నవతెలంగాణ – రాయపర్తి
సమస్యలపై స్పందిస్తూ.. నిజాలను నిర్భయంగా రాసే నవతెలంగాణ దినపత్రిక కథనానికి కదలిన విద్యాశాఖ యంత్రాంగం మూతపడిన ప్రభుత్వ పాఠశాలలను ఒక్కొక్కటిగా పునః ప్రారంభిస్తుంది. వివరాల్లోకి వెళితే..మండలంలో 14 ప్రైమరీ పాఠశాలలు గతంలో మూతపడ్డాయి.. ఈ విద్యా సంవత్సరంలో మూతపడిన పాఠశాలల పునః ప్రారంభానికి బడిబాట కార్యక్రమాన్ని చేపట్టలేదు. 16 మంది ఉపాధ్యాయులు డిప్టేషన్ లో పనిచేయడంతో ఉపాధ్యాయుల జాడ ఎక్కడ? అనే అంశంపై నవతెలంగాణ దినపత్రికలో “మూగబోయిన బడి గంటలు..!” అనే కథనం ప్రచురించబడింది. ఈ కథనంపై జిల్లా విద్యాశాఖ యంత్రాన స్పందించింది. మూతపడిన ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలను పునః ప్రారంభించాలని ఎంఈఓ వెన్నంపల్లి శ్రీనివాస్ కంకణ బద్ధులై ప్రణాళిక బద్ధంగా ఒక్కొక్క పాఠశాలను పునః ప్రారంభిస్తున్నారు.
మొదటగా ఎర్రకుంట తండా ఎంపీపీఎస్ పాఠశాలను పునః ప్రారంభించి గిరిజన చిన్నారులకు ప్రైమరీ విద్యను అందుబాటులోకి తెచ్చారు. జగన్నాథ పల్లి ఎంపీపీఎస్ పాఠశాలను పునః ప్రారంభించడానికి గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాల పునః ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. సుమారు 25 మంది విద్యార్థులతో పాఠశాలను ప్రారంభించి నిర్వహిస్తామన్నారు. పునః ప్రారంభ ఏర్పాట్లకు గురువారం ఎంఈఓ శ్రీనివాస్.. ఎంపీడీఓ కిషన్, ఎంపీఓ కూచన ప్రకాష్, కాంప్లెక్స్ హెచ్ఎం అజ్మీర ఉమాదేవితో కలిసి పాఠశాలను సందర్శించారు. ఉదయం 9 గంటలకు పాఠశాలలో బడి గంట మోగుతుందని తెలిపారు. కాంప్లెక్స్ హెచ్ఎంల తోడ్పాటు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో మూతపడిన పాఠశాలలను పునః ప్రారంభిస్తామని నవతెలంగాణతో విన్నవించారు.
రేపు జగన్నాథపల్లి పాఠశాల పునః ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES