Saturday, August 2, 2025
E-PAPER
Homeజాతీయంన్యాయాన్ని అపహాస్యం చేయడమే !

న్యాయాన్ని అపహాస్యం చేయడమే !

- Advertisement -

– మాలేెగావ్‌ పేలుళ్ల తీర్పుపై సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ :
మాలేగావ్‌ పేలుళ్ల కేసులో వచ్చిన తీర్పు పట్ల సీపీఐ(ఎం) తీవ్ర నిరాశను, అసంతృప్తిని వ్యక్తం చేసింది. సంఘటన జరిగిన 17ఏండ్ల తర్వాత వచ్చిన ఈ తీర్పులో, సాక్ష్యాధారాలు లేవంటూ నిందితులందరినీ నిర్దోషులుగా విడిచిపెట్టారని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో విమర్శించింది. మాలెగావ్‌ పేలుళ్ళలో ఆరుగురు అమాయకులు మరణించగా, దాదాపు వందమంది గాయపడ్డారు. ఇది న్యాయాన్ని అపహాస్యం చేయడమేనని పొలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది. సాక్ష్యాధారాలు లేవంటూ, విధానపరమైన లోపాలు వున్నాయన్న సాకుతో బీజేపీ మాజీ ఎంపీ ప్రగ్యా సింగ్‌ థాకూర్‌, ఆనాడు ఆర్మీ ఆఫీసర్‌గా చేస్తున్న లెఫ్టినెంట్‌ కల్నల్‌ ప్రసాద్‌ పురోహిత్‌, ఇతరులను నిర్దోషులుగా విడిచిపెట్టారు.ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీలో ఒక వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేస్తూ కుట్రదారులు నేరానికి పాల్పడ్డారని, ముఖ్యమైన సేవలకు అంతరాయం కలిగించారని, మత పరమైన ఉద్రిక్తతలు సృష్టించారని, దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమించారని పేర్కొంటూ వారికి తగిన శిక్ష వేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ కోరింది. తీవ్రవాద హిందూత్వ గ్రూపు పాల్పడిన ఉగ్రదాడిలో బాధితులకు న్యాయం జరగడంలో అసాధారణమైన జాప్యానికి, చివరకు న్యాయం నిరాకరించడానికి ఇది మరొక ఉదాహరణ. నిందితులకు ఆర్‌ఎస్‌ఎస్‌-బీజేపీ అన్ని రకాలుగా మద్దతునిచ్చి, ఆదరించాయి. ప్రగ్యా సింగ్‌ను బీజేపీ తమ అభ్యర్ధిగా పోటీకి నిలబెట్టింది.ఆమె ఎంపీగా ఎన్నికయ్యారు. ఏ హిందువూ కూడా ఉగ్రవాది కాలేడని పార్లమెంట్‌లో హోం మంత్రి అమిత్‌ షా ప్రకటన చేసిన మరుసటి రోజే ఈ తీర్పు వెలువడింది. ఈ నేరం తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, ఎన్‌ఐఎ కోర్టు నిర్ణయాన్ని అప్పీల్‌ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -