ఉదయం 9 నుంచి సోనీస్పోర్ట్స్‌లో..
భారత్, ఆసీస్ తొలి వన్డే నేడు
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మపై ఫోకస్
ఆసియా కప్, స్వదేశంలో కరీబియన్ సిరీస్ అనంతరం టీమ్ ఇండియా మెగా సవాల్‌కు సిద్దమైంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లేకుండా సాగిన గత సిరీస్‌లు కమర్షియల్‌గా ప్రతికూల ప్రభావం చూపగా.. అభిమానుల్లో నిరాసక్తి కనిపించింది. ఏ ఫార్మాట్‌లోనై భారత్‌కు సమవుజ్జీ ఆస్ట్రేలియా. కోహ్లి, రోహిత్ రాకతో జరుగుతున్న ఆసీస్‌తో వన్డే సిరీస్‌పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే నేడు పెర్త్ ఆప్టస్ స్టేడియంలో జరుగుతుంది.
నవతెలంగాణ-పెర్త్
వన్డే ఫార్మాట్‌లో 2023 ప్రపంచకప్‌ను కంగారూలు దక్కించుకోగా.. ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీ విజయంతో భారత్ టైటిల్ దాహం సగమైనా తీర్చుకుంది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో వన్డే ఫార్మాట్‌కు వేగంగా ఆదరణ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో అగ్ర జట్లు భారత్, ఆసీస్ మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో పాల్గొనటం ప్రాధాన్యం సంతరించింది. సుమారు ఏడు నెలల తర్వాత భారత్ మళ్లీ వన్డే ఫార్మాట్‌లో ఆడనుండటం పరిస్థితికి అద్దం పడుతుంది. ఆసీస్ శిబిరంలో పాట్ కమిన్స్ లేకపోయినా.. ట్రావిశ్ హెడ్, మిచెల్ స్టార్క్‌లు సవాల్ విసిరేందుకు సిద్ధమయ్యారు. భారత్ నుంచి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సహా శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ కంగారూలను ఢకొీట్టేందుకు రంగం సిద్ధం చేశారు. భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే నేడు పెర్త్‌లో ఉదయం 9 గంటలకు ఆరంభం కానుంది.
ఆ ఇద్దరు వస్తున్నారు
భారత క్రికెట్ సూపర్‌స్టార్స్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ. టీ20, టెస్టులకు వీడ్కోలుతో జాతీయ జట్టు తరఫున ఆడేందుకు సుదీర్ఘ సమయం ఎదురుచూడాల్సి వస్తుంది. ఈ ఏడాది ఆరంభంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత కోహ్లి, రోహిత్ ఆడనుండటం ఇదే తొలిసారి కానుంది. స్టార్ క్రికెటర్ల రాకతో సహజంగానే స్టేడియం నిండు కుండను తలపించనుంది. పెర్త్ స్టేడియంలో ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే 50 వేల మంది ప్రేక్షకులు వచ్చినట్టు రికార్డు. నేడు భారత్, ఆసీస్ మ్యాచ్‌తో ఆ రికార్డు మూడు సార్లకు చేరనుంది. 50,000 టికెట్లు అమ్మడుపోయినట్లు నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోయినా రోహిత్ ముంబయి శివాజీ గ్రౌండ్‌లో ముమ్మర సాధన చేశాడు. విరాట్ కోహ్లి ప్రయివేటు అకాడమీలో ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది. ఆసీస్‌లో అడుగుపెట్టిన తర్వాత సైతం ఇద్దరు క్రికెటర్లు నెట్స్‌లో కఠోరంగా సాధన చేస్తున్నారు. ఫిట్‌నెస్ స్థాయిలు సైతం గణనీయంగా మెరుగైనట్టు కనిపిస్తోంది. కోహ్లి, రోహిత్ రీ ఎంట్రీతో భారత బ్యాటింగ్ భారం సీనియర్లు తీసుకోనున్నారు.
ముగ్గురు ఆల్‌రౌండర్లతో..
శుభ్‌మన్ గిల్ నేడు తొలి వన్డేలో ముగ్గురు ఆల్‌రౌండర్లను తుది జట్టులోకి తీసుకునే సూచనలు ఉన్నాయి. తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి కంగారూ గడ్డపై టెస్టుల్లో సత్తా చాటాడు. వైట్‌బాల్ ఫార్మాట్‌లో అతడిపై జట్టు మేనేజ్‌మెంట్ నమ్మకం ఉంచుతోంది. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తుది జట్టులో ఖాయం. లోతైన బ్యాటింగ్ లైనప్ కోసం వాషింగ్టన్ సుందర్‌ను సైతం తుది జట్టులోకి తీసుకోవాలనే ఆలోచన ఉంది. చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మరి, కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. పేస్ విభాగంలో మహ్మద్ సిరాజ్, హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్‌లు ఉండనున్నారు. ప్రసిద్ కృష్ణ సైతం చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. బ్యాటింగ్ లైనప్‌లో ఎటువంటి మార్పులు లేవు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన టాప్-6 ఆర్డర్‌ను కొనసాగించనున్నారు. రోహిత్, గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్, అక్షర్ టాప్, మిడిల్ ఆర్డర్‌లో ఉంటారు.
ఆసీస్‌కు గాయాల బెడద
ఆతిథ్య కంగారూలకు గాయాల బెడద తగిలింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయంతో అందుబాటులో లేడు. ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ ఆఖర్లో గాయంతో తప్పుకున్నాడు. అలెక్స్ కేరీ, ఆడం జంపాలు తొలి రెండు మ్యాచులకు అందుబాటులో లేరు. బ్యాటింగ్ లైనప్‌లో ట్రావిశ్ హెడ్, బౌలింగ్ లైనప్‌లో మిచెల్ స్టార్క్‌లు భారత్‌కు సవాల్ విసరనున్నారు. ట్రావిశ్ హెడ్‌కు భారత్‌పై తిరుగులేని రికార్డుంది. 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ఫైనల్, ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్లో శతకాలతో ట్రోఫీలను భారత్ నుంచి లాగేశాడు హెడ్. స్టార్క్ సైతం పదునైన పేస్‌తో భారత బ్యాటర్లను ఇరకాటంలో పడేయడంలో ముందుంటాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్ , మాథ్యూ షార్ట్, మాట్ రెన్షాలు మంచి ఫామ్‌లో ఉన్నారు. జోశ్ ఫిలిప్ వికెట్ కీపర్‌గా తొలిసారి ఆడుతున్నాడు. నాథన్ ఎల్లీస్, మాట్ కున్హేమాన్, హేజిల్‌వుడ్‌లు స్టార్క్‌తో కలిసి బంతి బాధ్యతలు పంచుకోనున్నారు.
పిచ్, వాతావరణం
పెర్త్ ఆప్టస్ స్టేడియంలో ‘డ్రాప్ ఇన్’ పిచ్‌లు వాడతారు. సహజంగా ఈ పిచ్‌లు తక్కువ స్కోర్లకు చిరునామా. ఆసీస్ ఇక్కడి ఆడిన చివరి రెండు వన్డే మ్యాచుల్లో 152, 140 పరుగులకే కుప్పకూలింది. ఈ సీజన్‌లో భారత్, ఆసీస్ మ్యాచే ప్రథమం. దీంతో నేటి మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశాలు తక్కువే. నేటి మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం లేకపోలేదు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఆసీస్ ఇక్కడ ఆడిన మూడు వన్డేల్లోనూ ఓటమి పాలవటం గమనార్హం.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రానా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
ఆస్ట్రేలియా : ట్రావిశ్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాట్ షార్ట్, మాట్ రెన్షా, జోశ్ ఫిలిప్ (వికెట్ కీపర్), మిచెల్ ఓవెన్, కూపర్ కానొల్లీ, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లీస్, మాట్ కున్హేమాన్, జోశ్ హాజిల్‌వుడ్.