Saturday, December 13, 2025
E-PAPER
Homeమానవిప్రేమంటే ఇదేనా..?

ప్రేమంటే ఇదేనా..?

- Advertisement -

ప్రేమంటే ఓ అందమైన భావన. సాన్నిహిత్యం, నిబద్దత, సంరక్షణ, ఆకర్షణ, ఆప్యాయత, నమ్మకంతో కూడిన బంధమే ప్రేమ. నిజానికి ప్రేమను మాటల్లో వర్ణించడం కష్టం. అయితే కొంత మంది ఈ ప్రేమను అవసరాల కోసం వాడుకుంటారు. కొంత మంది ప్రేమ పేరుతో మోసపోతున్నారు. నిజమైన ప్రేమ ఏది అని తెలుసుకునే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అలాంటి ఒక కథనమే ఈ వారం ఐద్వా అదాలత్‌ (ఐలమ్మ ట్రస్ట్‌)లో మీకోసం…

స్వాతి, కార్తిక్‌ను ప్రేమించి ఎవరికీ తెలియకుండా గుడిలో పెండ్లి చేసుకుంది. వారికి ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతం ఆ పాప డిగ్రీ పూర్తి చేసింది. త్వరలోనే పెండ్లి చేయాలనుకుంటున్నారు. కానీ కార్తిక్‌ తన కుటుంబ సభ్యులకు స్వాతిని పెండ్లి చేసుకున్నట్టు చెప్పలేదు. పైగా అతను ఇంకో పెండ్లి చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఈ విషయాలేవీ స్వాతికి తెలియదు. ఇంట్లో తమ పెండ్లి గురించి చెప్పమని స్వాతి అడిగిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి దాటవేస్తుంటాడు.

స్వాతి దగ్గరకు వారంలో ఒకరోజు రెండు రోజులు మాత్రమే వస్తుంటాడు. ఉద్యోగం రీత్యా వేరే దగ్గర ఉండాల్సి వస్తుందని చెప్పేవాడు. ఒకసారి మూడు నెలలు రాకపోయే సరికి అతను వున్న అడ్రెస్‌ వెతుక్కుంటూ వెళ్లింది స్వాతి. ఇంట్లో కార్తితో పాటుగా అతని భార్యా, పిల్లలు, తల్లిదండ్రులను చూసి షాక్‌ అయ్యింది. కార్తిక్‌ ఆమెను తన సహ ఉద్యోగిగా ఇంట్లో పరిచయం చేశాడు. బయటకు తీసుకొచ్చి ‘అనుకోని పరిస్థితుల్లో పెండ్లి చేసుకోవల్సి వచ్చింది, మన విషయం ఇంట్లో తెలిస్తే నన్నూ నిన్నూ ఇద్దరినీ చంపేస్తారు, నువ్వు కూడా మన పెండ్లి గురించి ఎవరికైనా చెప్పినా, పోలీస్‌ స్టేషన్లో కంప్లెయింట్‌ ఇచ్చినా చచ్చిపోతాను’ అంటూ బెదిరించాడు.

దాంతో స్వాతి తన బాధను బయటకు చెప్పుకోలేకపోయింది. కార్తీక్‌ పాపకు ఫీజు కట్టడం, ఇంట్లోకి సరుకులు తీసుకురావడం అన్నీ చేసేవాడు. స్వాతిని కూడా ప్రేమగా చూసుకునేవాడు. కానీ స్వాతి కూతురు ‘నాన్న ఎందుకు ఎప్పుడూ మనతో ఉండడు’ అని అడిగేది. అందరం కలిసి ఒకే దగ్గర వుండొచ్చు కదా అనేది. ఈ మధ్య కాలంలో స్వాతి కూతురుకు పెండ్లి సంబంధాలు వచ్చాయి. వచ్చిన వారు కూడా తండ్రి గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. ‘అమ్మాయి తండ్రి ఏం చేస్తుంటాడు’ అని అడిగేవారు. స్వాతికి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ‘భవిష్యత్తులో నా అత్తగారింట్లో వాళ్లు నాన్న గురించి అడిగితే నేనేం చెప్పాలి. ఈ సారి నాన్న వచ్చినప్పుడు నేను కచ్చితంగా అడుగుతాను. నేనసలు ఆయన కూతురినా లేకపోతే నన్ను ఎక్కడినుండైనా తీసుకువచ్చి పెంచుతున్నారా! అందరు తండ్రులు పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు.

వాళ్లను బయటకు తీసుకెళతారు. వారికి కావల్సినవి దగ్గరుండి ఇప్పిస్తారు. కానీ నాన్న మాత్రం నాతో కలిసి ఎప్పుడూ బయటకు రాలేదు. కనీసం నాతో కూర్చొని మాట్లాడడు’ అంటూ స్వాతి కూతురు కన్నీళ్లు పెట్టుకుంది. కూతురు బాధ గురించి కార్తిక్‌కి చెబితే ‘నన్ను ఇలాగే ఇబ్బంది పెడితే నేను మీ దగ్గరకు రావడమే మానేస్తాను’ అంటున్నాడు. అతను రాకపోతే కూతురు పెండ్లిలో తండ్రిగా అల్లుడి కాళ్లు కడిగేది ఎవరని స్వాతికి భయం. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఎలాగైనా న్యాయం చేయ్యండి’ అంటూ తెలిసని వాళ్ల సలహా మేరకు స్వాతి ఐద్వా లీగల్‌ సెల్‌కు వచ్చింది.
మేము కార్తిక్‌కి ఫోన్‌ చేసి పిలిపిస్తే ‘నేను నా మొదటి భార్యను బాగా చూసుకుంటున్నాను.

ఆమెకు పాపకు కావల్సిన సౌకర్యాలన్నీ చూసుకుంటున్నాను. నెలనెలా ఫీజు కడుతున్నాను. ఇద్దరికీ ఏ లోటూ లేకుండా చేస్తున్నాను. అయినా ఇక్కడి వరకు వచ్చి నా పరువు తీయాలని చూస్తుంది. ఇన్నేండ్లు నేను స్వాతిని అస్సలు ఇబ్బంది పెట్టలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకో పెండ్లి చేసుకున్నాను. నేను రెండో పెండ్లి చేసుకున్నా స్వాతిని ప్రేమగానే చూసుకుంటున్నాను. ఆమెకు ఇంకేం కావాలో నాకు అర్థం కావడం లేదు’ అన్నాడు. దానికి స్వాతి ‘నా కూతురు పెండ్లిలో తండ్రి స్థానంలో ఉండి కన్యాదానం చేయాలి. దాని కోసమే నేను ఇక్కడి వరకు వచ్చాను. నువ్వు ఆ బాధ్యత నుండి తప్పించుకుంటున్నావు’ అంది.

ఇద్దరి మాటలు విన్న తర్వాత ‘కార్తిక్‌ నువ్వు రెండు పెండిండ్లు చేసుకున్న విషయం మీ తల్లిదండ్రులకు, మీ రెండో భార్యకు తెలుసా’ అని అడిగితే ‘లేదు ఎవరికీ తెలియదు’ అన్నాడు. 20 ఏండ్లు నుండి ఎవరికీ తెలియకుండా బాగానే నడిపిస్తున్నావు. సమాజంలో నీ గౌరవం గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. స్వాతి గౌరవం గురించి గానీ నీ కూతురు భవిష్యత్తు గురించి కానీ ఆలోచించడం లేదు. స్వాతిని రహస్యంగా పెండ్లి చేసుకొని ఒక బిడ్డను కన్నావు. ఆమెను మోసం చేసి మరో పెండ్లి చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు ఇద్దరు మహిళలను మోసం చేస్తున్నావు. తండ్రి ఇలా ఇంటికి వారంలో ఒకటీ రెండు రోజులు వచ్చి వెళుతుంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటీ? అందరూ ఎలా మాట్లాడుకుంటారో నీకు అర్థం కావడం లేదు.

నీ రెండో భార్య, ఆమె పిల్లల జీవితం నాశనం చేయకూడదనే స్వాతి ఇన్ని రోజులు మౌనంగా ఉంది. ఇప్పటికైనా మీ ఇంట్లో వాళ్లకు చెప్పి ఒప్పించే ప్రయత్నం చెస్తే మంచిది. పైగా ఇన్నేండ్ల తర్వాత మొదటి భార్య గురించి పిల్లల గురించి చెబితే అంత సులభంగా ఎవ్వరూ భరించలేరు, కానీ తప్పదు. కొన్ని ఇబ్బందులు వస్తాయి. కానీ మరో మహిళ జీవితం నాశనం చేయడం సరైనది కాదు. పైగా చచ్చిపోతాను, ఇంటికి రాను అని స్వాతిని బెదిరిస్తున్నావు. నువ్వు ఇంటికి రాకుండా ఉంటే స్వాతి ఊరుకుంటుందా? పోలీస్‌ స్టేషన్లో కంప్లెయింట్‌ ఇస్తుంది. అప్పుడు నీ పరువు ఏమవుతుందో ఆలోచించుకో. అంతకు మించి నువ్వు జైల్లో ఉండాల్సి వస్తుంది. స్వాతికి ఎవ్వరూ లేరనుకున్నావేమో, ఆమెకు అండగా మేమున్నాము. అసలు ప్రేమంటే ఇదేనా..? ఒక్కసారి ఆలోచించు. ప్రేమించి పెండ్లి చేసుకొని స్వాతిని మోసం చేయాలని చూస్తే ఊరుకోము. మెల్లగా ఇంట్లో వాళ్లకు అర్థమయ్యేలా చెప్పు. నీ కూతురు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకో’ అని చెప్పి పంపించాము.

  • వై వరలక్ష్మి, 9948794051
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -