హరీశ్‌రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణలో విద్యుత్ రంగాన్ని నట్టేట ముంచింది గత బీఆర్‌ఎస్ పాలకులేననీ, ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పటంతో మైండ్ దెబ్బతిని ఆ పార్టీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. జూబ్లీహిల్స్‌లోనూ బావబామ్మర్దుల కుట్రలను ప్రజలు తిప్పకొట్టడంతో ఏమి మాట్లాడాలో తెలియక విద్యుత్ ప్లాంట్ల అవినీతి అంటూ దారి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యుత్ రంగంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. బుధవారం ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో విచ్చలవిడి అవినీతికి పాల్పడి తెలంగాణ డిస్కమ్‌లను రూ.90 వేల కోట్ల అప్పుల్లో ముంచింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని విమర్శించారు. అక్కరలేనప్పుడు కూడా ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు పేరిట వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేశారని ఆరోపించారు. బొగ్గు లేని దామరచర్లలో థర్మల్ పవర్ ప్లాంట్ కట్టి ప్రజలకు భారం – బీఆర్‌ఎస్ నాయకులకు లాభం అనే కుట్రను అమలు చేశారని విమర్శించారు. భద్రాద్రిలో కాలం చెల్లిన టెక్నాలజీతో ప్లాంట్ నిర్మించి జెన్‌కోను దెబ్బతీశారని తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల ప్లాంట్లు తెలంగాణకు రావాల్సి ఉండగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేవలం 1600 మెగావాట్లకు మాత్రమే ఒప్పందం చేసుకుని మిగతా 2400 మెగావాట్ల విద్యుత్తును తెలంగాణకు రాకుండా అడ్డుకుందని ఎత్తిచూపారు. దామరచర్లలో తమ సొంత ప్లాంట్లకు లాభం చేకూర్చేందుకు ఎన్‌టీపీసీ ప్లాంట్ ఆలస్యానికి కారణమైనది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. యాదాద్రి-భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాల్లో జరిగిన అవినీతి పై ప్రభుత్వం ఇప్పటికే జ్యుడిషియల్ కమిషన్‌తో న్యాయ విచారణ చేపట్టిందని గుర్తుచేశారు. ఏ రోజైనా ఈ అవినీతి బయటపడుతుందన్న భయం బీఆర్‌ఎస్ నేతల్లో కనిపిస్తోందనీ, అందుకే హరీశ్ రావు దొంగే దొంగ అన్నట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. కాంపిటీటివ్ బిడ్డింగ్‌లో ఫెయిల్ అయిన కంపెనీకి నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్ట్ ఇచ్చి, యూనిట్ విద్యుత్ రేటును రూ.9 వరకు ఎలా పెంచారని ప్రశ్నించారు.
విద్యుత్ రంగాన్ని నట్టేట ముంచింది బీఆర్‌ఎస్సే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



