మిషన్ కాకతీయలో మరమ్మతులకు నోచని చెరువు
వన్య మృగాల దాహార్తికి 1968లో నిర్మాణం
చెంచులు, వన్యప్రాణులకు తాగునీటి తిప్పలు
చెట్టు కోసం రసూల్ చెరువు నిర్మాణాన్ని అడ్డుకుంటున్న అటవీ అధికారులు
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
నల్లమల్ల అటవీ ప్రాంతంలో చెంచులు, వన్యప్రాణుల తాగునీటి కోసం నిర్మించిన ‘జీల్దార్ తిప్ప’ గొంతు తడపట్లేదు. దీనివల్ల నల్లమల చెంచులకు, వన్యప్రాణులకు తాగు నీటితోపాటు సాగునీటి తిప్పలు వెంటాడు తున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి వద్ద 1968లో అప్పటి కొల్లాపూర్ ఎమ్మెల్యే రంగదాస్ నిర్మించిందే ‘జీల్దార్ తిప్ప’ చెరువు. వన్య మృగాల దాహార్తి కోసం నిర్మాణం చేపట్టారు. అయితే ఇప్పటికీ దాని పనులు పూర్తి కాలేదు. మరమ్మతుకు నోచుకోలేదు. గత ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలోనూ ఈ చెరువును పట్టించుకోలేదు. ఈ చెరువు మరమ్మతులు పూర్తిచేస్తే 5వేల ఎకరాలకు సాగునీటితోపాటు వందలాది చెంచు కుటుంబాలకు, వన్యప్రాణుల కు తాగునీరు అందుతుంది. బల్మూరు మండలం రసూల్ చెరువు సైతం పాలకుల వివక్షకు గురైంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీల్దార్ తిప్ప, రసూల్ చెరువును మరమ్మతులు చేసి సాగు, తాగునీరు కల్పించాలని పలు పార్టీలు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. వేసవిలో చెంచులకు, వన్యప్రాణులకు తాగు నీరు లభించేది కాదు. తిండి గింజలకూ ఇబ్బందులు పడేవారు. అందుకే 1968లో అప్పటి ముఖ్యమంత్రి వెంగళరావు ప్రోత్సాహం తో కొల్లాపూర్ ఎమ్మెల్యే రంగదాస్ జీల్దార్ తిప్ప చెరువును నిర్మించారు. కృష్ణా నదికి అతి సమీపాన మూడు కిలోమీటర్ల దూరంలో ఈ చెరువు ఉంది. అక్కడి నుంచి పైప్‌లైన్‌తో నీటిని నింపొచ్చు. లేదా పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ద్వారా కాలువల నుంచి నీటిని మళ్లించొచ్చు. అవకాశాలు ఎన్ని ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీల్దార్ తిప్ప చెరువును పట్టించుకోలేదు. ఈ చెరువుకు సమీపాన ఉడుగుల వాగు ఉంది. ఇది మూడు నెలలపాటు వర్షాకాలంలో నీరు పారుతుంది. శ్రీశైలం వెనుక జలాల నుంచి సైతం నీటిని మళ్లించే అవకాశాలున్నప్పటికీ జీల్దార్ తిప్పకు నీటిని మళ్లించడం లేదు. వచ్చే కొద్దిపాటి వర్షపు నీరు కూడా జీల్దార్ తిప్ప చెరువును మరమ్మతు చేయకపోవడం వల్ల నిల్వ ఉండటం లేదు. కల్వకుర్తి ఎత్తిపోతల పాలమూరు -రంగారెడ్డి ద్వారా వందల కిలోమీటర్ల మేర నీటిని తరలిస్తున్నా జీల్దార్ తిప్పపై వివక్ష నడుస్తోంది.
వేసవి వస్తే..
గతంలో ఈ చెరువు నిండా నీరు ఉండేది. క్రమంగా పూడిక పెరగడం.. కట్ట, అలుగు, తూమును మరమ్మతు చేయకపోవడం వల్ల చెరువులో నీటి నిలువ ఉండటం లేదు. పైనుంచి వస్తున్న వరద తూము ద్వారా వెళ్లిపోతోంది. దీంతో వేసవి వచ్చిందంటే చెంచులకు, అటవీ జంతు వులకు తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటోంది.
రసూల్ చెరువుది అదే పరిస్థితి..
జిల్లాలో నేటికీ మరమ్మతుల కు నోచుకోని అనేక చెరువులు న్నాయి. జీల్దార్ తిప్పతో పాటు బల్మూరు మండలం వసూల్ చెరువు పరిస్థితి అలాగే ఉంది. ఈ చెరువుకు మరమ్మతులు చేస్తే సుమారు పదివేల ఎకరాలకు సాగునీరు అందు తుంది. రసూల్ చెరువు తూము దగ్గర ఒక చెట్టు ఉంది. చెరువు నిర్మాణం చేస్తే చెట్టుకు ప్రమాదం ఉందని అటవీ అధికారులు పనులను అడ్డుకుంటు న్నారు. చెరువు ద్వారా బల్మూరు మండలం వెంకటగిరి బిల్లకల్లు లక్ష్మీపల్లి బాణాల పరిధిలో ఉండే వేలాది ఎకరాలకు సాగు అందే అవకాశాలు ఉన్నాయి. తూము లీక్ ఆపేస్తే సమస్య తీరుతుంది. తూము లేకేజీ వల్ల ఆశించిన స్థాయిలో సాగునీరు అందడం లేదు.
జీల్దార్ తిప్పకు పాలమూరు-రంగారెడ్డి నీళ్లు మళ్లించాలి
జీల్దార్ తిప్పకు పాలమూరు -రంగారెడ్డి ద్వారా నీటిని సరఫరా చేయాలి. ఈ చెరువు నిండితే సుమారు 5వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. చెంచుల కు తాగునీటి సమస్య తీరుతుంది. వన్య ప్రాణు లకు వేసవితో తాగునీటి ఎద్దడి ఉండదు.
తుమ్మల బాలలపేరు, మొలచింతలపల్లి, కొల్లాపూర్
గొంతు తడపండి
వేసవి వస్తే మాకు తాగునీటి సమస్య ఏర్పడుతోంది. జీల్దార్ తిప్ప చెరువు నిండితేనే మా పశువులకు తాగునీరు లభిస్తుంది. పదిహేను ఏండ్లుగా చెరువు నిండకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ నీటి సమస్యను పరిష్కరించాలి.
చెంచు లక్ష్మయ్య, మొలచింతలపల్లి
పాలమూరు రంగారెడ్డి ద్వారా నీటిని నింపాలి
పాలమూరు-రంగారెడ్డి నీటితో జీల్దార్ తిప్ప చెరువును నింపాలి. ప్రధానంగా చెరువు మరమ్మతు చేపట్టాలి. శ్రీశైలం బ్యాక్ వాటర్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెంచుల తాగునీటికి సమస్య రాకుండా చూడాలి.
ఎం.శ్రీనివాసులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి, నాగర్‌కర్నూల్



