Friday, October 31, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిజిన్‌పింగ్‌-ట్రంప్‌ భేటీ!

జిన్‌పింగ్‌-ట్రంప్‌ భేటీ!

- Advertisement -

కుక్క మనిషిని కరవటం కాదు, మనిషి కుక్కను కరవటమే వార్త అని జర్నలిస్టులకు పాఠాలు బోధించేపుడు చెబుతారు. బహుశా ఆ పాఠం గుర్తుకు వచ్చి కాబోలు ఒక అంతర్జాతీయ పత్రిక చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడని వేడి పుట్టించే మూడు అంశాలేమిటి? అనే శీర్షికతో వార్తా విశ్లేషణ ఇచ్చింది. గురువారం నాడు దక్షిణ కొరియాలోని బుసాన్‌ పట్టణంలో ఈ ఇద్దరు నేతల భేటీ జరిగింది. ఆసియా పసిఫిక్‌ ఆర్థిక సహకార కూటమి సమావేశాల సందర్భంగా విడిగా ఈ సమావేశం నిర్వహించారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఆ కలయిక ఎలాంటి ఫలితాలను ఇస్తుందో అని యావత్‌ ప్రపంచం ఎదురు చూసిందంటే అతిశయోక్తి కాదు. సంప్రదింపుల్లో షీ జిన్‌పింగ్‌ కొరకరాని కొయ్య అని వర్ణిస్తూ చైనా వస్తువులపై పన్ను మొత్తాన్ని 57 నుంచి 47శాతానికి తగ్గించినట్లు ట్రంప్‌ ప్రకటించాడు.

ఫెంటానిల్‌ అనే మత్తు కలిగించే రసాయనాలను అక్రమంగా అమెరికాకు ఎగుమతి కాకుండా చూసేందుకు చూస్తామని ఇచ్చిన హామీని విశ్వసించి నట్లు చెప్పాడు. విలువైన ఖనిజాల ఎగుమతుల మీద కూడా అవగాహన కుదిరిందని, ఉక్రెయిన్‌ సమస్యపై ఇద్దరం కలసి పనిచేస్తామని, తాను ఏప్రిల్‌లో బీజింగ్‌ సందర్శిస్తానని తరువాత షీ జిన్‌పింగ్‌ అమెరికా సందర్శిస్తారని కూడా ట్రంప్‌ చెప్పాడు. అయితే ఆ ప్రకటన తర్వాత కొంతసేపటికి షీ జిన్‌పింగ్‌ ఒక ప్రకటన చేస్తూ ప్రతీకారమనే విషవలయంలో మనం పడిపోకూడదని వ్యాఖ్యానించాడు. రెండు దేశాల సంబంధాలను స్థిరంగా, సహకరించుకొనే వైఖరితో ముందుకు తీసుకుపోవాలన్నాడు. అయితే విలువైన ఖనిజాల గురించి లేదా అమెరికా పర్యటన గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు.తమ స్వంత అభివృద్ధి మీద కేంద్రీకరిస్తాం తప్ప మరొక దేశాన్ని సవాలు చేయాలని లేదా పక్కకు నెట్టాలని తాము చూడటం లేదని షీ జిన్‌పింగ్‌ చెప్పినట్లు సిన్హువా వార్తా సంస్థ పేర్కొన్నది.

ఫెంటానిల్‌ అక్రమ రవాణా గురించి అమెరికా చేసిన ఆరోపణను గతంలో చైనా తోసిపుచ్చింది. ఏ దేశానికీ అక్రమ పద్దతుల్లో అందకుండా గట్టి చర్యలు తీసుకున్నట్లు కూడా చెప్పింది. అయితే ఇప్పుడు తాము చైనా చర్యలను గట్టిగా నమ్ముతున్నందున పదిశాతం పన్ను తగ్గిస్తున్నట్లు ట్రంప్‌ చెప్పటంలో అర్ధం లేదు. తమకు అవసరమైన సోయా గింజలను కొనుగోలు చేసేందుకు భేటీకి ముందే చైనా చర్యలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.చైనా మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న ఉలిపికట్టెలకు ఈ భేటీ తీరు నచ్చలేదన్నది స్పష్టంగా కనిపిస్తున్నది. అమెరికాకు అంత సీన్‌లేదని గుర్తించేందుకు వారు సిద్దపడటం లేదు.దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిపినా ముఖ్యమైన సమస్యల ప్రస్తావన రాలేదని పెదవి విరుస్తున్నారు.

తైవాన్‌ అంశం ప్రస్తావనకు రాలేదని, ఉక్రెయిన్‌ గురించి మాట్లాడినప్పటికీ రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ముడి చమురు అంశాన్ని విస్మరించారని,కృత్రిమ మేధ చిప్స్‌ గురించి కూడా ట్రంప్‌ పట్టించుకోలేదని ఉక్రోషం వెలిబుచ్చారు. కీలకమైన చిప్స్‌, సెమీ కండక్టర్ల ఎగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలకు ప్రతిగా తన వద్ద ఉన్న విలువైన ఖనిజాలు, వాటి ఉత్పత్తులను చైనా నిలిపివేసింది.నివిడియా సంస్థ చైనాకు ఎగుమతి చేసే చిప్స్‌ మీద అమెరికా విధించిన ఆంక్షలతో ఆ కంపెనీకి కలుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. అలాంటి నిషేధాలను ఎత్తివేయాలని అనేక అమెరికన్‌ కంపెనీలు ట్రంప్‌ మీద తీవ్రంగా వత్తిడి చేస్తున్నాయి. కీలెరిగి వాత పెట్టాలన్నట్లుగా చైనా ఈ అంశాన్ని గమనంలోకి తీసుకొని వ్యవహరిస్తుండటంతో ట్రంప్‌ దిగిరాకతప్పటం లేదు. ఉలిపికట్టెలు ఎంతగా రెచ్చగొట్టినా తెగేదాకా లాగకపోవ టానికి కూడా కారణం ఇదే.

ఉక్రెయిన్‌ సమస్యలో ట్రంప్‌ నిస్సహాయత కూడా వెల్లడైంది. దక్షిణ కొరియా నుంచి తిరుగుప్రయాణంలో విమానంలో విలేకర్లతో మాట్లాడుతూ షీ జిన్‌పింగ్‌ తాను కలిసి పరిష్కారానికి కృషిచేస్తామని అంటూనే కొన్నిసార్లు వాళ్లను కొట్టుకోనిద్దాం మనం పెద్దగా చేయగలిగింది లేదన్నాడు. ఈ భేటీలో నిర్దిష్టంగా ఒప్పందాలేమీ ఉన్నట్లు కనిపించటం లేదు. అనేక అంశాల మీద అంగీకారానికి వచ్చామన్నాడు తప్ప వాటి స్వభావం ఏమిటో తెలియదు. నీటి చుక్క కూడా లేనిచోట సముద్రాలు ఉన్నట్లు చెప్పగల సమర్ధత ట్రంప్‌ సొంతం గనుక చెప్పేమాటలను వెంటనే పరిగణనలోకి తీసుకోరాదు. తమ మధ్య కుదిరిన ఒప్పందాలు ఒక ఏడాది పాటు అమల్లో ఉంటాయని ట్రంప్‌ చెప్పాడంటేనే వాటికి ఉన్న పరిమితులు, పరస్పర అవిశాస్వం స్పష్టంగా కనిపిస్తోంది. రెండు దేశాలూ ‘మీ ఊరు మాకెంత దూరమో మా ఊరు కూడా మీకంతే దూరం’ అన్నట్లుగా ఉన్నాయి. ఆచరణ ఎలా ఉంటుందో చూద్దాం!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -