Friday, December 5, 2025
E-PAPER
Homeఎడిట్ పేజికార్మికులపై జిహాద్‌: బానిసత్వానికి శాసనబాట

కార్మికులపై జిహాద్‌: బానిసత్వానికి శాసనబాట

- Advertisement -

బీహార్‌ శాసనసభ ఎన్నికల్లో ప్రధానమైన విజయం అనంతరం ఆ ఊపులోనే భారత ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్‌లు విడుదల చేసింది. వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, వృత్తిగత భద్రత, సామాజిక భద్రతలకు సంబంధించిన ఈ కోడ్‌లు 29 కార్మిక చట్టాలు సులభతరం చేయడమనే పేరిట రుద్దబడ్డాయి. అయితే ఆ చట్టాలలో వున్న కార్మిక భద్రతాంశాల అవశేషాలు ఏ మాత్రం మిగిలివున్నా ఈ నాలుగు కోడ్‌లు వాటినీ నీరుగారుస్తాయన్నది అసలు నిజం. ఉద్యోగ భద్రత విషయంలో కార్మిక శాఖకు ఏయే పాత్రలు కల్పించబడినా వాటన్నిటికీ ఇప్పుడు స్వస్తి చెప్పడం జరుగుతుంది. అసంఘటిత రంగంలోని తొంభై శాతం మంది కార్మికులకు ఏ మాత్రం రక్షణ లేకుండా చేయబడుతుంది. వారిని నియమించే అధికార వ్యవస్థ అంటూ వుండకుండా పోతుంది. ఈ లేబర్‌ కోడ్‌లు అందరికీ ఒక కనీస వేతనం వుండేలా చేస్తాయని కేంద్రం చెప్పుకుంటున్నది. అయితే అనేక రాష్ట్రాలలో ఇప్పుడున్న కనీస వేతనాలను తగ్గించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. స్కీమ్‌ వర్కర్లతో సహా లక్షోపలక్షల మంది కార్మికులు న్యాయమైన జీవితానికి అవసరమైన వేతనం సంగతి అటుంచి కనీస వేతనం పరిధి నుంచి కూడా మినహాయించబడతారు.

అన్నీ అవాస్తవాలే
ఈ సోషల్‌కోడ్‌లు గిగ్‌ వర్కర్లకూ వీధుల్లో పనిచేసేవారికీ సామాజిక భద్రతను తొలిసారి ప్రవేశపెడతాయని కూడా కేంద్రం చెబుతున్నది. అయితే ఇందుకు ఎలాంటి నిధుల కేటాయింపుగానీ కాలవ్యవధిగానీ నిర్ణయించింది లేదు. ఉద్యోగులకూ యాజమాన్యానికి మధ్యన సంబంధమేమిటో కూడా ప్రస్తావించలేదు. అలాంటప్పుడు ఏదో ఆధార్‌ కార్డు వుందంటే దాని ద్వారా కార్మిక బలగం పరిస్థితి ఎలా మెరుగవుతుంది? లేబర్‌ కోడ్‌ల ప్రకారం నిర్ణీత కాలవ్యవధిగల ఉద్యోగాలకు సమానమైన ప్రయోజ నాలు లభించుతాయని కూడా చెప్పబడుతున్నది. వాస్తవం ఏమంటే దీనివల్ల నిరంతరాయంగా కొనసాగే ఉద్యోగాలలో ఈ కోడ్‌ స్వల్పకాలిక కాంట్రాక్టుల ద్వారా శాశ్వత ప్రాతిపదికన తాత్కాలిక ప్రతిపత్తి ప్రవేశపెడుతుంది. తద్వారా సర్వీసు కొనసాగింపు దెబ్బతినిపోవడమే గాకుండా యూనియన్లుగా ఏర్పడే హక్కులు కూడా లేకుండా పోతాయి.

లేబర్‌కోడ్‌ల వల్ల ప్రభుత్వం వాటి అమలుకు సంబంధించిన పర్యవేక్షణ పాత్రను, క్రమబద్ధీకరణ పాత్రనూ కోల్పోతుంది. ఫిర్యాదులు అందితే తనిఖీ చేయడమనే ప్రస్తుత పద్ధతిని పూర్తిగా లేకుండా చేస్తుంది. దాని స్థానే తమకు తామే సర్టిఫికెట్లు ఇచ్చుకునే పద్ధతి తెచ్చి పెడుతుంది. అంటే దాని అర్థం వారు ప్రస్తుతమున్న నిబంధనలు పాటించకుండా వారు అన్ని రకాలైన ఉల్లంఘనలకూ పాల్పడవచ్చునన్న మాట. ఉద్యోగులు రక్షణ కోసం కల్పించబడిన ఈ ప్రయోజనాల తొలగింపునకు పెట్టుకున్న ముద్దు పేరే స్వీయ అమలు ప్రకటన. ఈ లేబర్‌కోడ్‌లు చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎం.ఎస్‌.ఎం.ఇ లు)టీ తోటల వంటివి, గనులు నిర్మాణ కార్మికుల పరిస్థితి మెరుగుదలకు తీసుకొచ్చినట్టు చిత్రించడం జరుగుతున్నది. ఇంతకన్నా పచ్చి అసత్యం మరొకటి వుండదు. ఎం.ఎస్‌.ఎం.ఇ లలో పనిచేసే కార్మికులు చట్టం పరిధిలో లేరు. సెస్‌ వసూలులోనూ పారదర్శకతను కాపాడే యంత్రాంగ మేమీ లేదు. అపాయకరమైన ప్రమాదాలు జరిగే గనులు, తోటల వంటి చోట్ల తనిఖీలను నీరుగార్చడం మరింత తీవ్రమైన ప్రమాదాలు జరగడానికి దారితీస్తుంది. నేరపూరిత దోషం చట్టం కింద యజమానులకు బాధ్యత లేకుండా చేయబడుతుంది.

ఐ.ఎల్‌.సి ఏమైంది?
లేబర్‌చట్టాల స్థానంలో లేబర్‌ కోడ్‌లు ప్రవేశపెట్టే విషయమై కార్మికులతో తాము సాధ్యమైనంత ఎక్కువగా చర్చలు జరిపామని కేంద్ర ప్రభుత్వం పత్రికా ప్రకటనలు చేస్తున్నది. సోషల్‌ మీడియాలోనూ చెప్పుకుంటున్నారు. స్వతంత్ర భారతదేశంలో మొదటి లేబర్‌ కమిషన్‌ 1966లో ఏర్పడింది. ప్రభుత్వం, ఉద్యోగులు, కార్మికుల త్రైపాక్షిక సంప్రదింపులకు ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ (ఐ.ఎల్‌.సి) అనేది వ్యవస్థాపక యంత్రాంగంగా వుండాలని మొదటి లేబర్‌ కమిషన్‌ సిఫార్సు చేసింది. కానీ గత పదేండ్లలో ఒక్కసారి కూడా ఐ.ఎల్‌.సి సమావేశం జరిపిందే లేదు. అందువల్ల పార్లమెంటు ఎలాంటి అర్థవంతమైన చర్చలు లేకుండానే ఈ లేబర్‌ కోడ్‌లు రూపొందించింది. ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తయారైనాయి. యాజమా న్యాల తప్పులను నేరం కాకుండా చేయడా నికీ, తమ సమిష్టి హక్కులు, బేరసారాలను సాధించు కోవడం కోసం కార్మికులు జరిపే పోరాటాలను, నిరసనలనూ నేరంగా మార్చడానికీ ఇవి ఉద్దేశించ బడ్డాయనేది స్పష్టమే. ఉద్యోగులపై యాజమాన్యాల అభిప్రాయాన్నేరుద్దే ప్రక్రియకు ఇది కచ్చితంగా పరాకాష్ట.

పెట్టుబడులూ ఉద్యోగాల నిజాలు
కనుక హోరెత్తిస్తున్న సులభతర వాణిజ్యం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) నినాదానికి బాటలు వేయడమే ఈ లేబర్‌కోడ్‌ల వెనక నిర్దేశం.దాంతో భారీగా పెట్టుబడులు వచ్చేస్తాయనీ, ఆ వెంటనంటి ఉద్యోగాల కల్పన కూడా పెద్ద ఎత్తున జరిగిపోతుందనీ భావించడం విచారకరం. పరిశ్రమలపై అనేక సంవత్సరాల నివేదికలు పరిశీలిస్తే కనిపించే కఠోర వాస్తవాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా వున్నాయి. 1981-82లో వచ్చిన వేతనాల నికర విలువ 30.27 శాతం వుంటే 2023-24లో కేవలం 15.97 శాతానికి పడిపోయిందని ఈ నివేదికలు చెబుతున్నాయి. ఇదే కాలంలో యజమానుల లాభాలు మాత్రం 23.39 శాతం నుంచి 51.01 శాతానికి చేరుకున్నాయి. దీని ప్రభావం కార్మికులపై మరింత తీవ్రంగా కనిపిస్తుంది. ఉత్పత్తి రంగంలో సగటున వేతనాల పెరుగుదల రేటు 2013-14లో 6.7 శాతం వుంటే 2023-24లో 4.8 శాతానికి దిగజారింది.

చదువుకున్న నిరుద్యోగ యువత సంఖ్య పెరిగిందని ప్రభుత్వం ఒప్పుకుంటుంది. 2024-25 ఎకనామిక్‌ సర్వే చూస్తే సగటున వచ్చే పదేండ్ల్లలో ఏడాదికి 85 లక్షల ఉద్యోగాలు కల్పించబడతాయని చెబుతున్నది. యువతలో నిరుద్యోగం రేటు ఆసియాలోనే అత్యధికంగా మన దేశంలో 17.6 శాతంగా వుంది. ఎ.ఐ అనే కృత్రిమ మేధస్సు ఇండియాలో ఐ.టి రంగంలో ఇరవై లక్షల ఉద్యోగాలను హరించవచ్చునని నీతిఆయోగ్‌ అంచనా వేసింది. ఉత్పత్తి రంగానికి సంబంధించిన డేటాను గమనిస్తే పనిలో పాల్గొంటున్నవారి సంఖ్య 2004-05 మధ్య 7.14 శాతం వుంటే 2023-24 మధ్య 5.92 శాతానికి పడిపోయింది. ఈ లెక్కలను పరిశీలించినపుడు దేశంలో గిరాకి వేగంగా పడిపోతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. కార్మికులను దోచుకునే కార్పొరేట్లు, యజమానులపై ఎలాంటి ఆంక్షలు లేకుండా చేయడం వల్ల ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం మరింత పెరగడమే జరుగుతుంది. దాంతో దేశీయ గిరాకీ పూర్తిగా కుప్ప కూలిపోతుంది. అలాంటి ఆందోళనకరమైన పరిస్థితి పెట్టుబడులు రావడానికి సానుకూలత ఎలా సృష్టించగలదు?

ఉత్పత్తి వ్యవస్థకే ముప్పు
లేబర్‌ కోడ్‌లు నిజంగానే కార్మికులను మరింత బానిసలుగా చేయడానికి పునాది వేస్తాయి. వాస్తవంలో ఆర్థిక ఉత్పత్తికి అవసరమైన రెండు ప్రాథమిక అంశాల్లోనూ అంటే శ్రామికులు, పెట్టుబడి అనే రెంటినీ దెబ్బతీస్తాయి. ఈ రెండింటి మధ్య సమతుల్యత గనక లేకుండా పోతే-ప్రభుత్వం యాజమాన్యాలపై అన్ని నియంత్రణలు ఎత్తివేసి కార్మికులు మగ్గిపోవలసిన పరిస్థితి కల్పిస్తే మొత్తం ఉత్పత్తి వ్యవస్థనే తెగిపోతుంది. స్తంభించిపోతుంది. ఉత్పత్తి క్రమంలో సాంకేతిక పరిజ్ఞానం ఒక ముఖ్యమైన భాగమని ఎవరైనా భావించేట్టయితే ఈ రోజున దాన్ని పెట్టుబడితో కలిసి ఏకపక్షంగా గుమ్మరిస్తున్నారు. దానివల్ల ఒకవైపున ఉత్పాదకత పెరుగుతుంది.

అయితే అందుకు తగినట్టు శ్రామికులకు రక్షణ లేకపోతే అనివార్యంగా అది వారిని మరింతగా దోచుకోవడానికే దారితీస్తుంది. లేబర్‌కోడ్‌లలోని ప్రతి నిబంధనా ఆ దిశలోనే వుంది. అందుకనే వాటిని కార్మికులపై వర్గయుద్ధం (జిహాద్‌)గా చూడాల్సి వుంది. ఇక ఇప్పుడు ముందుకు పోవడానికి ఏకైక మార్గం శ్రామికుల సమిష్టి నిరసన, సమైక్య పోరాటాలు మాత్రమే. మాత్రమే. కార్పొరేట్‌ యజమానులకు ఆయుధాలు సమకూర్చేందుకు, అంతులేని ఆధిపత్యం కల్పించేందుకు మారుపేరుగా ముందుకొచ్చిన ఈ తప్పుడు సంస్కరణలతో నేరుగా ఢీకొనవలసిందే. అదృష్టవశాత్తూ కార్మికవర్గంలో ఐక్యత పెరుగుతుండటం, విస్తార రైతాంగ వర్గాలు కూడా వారితో భుజం కలపడం వల్ల ఈ పరిస్థితిని పరిష్కరించడానికి కృషి సాగించవచ్చు.
(నవంబరు 26 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -