Thursday, July 3, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంశాంతి ఒప్పందానికి ఇజ్రాయిల్‌ ఓకే

శాంతి ఒప్పందానికి ఇజ్రాయిల్‌ ఓకే

- Advertisement -

– ప్రకటించిన ట్రంప్‌
– స్పందించని ఇజ్రాయిల్‌, హమాస్‌
వాషింగ్టన్‌ :
హమాస్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇజ్రాయిల్‌ సిద్ధంగానే ఉన్నదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహిం చేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌ లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘అరవై రోజుల కాల్పుల విరమణ ను ఖరారు చేయడానికి అవసరమైన షరతులకు ఇజ్రాయిల్‌ అంగీకరించింది. కాల్పుల విరమణ సమయంలో యుద్ధాన్ని ఆపేందుకు అన్ని పక్షాలతో మేము చర్చలు జరుపుతాం’ అని ట్రంప్‌ వివరించారు. ఖతార్‌, ఈజిప్ట్‌కు చెందిన ప్రతినిధులు హమాస్‌ ముందు ‘తుది ప్రతిపాదన’ను ఉంచుతారని అన్నారు. కాగా ట్రంప్‌ పోస్ట్‌పై ఇజ్రాయిల్‌, హమాస్‌లు అధికారికంగా ఇంకా స్పందించలేదు.

ఇజ్రాయిల్‌ ఏ షరతులకు అంగీకరించిందో తెలియడం లేదు. ట్రంప్‌ గతంలో కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. అమెరికా అధ్యక్షుడిగా తాను బాధ్యతలు చేపట్టడానికి ముందే కాల్పుల విరమణను పాటించడం సహా యుద్ధాన్ని ఆపేసేందుకు ఇజ్రాయిల్‌ సంసిద్ధత వ్యక్తం చేసిందని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. అయితే అది ఒట్టిదే అని తేలిపోయింది. ఖైదీల మార్పిడిపై కుదుర్చుకున్న ఒప్పందాలను ఉల్లంఘించారంటూ ఇరు పక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఐక్యరాజ్యసమితి కూడా అనేక నెలలుగా కాల్పుల విరమణ ప్రతిపాదనలు చేస్తోంది.


శాంతి స్థాపన కోసం తీవ్ర కృషి చేస్తున్న ఖతార్‌, ఈజిప్ట్‌ దేశాలు తుది ప్రతిపాదనను హమాస్‌ ముందు ఉంచుతాయని ట్రంప్‌ తన తాజా పోస్ట్‌లో తెలియజేశారు. ‘మధ్యప్రాచ్యం మంచి కోసం ఈ ఒప్పందానికి హమాస్‌ అంగీకారం తెలుపుతుందని అనుకుంటున్నాను. ఒప్పందాన్ని వ్యతిరేకిస్తే హమాస్‌ పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ట్రంప్‌ వచ్చే సోమవారం శ్వేతసౌధంలో ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహూతో సమావేశమయ్యే అవకాశం ఉంది.

గాజాపై సాధ్యమైనంత త్వరగా కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని నెతన్యాహూకు గట్టిగా చెబుతానని ట్రంప్‌ తన ఫ్లోరిడా పర్యటనలో విలేకరులకు చెప్పారు. ట్రంప్‌ ప్రకటనపై ఇజ్రాయిల్‌ అధికారికంగా ఎలాంటి స్పందన తెలియజేయనప్పటికీ అపరిష్కృత అంశాలు అనేకం ఉన్నాయని అధికారులు గుర్తు చేశారు. పరోక్ష చర్చలు జరుగుతున్న కైరో లేదా ఖతార్‌కు ఇజ్రాయిల్‌ ఇప్పటికీ ప్రతినిధి బృందాలను పంపలేదు. మరోవైపు ట్రంప్‌ ప్రకటనను హమాస్‌ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటి వరకూ ఎలాంటి పురోగతి లేదని సీనియర్‌ అధికారి ఒకరు తేల్చేశారు.
ఘర్షణకు ఇజ్రాయిల్‌ శాశ్వతంగా స్వస్తి చెప్పి, గాజా నుంచి పూర్తిగా వైదొలిగితే బందీలను విడుదల చేస్తానని హమాస్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే హమాస్‌ ఆయుధాలను విడనాడి, ప్రవాస జీవితం గడిపేందుకు దాని నాయకత్వం అంగీకరిస్తేనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయిల్‌ తెగేసి చెబుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -