న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ ఆఖరి గవర్నర్ సత్యపాల్ మాలిక్ (79) మంగళవారం కన్నుమూశారు. కొన్ని నెలలుగా ఆయన డయాబెటిక్ కిడ్నీ వ్యాధి, రక్తపోటు, ఊబకాయం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. న్యూఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం 1:12 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. జూన్ 11వ తేదీన మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌తో సత్యపాల్ మాలిక్ ఆసుపత్రిలో చేరినట్లు తెలిపింది. ఈ తరువాత న్యూమోనియా, అవయవాలు పనిచేయకపోవడం వంటి సమస్యలు వృద్ధి చెందినట్టు చెప్పింది. సరైన, ఉత్తమ చికిత్సలు అందించినా మాలిక్ కోలుకోలేదని తెలిపింది. జమ్మూకాశ్మీర్‌తో పాటు బీహార్, ఒడిశా, మేఘాలయ, గోవా రాష్ట్రాలకు కూడా సత్యపాల్ మాలిక్ గవర్నర్‌గా పనిచేశారు. సత్యపాల్ మాలిక్ 1946 జూలై 24న ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలోని హిసావాడ గ్రామంలో జన్మించారు. ఆయనది జాట్ కుటుంబం. మీరట్ విశ్వవిద్యాలయం నుంచి సైన్స్, ఎల్‌ఎల్‌బీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1968-69లో మీరట్ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విద్యార్థి దశ నుంచి ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. భారతీయ క్రాంతిదళ్, కాంగ్రెస్, జన్‌మోర్చా (1988లో జనతాదళ్‌గా మారింది), బీజేపీ వంటి పార్టీల్లో పనిచేశారు. 1974-77 మధ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. 1980-1986, 1986-89 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. సత్యపాల్ మాలిక్ 2017లో బీహార్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2018 ఆగస్టులో ఆయనను జమ్మూకాశ్మీర్‌కు పంపారు. 2019లో ఆగస్టు 5న ఆర్టికల్ 370 కింద జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేయబడినప్పుడు ఆయన ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. 2019 అక్టోబర్‌లో ఆయనను గోవాకు బదిలీ చేశారు. మళ్లీ కేవలం తొమ్మిది నెలల్లోనే సత్యపాల్‌ను మేఘాలయకు తరలించారు. ఆయన అక్టోబర్ 4, 2022న మేఘాలయ గవర్నర్‌గా పదవీ విరమణ చేశారు.