– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చింతల నాగరాజు
నవతెలంగాణ – ఉప్పునుంతల
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం హర్షనీయం అని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చింతల నాగరాజు అన్నారు. మంగళవారం ఉప్పునుంతల మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన అక్టోబర్ 9న నోటిఫికేషన్ వెలువడుతుందని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతలుగా, గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నట్లు తెలిపారు.
సీపీఐ(ఎం) శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధి కోసం యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీకి సిద్ధం కావాలని సూచించారు. “గెలిస్తే చరిత్ర, ఓడితే అనుభవం” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) మండల సీనియర్ నాయకులు పానుగంటి రవీందర్, కెవిపిఎస్ మండల కార్యదర్శి పాతుకుల కొండలు, డివైఎఫ్ఐ నాయకులు శివ తదితరులు పాల్గొన్నారు.