Thursday, December 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంటెట్‌ సమస్య పరిష్కారానికి జాతీయస్థాయిలో ఉమ్మడి పోరాటం

టెట్‌ సమస్య పరిష్కారానికి జాతీయస్థాయిలో ఉమ్మడి పోరాటం

- Advertisement -

ఉపాధ్యాయ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఉత్తీర్ణత నుంచి మినహాయింపునివ్వాలనీ, అందుకు అవసరమైన చర్యలను తక్షణమే తీసుకోవాలని కేంద్ర ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేస్తూ జాతీయ స్థాయిలో ఉమ్మడి పోరాటం నిర్వహించాలని అఖిల భారత స్థాయిలో ఉపాధ్యాయ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్ణయించింది. బుధవారం స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్టీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌ భవన్‌లో ఎస్టీఎఫ్‌ఐ అధ్యక్షులు సీఎన్‌ భార్తి అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఎనిమిది జాతీయ ఉపాధ్యాయ సంఘాల నుంచి 15 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన 15 సంవత్సరాల తర్వాత అంతకు ముందు నియామకమైన ఉపాధ్యాయులు కూడా రెండేండ్లలో టెట్‌ పాస్‌ కావాలని సెప్టెంబర్‌ 1న సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం దురదృష్టకరమనీ, కేంద్ర ప్రభుత్వం, ఎన్సీటీఈ సుప్రీంకోర్టుకు సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి తీర్పు వచ్చిందని సమావేశంలో పాల్గొన్న నాయకులు అభిప్రాయపడ్డారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చి మూడు నెలలు గడుస్తున్నా, దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా, కొందరు పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో ప్రస్తావించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని వారు విమర్శించారు. టెట్‌ సమస్యతో పాటు ఎన్‌పీఎస్‌, యుపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలనీ, జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలనీ, పాఠశాలల విలీనం, మూసివేతలను నిలిపేయాలనీ, ఉపాధ్యాయుల పైన బోధనేతర పనుల భారాన్ని తగ్గించి బోధనకు పరిమితం చేయాలని కోరారు. అదే విధంగా విద్యారంగంలో తాత్కాలిక, ఒప్పంద ఉద్యోగుల స్థానంలో రెగ్యులర్‌ నియామకాలు చేపట్టాలనీ, కనీస వేతనాలు అమలుచేయాలని తదితర డిమాండ్లపై జాతీయస్థాయిలో ఐక్యంగా పోరాడా లని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. వారం రోజుల్లో మరొక సమావేశం ఆన్‌లైన్‌లో నిర్వహించి నిర్దిష్ట కార్యాచరణను రూపొందించుకో వాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో చావ రవి, మహవీర్‌ సింగ్‌ సిహాగ్‌, ప్రభు సింగ్‌ (ఎస్టీఎఫ్‌ఐ), కత్తి నరసింహారెడ్డి (ఎఐఎస్టీఎఫ్‌), బసవరాజ్‌ గురికార్‌, ఉమాశంకర్‌ సింగ్‌ (ఎఐపీటీఎఫ్‌), సుధాకర్‌ సావంత్‌, రామమూర్తి స్వామి (ఎఐఎఫ్‌ఇటిఒ), మధు ప్రసాద్‌ (ఎఐఎఫ్‌ఆర్టీఈ), శారదా దీక్షిత్‌ (ఎఐఎస్‌ఈసి), సుభాష్‌ లాంబ(ఎఐఎస్జిఇఎఫ్‌), నందితా నారాయణ్‌ (జెఎఫ్‌ఎంఈ) తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -