Sunday, December 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకామ్రేడ్లను కలుపుకుపోవడం మా బాధ్యత

కామ్రేడ్లను కలుపుకుపోవడం మా బాధ్యత

- Advertisement -

నాటి, నేటి రాజకీయాలకు అర్థాలు మారాయి
విలువలతో కూడిన రాజకీయమే సమాజానికి మేలు : సీపీఐ(ఎం) సర్పంచ్‌ అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో మంత్రి జూపల్లి కృష్ణారావు

నవతెలంగాణ -వనపర్తి
కామ్రేడ్‌లను కలుపుకోవడం మా బాధ్యత అని ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వనపర్తి జిల్లా పానగల్‌ మండలం రేమొద్దుల గ్రామంలో సీపీఐ(ఎం) , కాంగ్రెస్‌ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి రేగిచెట్టు నిరంజన్‌ ఎన్నికల ప్రచార ర్యాలీలో శనివారం మంత్రి జూపల్లి పాల్గొని ప్రసంగించారు. సమాజంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజల కోసం పనిచేసే కామ్రేడ్‌లను ఎన్నికల సందర్భంగా కలుపుకుపోవడం తమ బాధ్యతని వ్యాఖ్యానించారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని రాజకీయంగా ఎదిగానని తెలిపారు.

పలు సందర్భాల్లో సీపీఐ(ఎం) జిల్లా నాయకత్వం తనకు మద్దతు ప్రకటించి అండగా నిలిచిందని గుర్తుచేశారు. అలాంటిది ప్రస్తుత సర్పంచ్‌ ఎన్నికల్లో రేమొద్దుల గ్రామపంచాయతీకి ఉమ్మడి సర్పంచ్‌ అభ్యర్థిగా రేగిచెట్టు నిరంజన్‌కు భారీ మెజార్టీ అందించాలని కోరారు. ఈ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించే బాధ్యత తాను తీసుకుంటున్నానని తెలిపారు. నాటి రాజకీయాలకు నేటి రాజకీయాలకు అర్థాలు మారాయని, అప్పట్లో వ్యక్తులు సామాజిక అంశాల కోణంలో ఎంతో ప్రాధాన్యం ఉంటే.. నేడు రాజకీయ అంశాలు డబ్బు, వ్యక్తుల పరంగా మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. విలువలతో కూడిన రాజకీయాలు సమాజానికి మేలు చేస్తాయని, రాజకీయాలకు అతీతంగా సీపీఐ(ఎం) అభ్యర్థికి భారీ మెజార్టీతో ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

గత విజయాల కన్నా నేడు సమస్యల పరిష్కారం ముఖ్యం..
గతంలో సాధించిన విజయాల కన్నా నేడు గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం ముఖ్యమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జబ్బార్‌, రాష్ట్ర నాయకులు కిల్లే గోపాల్‌, సర్పంచ్‌ అభ్యర్థి రేగిచెట్టు నిరంజన్‌ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం మంత్రి సహకారంతో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జి.వెంకటయ్య, కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -