నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సొంత పార్టీలోనే బీజేపీ కోవర్టులు ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొందరు నేతలు ప్యాకేజీలు తీసుకుని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో కోవర్టుల వ్యూహం కొత్తేమీ కాదని, ప్రతి పార్టీలోనూ ఒకరిద్దరు ఇలాంటి వారు ఉండటం సర్వసాధారణమని జగ్గారెడ్డి అన్నారు. అయితే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోనే బీజేపీకి అనుకూలంగా పనిచేసే వారు ఉన్నారని ఆయన బాంబు పేల్చడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గతంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
జగ్గారెడ్డి వ్యాఖ్యల వెనుక నిర్దిష్ట లక్ష్యం ఉందనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించే ఆయన ఈ ఆరోపణలు చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ప్రభుత్వ పనితీరును లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో, రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలను అడ్డుకునేందుకే జగ్గారెడ్డి ఈ విధంగా స్పందించి ఉంటారని తెలుస్తోంది.