Saturday, January 10, 2026
E-PAPER
Homeఆటలుతొలి సవాల్‌కు వేళాయే!

తొలి సవాల్‌కు వేళాయే!

- Advertisement -

రేపటి నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌
టీ20 ప్రపంచకప్‌ ముంగిట వన్డే పోరు

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు సొంతగడ్డపై కఠిన సవాల్‌కు సిద్ధమవుతున్న టీమ్‌ ఇండియా.. కొత్త ఏడాదిని వన్డే సవాల్‌తో షురూ చేయనుంది. ఇటు భారత్‌, అటు న్యూజిలాండ్‌ ఫోకస్‌ పూర్తిగా పొట్టి ఫార్మాట్‌పైనే ఉన్నప్పటికీ.. సీనియర్‌ ఆటగాళ్లు కోహ్లి, రోహిత్‌ మేనియాను ఆస్వాదించేందుకు టీమ్‌ ఇండియా… సీనియర్‌ ఆటగాళ్లు లేని వేళ అవకాశాలు అందిపుచ్చుకునేందుకు కివీస్‌ సమాయత్తం అవుతున్నాయి.

నవతెలంగాణ-వడోదర
న్యూజిలాండ్‌ గతంలో భారత పర్యటనను అత్యంత విజయవంతంగా ముగించింది. భారత్‌ను 3-0తో చిత్తు చేసి టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. స్వదేశంలో ఓటమెరుగని టీమ్‌ ఇండియాకు కివీస్‌ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. ఆ తర్వాతి సిరీస్‌ల్లోనూ భారత్‌ కోలుకునేందుకు ఆపసోపాలు పడింది. గత పర్యటనలో కివీస్‌ చేసిన గాయం నుంచి భారత్‌ కోలుకోలేదు. ఇప్పుడు, మరోసారి ఆ జట్టు భారత పర్యటనకు వస్తోంది. అయితే ఈసారి వైట్‌బాల్‌ సవాల్‌ కోసం న్యూజిలాండ్‌ జట్టు భారత్‌లో అడుగుపెట్టింది. మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు న్యూజిలాండ్‌ క్రికెటర్లు భారత్‌కు చేరుకున్నారు. ఆదివారం వడోదరలో తొలి వన్డేతో వైట్‌బాల్‌ సవాల్‌ షురూ కానుంది.

ఆ ఇద్దరిపైనే ఫోకస్‌
ఆస్ట్రేలియా పర్యటనలో ఆఖరు వన్డేతో ఫామ్‌లోకి వచ్చిన సీనియర్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ.. అదే జోరు కొనసాగిస్తున్నారు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో కోహ్లి వరుసగా రెండు శతకాలు, ఓ అజేయ అర్థ సెంచరీతో మెరువగా.. రోహిత్‌ శర్మ సైతం తనదైన జోరు చూపించాడు. తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్‌లో విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ షో కోసమే అభిమానులు ఎదురుచూస్తున్నారు. 2027 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ రేసులో నిలిచిన రోకో.. అందుకు ప్రతి సిరీస్‌లోనూ సత్తా చాటాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు తగినట్టుగానే ఈ ఇద్దరు బ్యాటర్లు వీరోచిత విన్యాసాలతో అలరిస్తున్నారు. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ టీ20ల్లో పేలవ ప్రదర్శనతో ప్రపంచకప్‌కు ఎంపిక కాలేదు. అచ్చొచ్చిన ఫార్మాట్‌లో శుభ్‌మన్‌ పరుగుల వేట సాగించేందుకు ఎదురుచూస్తున్నాడు.

గాయం నుంచి కోలుకున్న వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ సైతం సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. వికెట్‌ కీపర్‌గా గత సిరీస్‌లో రిషబ్‌ పంత్‌ బెంచ్‌కు పరిమితం అయ్యాడు. తాజా సిరీస్‌లో కెఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌లలో ఎవరు తుది జట్టులో నిలుస్తారనే ఉత్కంఠ కనిపిస్తోంది. బౌలింగ్‌ విభాగంలో జశ్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతి లభించింది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు సైతం విశ్రాంతి దక్కింది. బుమ్రా లేకుండా అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రానా, మహ్మద్‌ సిరాజ్‌లు పేస్‌ బాధ్యతలను పంచుకోనున్నారు. వన్డేల్లో రీ ఎంట్రీ ఇస్తున్న మహ్మద్‌ సిరాజ్‌ పేస్‌ దళానికి నాయకత్వం వహించనున్నాడు. స్పిన్‌ విభాగంలో కుల్‌దీప్‌ యాదవ్‌ భారత్‌కు కీలకం కానున్నాడు.

కొత్తగా కివీస్‌
న్యూజిలాండ్‌ సీనియర్‌ క్రికెటర్లు రానున్న టీ20 సిరీస్‌, టీ20 ప్రపంచకప్‌ కోసం కసరత్తు చేస్తుండగా.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఆ జట్టు కుర్రాళ్లను ఎంచుకుంది. ప్రథమ ప్రాధాన్య ఆటగాళ్లు చాలా మంది జట్టులో లేరు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌ సమయంలో ఐపీఎ ఉండటంతో ఆ పర్యటనకూ కుర్రాళ్లనే ఎంపిక చేయనున్నారు. దీంతో బలమైన భారత్‌పై రాణించి జట్టులో చోటు నిలుపుకోవాలని యువ క్రికెటర్లు తపిస్తున్నారు. లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ జేడెన్‌ లెనాక్స్‌, పేస్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్టియన్‌ క్లార్క్‌, లెగ్‌ స్పిన్నర్‌ ఆదిత్య అశోక్‌, మైకల్‌ రే వంటి కొత్త ముఖాలు న్యూజిలాండ్‌ జట్టులో కనిపిస్తున్నాయి.

మిచెల్‌ శాంట్నర్‌, ఇశ్‌ సోధి వంటి మాయగాళ్లు లేకపోవటం ఆ జట్టుకు లోటు. కానీ కొత్త పేసర్లు, స్పిన్నర్లపై తడబాటు భారత బ్యాటర్లకు ఉన్న బలహీనత. భారత సంతతి ఆటగాడు ఆదిత్య అశోక్‌, జేడెన్‌ లెనాక్స్‌లు ఇశ్‌ సోధి, మిచెల శాంట్నర్‌ లేని లోటు పూడ్చేందుకు ప్రయత్నం చేయనున్నారు. డెవాన్‌ కాన్వే, డార్లీ మిచెల్‌, మైకల్‌ బ్రాస్‌వెల్‌, విల్‌ యంగ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, కైల్‌ జెమీసన్‌లు న్యూజిలాండ్‌కు కీలకం కానున్నారు. సీనియర్‌, జూనియర్‌ ఆటగాళ్ల మేళవింపుతో న్యూజిలాండ్‌ సరికొత్తగా కనిపిస్తోంది. బలమైన భారత్‌కు సవాల్‌ విసిరేందుకు ఎదురుచూస్తోంది.

భారీ స్కోర్లు ఖాయం!
భారత్‌, న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌లో భారీ స్కోర్లు నమోదు కావటం లాంఛనంగా కనిపిస్తోంది. 15 ఏండ్ల తర్వాత వడోదరలో తొలిసారి వన్డే మ్యాచ్‌ జరుగనుండగా.. ఇండోర్‌, రాజ్‌కోట్‌లు భారీ స్కోర్లకు పెట్టింది పేరు. భారత్‌లో ఈ సమయంలో రాత్రి వేళల్లో మంచు ప్రభావం అధికంగా ఉంటుంది. భారీ లక్ష్యాలను సైతం అలవోకగా ఛేదించేందుకు అవకాశం ఉంటుంది. ఫలితంగా, స్పిన్నర్లు సైతం మ్యాచ్‌ ఫలితాన్ని నిర్దేశించటంలో కీలక పాత్ర పోషించనున్నారు.

అయ్యర్‌కు గ్రీన్‌ సిగ్న‌ల్‌
ఆస్ట్రేలియా పర్యటనలో ఫీల్డింగ్‌ చేస్తూ తీవ్రంగా గాయపడిన శ్రేయస్‌ అయ్యర్‌కు బీసీసీఐ వైద్య బృందం తుది గ్రీన్‌ సిగ్న‌ల్‌ ఇచ్చింది. శస్త్రచికిత్స అనంతరం రిహాబిలిటేషన్‌లో కొనసాగిన అయ్యర్‌ సీఈఓలో ఫిట్‌నెస్‌ సాధించాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో ముంబయి తరఫున బరిలోకి దిగి ఫామ్‌తో పాటు మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ నిరూపించుకున్నాడు. దీంతో శ్రేయస్‌ అయ్యర్‌ వడోదరలో భారత జట్టుతో శుక్రవారమే చేరాడు.

భారత్‌, న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌
తొలి వన్డే : జనవరి 11న, వడోదర
రెండో వన్డే : జనవరి 14న, రాజ్‌కోట్‌
మూడో వన్డే : జనవరి 18న, ఇండోర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -