దాడుల నేపథ్యంలో హమాస్ నేత వెల్లడి
కైరో : కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయిల్ పదేపదే దాడులకు పాల్పడుతుండటం గాజా ప్రాంతంలో శాంతి ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోందని హమాస్ తరపున శాంతి చర్చల్లో పాల్గొన్న ప్రధాన సంధానకర్త (ఛీప్ నెగోషియేటర్) ఖలీల్ అల్ హయ్యా అన్నారు. ఈ నెల 13న హమాస్ కమాండర్లను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో సీనియర్ కమాండర్ రయీద్ సయీద్ హత్యకు గురైనట్టు ఖలీల్ ధ్రువీకరించారు. ఈ ఘటనపై ఆదివారం నాడు ఆయన ఒక టివి ప్రతినిధితో మాట్లాడుతూ అమెరికా మధ్యవర్తిత్వంతో గాజాలో కాల్పుల విరమణ ఒప్పదం అమల్లోకి వచ్చిన తర్వాత హమాస్ అగ్రశ్రేణి నాయకులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ జరిపిన తొలిదాడి ఇదేనని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయిల్ పదేపదే కాల్పుల విరమణను ఉల్లంఘించి ఇలా దాడులకు తెగించడం శాంతి ప్రక్రియకు తీవ్ర విఘాతం కల్గిస్తోందని తెలిపారు.
కాల్పుల విరమణ ఒప్పందానికి హామీదారుగా ఉన్న అమెరికా ప్రభుత్వ యంత్రాంగం, ఆ దేశ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తక్షణమే జోక్యం చేసుకొని ఇజ్రాయిల్ కాల్పుల విరమణకు కట్టుబడివుండేలా చర్యలు తీసుకోవాలని ఖలీల్ డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్ హత్య చేసిన సయీద్ ..హమాస్‌లో అత్యంత కీలక నేత. సాయుధ దళానికి అధిపతిగా ఉన్న ఐజ్ ఎల్దీన్ అల్ హదద్ తర్వాతి నేతగా సయీద్‌కు పేరుంది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ (ఐఎస్‌ఎఫ్) ఏర్పాటుపైనా హయ్యా స్పందించారు. ఐఎస్‌ఎఫ్ బలగాలు కేవలం కాల్పుల విరమణ ఒప్పందం అమలయ్యేలా చూడడానికి, గాజా సరిహద్దుల వెంబడి ఇరు పక్షాలను వేరు చేయడానికి మాత్రమే పరిమితం కావాలన్నారు. అంతేగానీ గాజా స్ట్రిప్‌లో ఐఎస్‌ఎఫ్‌కు ఎటువంటి పాత్ర ఉండరాదని, అంతర్గత వ్యవహారాల్లో ఏపాటి జోక్యం కూడా చేసుకోరాదని హయ్యా పేర్కొన్నారు.
ఇజ్రాయిల్ చర్యలు శాంతికి విఘాతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



