మెస్సీతో ఫుట్‌బాల్ ఆడేందుకు కోట్లు ఖర్చు చేస్తున్న మేస్త్రీ
పిల్లలకు మాత్రం తిండి పెట్టడం లేదు : ఎమ్మెల్యే హరీశ్‌రావు
కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో విద్యార్థులకు పరామర్శ
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
రేవంత్‌రెడ్డి విజన్ 2047 అని డబ్బా కొట్టుకుంటున్నారు కానీ ఇది విద్యార్థుల పాలిట పాయిజన్ 2047గా మారిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే గురుకులాల్లోని పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టాలన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురై కింగ్ కోఠి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్‌తో కలిసి ఆయన శనివారం పరామర్శించారు. బాలికలకు అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక గురుకుల పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆస్పత్రుల పాలవుతున్నారని తెలిపారు.
మొన్న శామీర్‌పేట్ బీసీ గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఏకంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారని చెప్పారు. నిన్న మాదాపూర్‌లో, బాగ్‌లింగంపల్లిలో కలుషిత ఆహార ఘటనలు వెలుగు చూశాయని తెలిపారు. ఆస్పత్రిలో చేరిన విద్యార్థులు భయంతో మళ్లీ హాస్టల్‌కు వెళ్లబోమని చెబుతున్నారన్నారు. కేసీఆర్ హయాంలో సన్నబియ్యంతో నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందేదని, ఇప్పుడు దొడ్డు బియ్యం పెడుతున్నారని ఆరోపించారు. అన్నం ఉడకడం లేదని, సరైన భోజనం పెట్టట్లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. మెస్సితో ఫుట్‌బాల్ ఆడేందుకు మేస్త్రీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, అదే డబ్బుతో పిల్లలకు ఒక పూట కడుపునిండా భోజనం పెట్టొచ్చు కదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు, ఢిల్లీ పర్యటనలకు సమయం ఉంది కానీ ఆస్పత్రుల్లో ఉన్న విద్యార్థులను పరామర్శించేందుకు మాత్రం ఆయనకు సమయం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఫుట్‌బాల్ మ్యాచ్‌లపై ఉన్న శ్రద్ధ, చనిపోతున్న రైతులు, విద్యార్థులపై లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు చనిపోతున్నా, బీసీలు పోరాటం చేస్తున్నా మొఖం చాటేసిన రాహుల్ గాంధీ.. నేడు ఫుట్‌బాల్ చూడటానికి వచ్చారని విమర్శించారు. కలుషిత ఆహారంతో బాధపడుతున్న విద్యార్థుల కన్నీళ్లు చూడాలని రాహుల్ గాంధీకి సూచించారు. త్రీ ట్రిలియన్ ఎకానమీ, ఫ్యూచర్ సిటీ అని గొప్పలు చెప్పడం కాదు.. ముందు హాస్టల్ పిల్లలకు పురుగులు లేని అన్నం పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఎన్‌ఐడీసీ మాజీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పర్యాటక శాఖ మాజీ చైర్మెన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్‌ఎస్ గోషామహల్ ఇన్‌చార్జి ఆర్‌వీ మహేందర్ కుమార్ తదితర నాయకులు ఉన్నారు.
విజన్ 2047 కాదు పాయిజన్ 2047
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



