా స్పందించాయి. ఇలాంటి సున్నితమైన విషయాలను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకోవాలనీ, లేనిపక్షంలో అవి మరింత విస్తృతమయ్యే ప్రమాదమున్నదని హెచ్చరిస్తున్నాయి. అయితే రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం అటువైపుగా చర్యలు తీసుకుంటుందా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చర్యలు లేకపోతే తాము కోర్టులు, మానవ హక్కుల సంఘాలను ఆశ్రయిస్తామంటున్నాయి. హిందూత్వ శక్తులకు అండగా ఉండే బీజేపీ నుంచి మైనారిటీలకు న్యాయాన్ని ఆశించటం అత్యాశే అవుతుందని మేధావులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.