గత ప్రభుత్వ తీరుతో పథకాలకు దూరంగా వికలాంగులు
మానవతను జోడించి వైకల్య పరీక్షలు నిర్వహించాలి : సదరం క్యాంపు డాక్టర్ల వర్క్‌షాపులో మంత్రి డా.సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అర్హులైన వికలాంగులకు సదరం సర్టిఫికెట్ ఇవ్వకపోతే వారికి తీవ్ర అన్యాయం చేసినట్టే అవుతుందనీ, డాక్టర్లు మానవీయత జోడించి వైకల్య పరీక్షలు నిర్వహించాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ(సీతక్క) సూచించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య తీరుతో చాలా మంది వికలాంగులు పథకాలకు దూరంగా ఉంటున్న విషయాన్ని ఎత్తిచూపారు. మంగళ వారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో సదరం ధ్రువీకరణ పత్రాలిచ్చే డాక్టర్ల వర్క్‌షాపు నిర్వహించారు. అందులో మంత్రితోపాటు సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, సదరం డైరెక్టర్ సాయి కిషోర్, న్యూ ఢిల్లీ ఎయిమ్స్, గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రుల పలు విభాగాధిపతులు, ఆయా విభాగాల స్పెషలిస్టులు, డాక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గతానుభవాల దృష్ట్యా రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి సదరం డాక్టర్లకు వర్క్‌షాపు నిర్వహిస్తున్నామ న్నారు. ఎలాంటి వైకల్యముంది? ఎంత శాత ముంది? అనే అంశాన్ని డాక్టర్లు పక్కాగా గుర్తించి సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని సూచించారు. రాష్ట్రంలో సదరం ధ్రువీకరణ పత్రాలు జారీచేసే 38 ఆస్పత్రులకు రూ.3.8 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. చేయూత పెన్షన్, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం ద్వారా స్వయం ఉపాధి పథకాలకు సదరం సర్టిఫికెట్ కీలకమని నొక్కిచెప్పారు. అందుకే డాక్టర్లు మానవ తను జోడించి వైకల్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. అర్హులెవ్వరూ నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకుని 21 రకాల వైకల్య ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని సూచించారు. వైకల్యాన్ని సరిగా జడ్జిమెంట్ చేసేందుకు అనుభవజ్ఞులైన డాక్టర్లతో శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్పారు. వికలాంగుల పరికరాల కోసం ఏటా రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ వర్క్‌షాపులో 200మందికిపైగా డాక్టర్లు పాల్గొన్నారు.
అర్హులకు సర్టిఫికెట్ ఇవ్వకపోతే అన్యాయం చేసినట్టే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES