Tuesday, October 14, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్‌ - పాలస్తీనా బందీలు విడుదల

ఇజ్రాయిల్‌ – పాలస్తీనా బందీలు విడుదల

- Advertisement -

ఖతార్‌, ఈజిప్ట్‌, టర్కీ దేశాల మధ్యవర్తిత్వం
ట్రంప్‌-నెతన్యాహు చెట్టాపట్టాల్‌
గాజా యుద్ధం ముగిసిందని ప్రకటన.. ఐరాస హర్షం
పాలస్తీనాను గుర్తించండి: ఇజ్రాయిల్‌ పార్లమెంట్‌లో వామపక్ష ఎంపీ ప్లకార్డ్‌ ప్రదర్శన…కంగుతిన్న అమెరికా అధ్యక్షుడు

గాజా : శాంతి ఒప్పందంలో భాగంగా తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయిల్‌ పౌరులందరినీ హమాస్‌ సోమవారం రెడ్‌క్రాస్‌కు అప్పగిం చింది. వారంతా ఇజ్రాయిల్‌ చేరుకు న్నారు. హమాస్‌ వద్ద ఇక బందీలె వ్వరూ లేరని ఇజ్రాయిల్‌ రక్షణ దళం (ఐడీఎఫ్‌) కూడా ధృవీకరించింది. బందీలందరూ బాగానే ఉన్నారని రెడ్‌క్రాస్‌ తెలిపింది. బందీల విడుదలకు సంబంధించిన చిత్రాలను ఇజ్రాయిల్‌ రక్షణ దళం విడుదల చేసింది. హమాస్‌ తొలి విడతగా ఏడుగురిని, రెండో విడతగా 13 మందిని…మొత్తం 20 మంది బందీలను విడిచిపెట్టింది. హమాస్‌ వద్ద 48 మంది ఇజ్రాయిల్‌ పౌరులు బందీలుగా ఉండగా, వారిలో 28 మంది ఇప్పటికే మరణించారు. శాంతి ప్రణాళికలో భాగంగా వారి మృతదేహాలను కూడా హమాస్‌ అప్పగిస్తుంది. ఖతార్‌, ఈజిప్ట్‌, టర్కీ దేశాల మధ్యవర్తిత్వంతో హమాస్‌, ఇజ్రాయిల్‌ మధ్య గత వారం శాంతి ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఒప్పందంలో భాగంగా ఇజ్రాయిల్‌ కూడా విడతల వారీగా తన వద్ద నిర్బంధంలో ఉన్న రెండు వేల మంది పాలస్తీనియన్లను విడుదల చేస్తోంది. బస్సుల్లో రమల్లా చేరుకున్న వారికి కుటుంబ సభ్యులు భావోద్వేగంతో స్వాగతం పలికారు.

ఖైదీల బంధువులను చెదరగొట్టిన ఇజ్రాయిల్‌ సైన్యం
ఖైదీల విడుదల కోసం ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని ఓఫర్‌ జైలు సమీపంలో ఎదురు చూస్తున్న పాలస్తీనా బంధువులు, పాత్రికేయులపై ఇజ్రాయిల్‌ దళాలు భాష్ప వాయుగోళాలు, రబ్బర్‌ బులెట్లు, పొగ బాంబులు ప్రయో గించి చెదరగొట్టాయని అసోసియేటెడ్‌ ప్రెస్‌ తెలిపింది. ఖైదీలకు మద్దతు తెలిపితే అరెస్ట్‌ తప్పదని అంతకుముందు ఇజ్రాయిల్‌ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు వంద మందికి పైగా పాలస్తీనా రాజకీయ ఖైదీలకు ప్రవాస శిక్ష విధించాలని ఇజ్రాయిల్‌ నిర్ణయించింది. అంటే ఇజ్రాయిల్‌ అనుమతిస్తే తప్ప వారు పాలస్తీనాకు చేరుకొని తమ బంధువులను కలుసుకునే అవకాశం ఉండదు. వారందరూ ఇకపై ప్రవాస జీవితం గడపాల్సిందే. కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన తర్వాత కూడా గాజాలో హమాస్‌, ఇజ్రాయిల్‌ దళాల మధ్య ఘర్షణలు జరిగాయి.

బందీల కుటుంబ సభ్యులతో ట్రంప్‌, నెతన్యాహూ భేటీ
ఈజిప్ట్‌ శాంతి సదస్సుకు వెళుతూ మధ్యలో ఇజ్రాయిల్‌లో సుమారు నాలుగు గంటల పాటు గడిపిన ట్రంప్‌ ఆ దేశ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహూతో కలిసి పార్లమెంటు భవనంలోనే… హమాస్‌ విడుదల చేసిన బందీల కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. బందీల విడుదల అనంతరం ట్రంప్‌కు నెతన్యాహూ బంగారు పావురాన్ని బహుకరించారు. పార్లమెంటులోని నెతన్యాహూ కార్యాలయంలో ఇరువురు నేతలు కొద్ది సేపు భేటీ అయ్యారు. శాంతి స్థాపనకు కట్టుబడి ఉన్నానని ఈ సందర్భంగా నెతన్యాహూ తెలిపారు. ట్రంప్‌ పర్యటనను పురస్కరించుకొని జెరుసలేం, టెల్‌ అవీవ్‌ నగరాలలో అనేక స్వాగత బోర్డులు ఏర్పాటు చేశారు. వాటిలో ట్రంప్‌ను ఒకప్పటి పర్షియన్‌ రాజు సైరస్‌తో పోల్చారు. గాజా నుంచి బందీల విడుదల, యుద్ధానికి ముగింపు పలకడానికి ట్రంప్‌ చేసిన కృషికి గుర్తుగా ఆయనకు ఇజ్రాయిల్‌, ఈజిప్ట్‌ ప్రభుత్వాలు అత్యున్నత పౌర పురస్కారాలను అందజేశాయి.
ఇరాన్‌కు ట్రంప్‌ స్నేహహస్తం

ఇజ్రాయిల్‌ పార్లమెంటును ఉద్దేశించి ట్రంప్‌ ప్రసంగిస్తూ ఇరాన్‌తో స్నేహ సహకారాలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు. ఇజ్రాయిల్‌ పార్లమెంటులో ట్రంప్‌కు స్టాండింగ్‌ ఒవేషన్‌ లభించింది. గాజా శాంతి ఒప్పందం తరహాలో అణ్వస్త్రాలు కలిగిన ఇరాన్‌తో ఒప్పందానికి రాలేమని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకుంటే మంచిదేనని తెలిపారు. శాంతి ప్రణాళిక గురించి మాట్లాడుతూ ఈ పని చాలా కాలం క్రితమే జరిగి ఉండాల్సిందని అన్నారు. అయితే ఒబామా, ఆ తర్వాత బైడెన్‌ కారణంగా ఆ పని జరగలేదని నిందించారు. వీరిద్దరికీ ఇజ్రాయిల్‌ పొడ గిట్టదని ఆరోపించారు. ఇరాన్‌తో ఒమాబా కుదుర్చుకున్న అణు ఒప్పందం మధ్యప్రాచ్యాన్ని అతలాకుతలం చేసిందని మండిపడ్డారు. ఆయుధాల కోసం నెతన్యాహూ తన కు అనేక పర్యాయాలు ఫోన్‌ చేశారని, వాటితో ఇజ్రా యిల్‌ బలమైన, శక్తివంతమైన దేశంగా ఎదిగిందని, అదే ఇప్పుడు శాంతి ఒప్పందానికి దారి తీసిందని చెప్పుకొచ్చారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని, మన బందీలను ఇంటికి చేర్చామని ఆయన తెలిపారు. ఇది పట్టుదలకు, దౌత్యానికి విజయమని అభివర్ణించారు. గాజా యుద్ధానికి ముగింపు దిశగా బందీల విడుదల ముఖ్యమైన అడుగు అని చెప్పారు. ‘ఆకాశం నిర్మలంగా ఉంది. తుపాకులు మూగబోయాయి. పవిత్ర భూమి సంతోషిస్తోంది’ అని ట్రంప్‌ చెప్పారు.

ట్రంప్‌ను పొగడ్తలతో ముంచెత్తిన నెతన్యాహూ
హమాస్‌పై ప్రారంభించిన దాడులను నెతన్యాహూ ప్రస్తావిస్తూ ‘ఈ విజయాల వెనుక భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఈ హీరోల కారణంగానే మన దేశం మనుగడ సాధిస్తుంది. అభివృద్ధి చెందుతుంది. శాంతి నెలకొంటుంది’ అని కొనియాడారు. ‘మనిద్దరం కలిసి శాంతిని సాధిద్దాం. పలు ఒప్పందాల ద్వారా గతంలోనూ శాంతిని సాధించాం. మరోసారి ఆ పని చేస్తాం’ అని ట్రంప్‌ను ఉద్దేశించి అన్నారు. ఇజ్రాయిలీల కుటుంబాల కోసం సమగ్ర బందీల విడుదల ఒప్పందాన్ని కుదిర్చిన ట్రంప్‌నకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎన్నికైన తర్వాత అన్నీ మారిపోయాయని చెప్పారు. దశలవారీగా జరిగిన చర్చల ప్రక్రియలో ప్రతి సందర్భం లోనూ అమెరికా అధ్యక్షుని పాత్ర ఉన్నదని ప్రశంసించారు. అక్టోబర్‌ ఏడో తేదీని గుర్తుంచుకుంటా మన్నారు. ఇజ్రాయిల్‌ శక్తి, పట్టుదల శత్రువులకు అర్థమైందని నెతన్యాహూ చెప్పుకొచ్చారు. ట్రంప్‌నకు త్వరలోనే నోబెల్‌ శాంతి బహుమతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని ఇంత వేగంగా, నిర్ణయాత్మకంగా కదిలించిన వ్యక్తిని తాను ఎన్నడూ చూడలేదంటూ పొగడ్తలతో ముంచెత్తారు. కాగా, ఇజ్రాయిల్‌లో బంధీలుగా ఉన్న పాలస్తీనియన్‌లను విడుదల చేశారు.

ఊరట కలిగింది : గుటెరస్‌
మాస్‌ వద్ద బందీలుగా ఉన్న వారందరూ విడుదలై స్వేచ్ఛా వాయువులు పీల్చడం తనకు ఊరట కలిగించిందని ఐరాస సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ చెప్పారు. హమాస్‌ బందీల మృతదేహాలను కూడా అప్పగించాలని ఆయన సూచించారు. ఇచ్చిన హామీలను గౌరవించాలని అన్ని పక్షాలకూ విజ్ఞప్తి చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు, ప్రజల కష్టాలు తొలగించేందుకు జరిగే అన్ని ప్రయత్నాలకూ ఐరాస మద్దతు ఇస్తుందని గుటెరస్‌ తెలిపారు.

యుద్ధ శాంతికి ఆఖరి అవకాశం : ఈజిప్టు అధ్యక్షుడి ప్రకటన
కైరో : ట్రంప్‌ ప్రతిపాదనకు యుద్ధ శాంతికి ఇదే ఆఖరి అవకాశమని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్‌ ఫట్టా ఎల్‌-సిస్సీ స్పష్టం చేశారు.గాజాపై శాంతి శిఖరాగ్ర సమావేశం సోమవారం ఈజిప్టులోని షర్మ్‌ ఎల్‌-షేక్‌లో జరిగింది. 20కి పైగా దేశాల అధ్యక్షులు, అధికారులు తరలివచ్చారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయిల్‌ నుంచి ఈజిప్టుకు చేరుకున్నారు. ఈజిప్టు విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. ట్రంప్‌ దార్శనికత విజయమని చెప్పారు. ట్రంప్‌కు దేశ అత్యున్నత పౌర గౌరవం అయిన ఆర్డర్‌ ఆఫ్‌ ది నైల్‌ను కూడా ఈజిప్టు అధ్యక్షుడు ప్రదానం చేశారు. గాజాలో రెండేండ్లకు పైగా ఇజ్రాయిల్‌-హమాస్‌ యుద్ధాన్ని ముగించడానికి జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ఫోటోలకు పోజులిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -