భార్యాభర్తల మధ్య నమ్మకం, విశ్వాసం, విలువలు, కట్టుబాట్లు అనేవి చాలా ముఖ్యం. ఇద్దరూ ఒకరికి ఒకరు తోడునీడగా ఉండాలి అలా కాకుండా నువ్వు ఒకటి చేస్తే నేను మరొకటి చేస్తాను అంటూ పంతాలకు పోతే ఆ కుటుంబ సభ్యులపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇక పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి ఓ కథనమే ఈ వారం ఐద్వా అదాలత్(ఐలమ్మ ట్రస్ట్)లో మీ కోసం…
భార్గవికి సుమారు 40 ఏండ్లు ఉంటాయి. ఆమెది ప్రేమ వివాహం. ఇద్దరు పిల్లలున్నారు. భర్త ఆనంద్ పెండ్లి తర్వాత తల్లిదండ్రులను ఒప్పించి అందరూ కలిసి దాదాపుగా మూడేండ్లు కలిసే ఉన్నారు. తర్వాత గొడవలు జరిగి వేరుకాపురం పెట్టారు. ప్రస్తుతం పాప బిటెక్ చివరి ఏడాది, బాబు ఇంటర్ రెండో ఏడాది చదువుతున్నారు. భార్గవ్, నీరజ అనే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. అది తెలిసి భార్గవి నిలదీయడంతో గొడవ పెట్టుకొని భార్యా పిల్లల్ని వదిలేసి అతను తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు.
నీరజ, ఆనంద్ ఒకే దగ్గర ఉద్యోగం చేస్తున్నారు. వారి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. నీరజ, ఆనంద్‌కు ఆర్థికంగా కూడా సహాయం చేస్తుంది. అందుకే అతను నీరజతో ఉండేందుకు ఇష్టపడుతున్నాడు. భార్గవి దగ్గర ఉన్న తన పిల్లల్ని కూడా తీసుకెళ్లాలని ఆనంద్ ప్రయత్నిస్తున్నాడు. కానీ పిల్లలు తల్లిని వదిలి వెళ్లడానికి సిద్ధంగా లేరు. దాంతో కొట్టి బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. భార్గవి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి సహాయం కోసం ఐద్వా దగ్గరకు వచ్చింది. జరిగింది మొత్తం విని మేము ఆనంద్‌ను పిలిపించి మాట్లాడతామని ఆమెకు చెప్పి పంపించాము.
సుధీర్ అనే వ్యక్తి తన స్నేహితురాలితో కలిసి ఐద్వా ఆఫీస్‌కు వచ్చి ‘మా అన్నయ్య, వదిన 22 ఏండ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. మా వదిన మరో వ్యక్తితో సంబంధం పెట్టుకొని మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతుంది. కానీ మేమే ఆమెను కొట్టామని మాపై కేసు పెట్టింది. మా అన్నయ్య చాలా అమాయకుడు. ఆమెకు ఆరోగ్యం బాగోలేక మూడేండ్లు మంచంలోనే ఉంది. అలాంటి సమయంలో ఆమెను చిన్న పిల్లలా సాకాడు. ఆమె ఆరోగ్యం కుదుట పడి దాదాపు ఏడాది అవుతుంది. అప్పటి నండి తను సంబంధం పెట్టుకున్న సురేష్‌తో కలిసి మాకు చెడ్డపేరు తీసుకొస్తుంది. మీరే ఆమెతో మాట్లాడి మా అన్నయ్య కాపురం నిలబెట్టండి’ అంటూ చెప్పుకొచ్చాడు.
దానికి మేము ‘సమస్య మీ అన్నయ్యది, అతన్నే రమ్మని చెప్పండి. ముందు అతనితో మాట్లాడి ఆ తర్వాత మీ వదినతో మాట్లాడతాము’ అని చెప్పి పంపించాము. తర్వాత రోజు వాళ్ల అన్నయ్య వచ్చి ‘మా తమ్ముడు చెప్పింది మొత్తం నిజం. నా భార్య భార్గవికి సురేష్ అనే వ్యక్తితో సంబంధం ఉంది. నేను ఆమెను ఎంతగానో ప్రేమించాను. కానీ ఆమె నన్ను మోసం చేసింది. మీరే ఆమెతో మాట్లాడి నాకు న్యాయం చేయండి’ అన్నాడు.
అంతకు ముందు మా దగ్గరకు వచ్చిన భార్గవి, ఇప్పుడు వచ్చిన ఆనంద్ ఇద్దరూ భార్యాభర్తలే అని, ఒకరికి తెలియకుండా ఒకరు ఐద్వా అదాలత్‌కు వచ్చారని మాకు అర్థమయింది. మేము ముందుగా భార్గవిని, ఆనంద్‌ను పిలిచి మాట్లాడాము. భార్గవి మాట్లాడుతూ ‘ప్రేమించి పెండ్లి చేసుకున్న నన్ను కాదని ఆయన ప్రస్తుతం నీరజ అనే ఆమెతో ఉంటున్నాడు’ అంది. వెంటనే ఆనంద్ ‘వేరే వాళ్లతో సంబంధం పెట్టుకుంది నేను కాదు, నువ్వే సురేష్‌తో సంబంధం పెట్టుకున్నావు’ అన్నాడు.
ఇంతలో మేము కల్పించుకొని అసలు ఒకరిపై ఒకరికి అనుమానం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలను కున్నాం. దానికి భార్గవి మాట్లాడుతూ ‘నాకు అరోగ్యం బాగోక మూడేండ్లు మంచంలోనే ఉన్నాను. ఆ టైంలో ఆనంద్ నన్ను బాగానే చూసుకున్నాడు. కానీ మా ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్‌కు గ్యాప్ వచ్చింది. అప్పుడే నీరజతో సంబంధం పెట్టుకున్నాడు. అప్పట్లో ఇంట్లో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. నీరజ మాకు సహాయం చేసేది. దాంతో వాళ్ల సంబంధం గురించి నాకు తెలిసినా ఏమీ అనలేకపోయాను. కానీ ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. అంతా సెట్ అయ్యింది. అయినా ఆమెతో సంబంధం కొనసాగిస్తున్నాడు’ అంది.
‘అంటే నీకు అవసరమైనప్పుడు ఆమెతో సంబంధం పెట్టుకున్నా ఇబ్బంది లేదు. ఇప్పుడు సమస్యలు లేవు కాబట్టి వదిలేయమంటావా’ అన్నాడు ఆనంద్. ‘ఒకవేళ అప్పట్లో నేను చనిపోతే ఆయనకు, పిల్లలకు నీరజ తోడుగా ఉంటుందని నేను ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు నేను కూడా ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాను. ఇక ఆమెతో సంబంధం పెట్టుకోవల్సిన అవసరం ఏంటీ? అందుకే ఆయనపై ఫిర్యాదు చేశాను’ అంది.
మరి మీ విషయం ఏంటీ అనంద్ అంటే ‘భార్గవి చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. ఆమెకు ఆరోగ్యం బాగోలేనప్పుడు నీరజకు, నాకు మధ్య తప్పు జరిగింది. అయితే భార్యకు ఆరోగ్యం బాగోకపోతే నేను ఇలా వేరే అమ్మాయితో ఉండడం కరెక్టు కాదనిపించింది. అందుకే ఆమెకు దూరంగా ఉన్నాను. కానీ భార్గవి మాత్రం నీరజ భర్త సురేష్‌తో సంబంధం పెట్టుకుంది. నేను ఎంత చెప్పినా నా మాట వినడం లేదు. చివరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది’ అన్నాడు.
దానికి భార్గవి ‘సురేష్‌ను నాకు పరిచయం చేసిందే నీరజ. సురేష్ చెబితేనే నేను పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాను. వాళ్లిద్దరిపై ఫిర్యాదు చేద్దామని చెప్పడానికి సురేష్ అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుండేవాడు. దాంతో మా ఇద్దరి మధ్య ప్రేమ కలిగింది’ అంది. అంటే భార్గవి, ఆనంద్‌పై కేసు పెట్టి సురేష్‌తో కలిసి ఉండాలనుకుంటుందనేది మాకు స్పష్టంగా అర్థమయింది. దాంతో మేము సురేష్‌ను పిలిపించి ‘మీకు భార్గవి అంటే ఇష్టమా? ఆమెతోనే ఉంటారా’ అని అడిగాము. దానికి అతను ‘నాకు భార్య వుంది, అలాంటప్పుడు ఆమెతో ఎందుకు ఉంటాను. నా భార్యను ఆమె భర్త మోసం చేసి సంబంధం పెట్టుకున్నాడు. అందుకే నేను అతని భార్యతో సంబంధం పెట్టుకున్నాను. అంతేకానీ ఆమెపై నాకు ప్రేమా, అభిమానం లాంటివి ఏమీ లేవు’ అన్నాడు.
ఇదంతా విన్న తర్వాత మానవ సంబంధాలు, సామాజిక విలువలు ఎటుపోతున్నాయనే బాధతో ‘మీకసలు మానవ విలువల గురించి తెలుసా? ఎంత కోపం ఉన్నా ఇలా ప్రవర్తించడం ఎంటీ? భార్గవి ఏమో తన స్వార్థం కోసం అప్పట్లో నీరజతో తన భర్త పెట్టుకున్న సంబంధాన్ని అంగీకరించింది. ఇప్పుడు తనకు బాగుంది కాబట్టి నీరజను వెళ్లిపొమ్మంటుంది. నీరజ భర్తమో ఆనంద్‌పై కోపంతో భార్గవితో సంబంధం పెట్టుకున్నాడు. ఇదంతా మీ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వాళ్లు మిమ్మల్ని ఎలా గౌరవిస్తారు? సమాజం మిమ్మల్ని ఎలా చూస్తుంది? ఒక్కసారైనా ఈ విషయం గురించి ఆలోచించారా? మీ స్వార్థం కోసం ఏమైనా చేస్తారా? ఎవరి సుఖం వాళ్లు, ఎవరి అవసరాలు వాళ్లు చూసుకుంటే మీకు పుట్టిన పిల్లల పరిస్థితి ఏంటో ఆలోచించారా? ఇప్పటికైనా మీరు మారకపోతే మిమ్మల్ని ఎవ్వరూ మనుషులుగా చూడరు. పాత విషయాలు మర్చి పోయి ఎవరి కుటుంబంతో వాళ్లు సంతోషంగా ఉంటే మీకే గౌరవం. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేదంటే మీ ఇష్టం. ఇంతకు మించి మేము చెప్పేది ఏమీ లేదు’ అని చెప్పి పంపించాము.
- వై వరలక్ష్మి, 9948794051