యూఎస్‌తో ఒప్పందం జరగకపోతే కష్టమే : నిపుణుల అంచనా
న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ రికార్డ్ కనిష్టాలను చవి చూస్తోండగా.. ఈ పరిస్థితి మరింత కాలం కొనసాగవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తోన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఖరారు కాకపోతే డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90 దిగువకు రాకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. పెరుగుతోన్న వాణిజ్య లోటు, విదేశీ పెట్టుబడులు తగ్గడం కారణంగా రూపాయిపై ఒత్తిడి పెరుగుతోందని విశ్లేసిస్తున్నారు. ఇప్పటికే డిసెంబర్ 3న రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 90కి పడిపోయి రికార్డు కనిష్ట స్థాయిని నమోదు చేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి 5 శాతం బలహీనపడింది. దీంతో ఆసియాలో అత్యంత పేలవమైన పనితీరు కనబరిచిన కరెన్సీగా నిలిచింది. యూఎస్-ఇండియా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో రూపాయి విలువ 90కి దిగజారిన పరిస్థితిని చూశామని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన ఆర్థికవేత్త మదన్ సబ్నవిస్ పేర్కొన్నారు. రూపాయి స్వల్పకాలంలో అస్థిరంగా ఉండవచ్చని, రెండువైపులా హెచ్చుతగ్గులు ఉంటాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రిన్సిపల్ ఎకనామిస్ట్ సాక్షి గుప్తా తెలిపారు. డిసెంబర్ నెలాఖరులోగా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరితే, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు చోటు చేసుకుంటే రూపాయికి తాత్కాలిక మద్దతు లభించే అవకాశం ఉందని ఆమె అభిప్రాయ పడ్డారు. వచ్చే ఏడాది మార్చి నాటికి డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 87.5-89 మధ్య ఉండొచ్చని.. ఒకవేళ వాణిజ్య ఒప్పందం విఫలమైతే ఈ విలువ 89-91 మధ్య ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని గుప్తా అంచనా వేశారు. యుఎస్‌తో వాణిజ్య ఒప్పందం కుదరకపోతే రూపాయి తరుగుదల వేగం ఎక్కువగా ఉంటుందని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త గౌర సేన్‌గుప్తా విశ్లేషించారు.



