నవతెలంగాణ-హైదరాబాద్: జార్ఖండ్ ముక్తీ మోర్చా (జేఎంఎం) అధికార ఎక్స్ ఖాతా హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ధ్రువీకరించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు.
జేఎంఎం ఎక్స్ ఖాతాను క్రిప్టో హ్యాకర్లు హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఖాతాలో క్రిప్టో పేమెంట్‌కు సంబంధించిన అడ్రస్‌తో పాటు, ఉడత ఉన్న ఫొటోను హ్యాకర్లు పోస్టు చేశారు. దీనిపై సోరెన్ స్పందిస్తూ.. ‘‘అసాంఘిక శక్తులు జేఎంఎం పార్టీ ‘ఎక్స్’ ఖాతాను హ్యాక్ చేశాయి. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన ఆదేశించారు. సోరెన్ ప్రస్తుతం దిల్లీలో ఉన్నారు. ఆయన తండ్రి శిబు సోరెన్ అక్కడ చికిత్స తీసుకుంటున్నారు. కాగా.. సీఎం పోస్టుకు రాష్ట్ర పోలీసులు స్పందించారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.