Tuesday, March 10, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుజర్నలిజం గొప్ప ఫీల్డ్‌

జర్నలిజం గొప్ప ఫీల్డ్‌

- Advertisement -

– వ్యవస్థను గాడిలో పెట్టేది జర్నలిస్టులే
– అధికారం లేకున్నా.. అజమాయిషీ ఉంది : పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌
– జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని వెల్లడి
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి

ప్రతి ఒక్క రాజకీయ నాయకుని ఎదుగుదలలో జర్నలిస్టుల భాగస్వామ్యం ఉంటుందని, నాయకులు సరిగ్గా పనిచేయకున్నా.. వ్యవస్థను గాడిలో పెట్టాలన్నా.. సరి చేయాలన్నా.. ఆ పవర్‌ జర్నలిజానికే ఉందని, అందుకే జర్నలిజం గొప్ప ఫీల్డ్‌ అని పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. ప్రస్తుతం ఈ-పేపర్‌, సోషల్‌ మీడియా, డిజిటల్‌ మీడియా అంటూ మీడియా అభివృద్ధి చెందుతూ కొత్త పుంతలు తొక్కుతున్నా.. తెల్లారి లేచి నాలుగైదు పేపర్లు చదవడంలోనే తనకు తృప్తి ఉంటుందని తెలిపారు. నిజామాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం నగరంలోని బస్వాగార్డెన్‌లో ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్‌ అధ్యక్షతన నిర్వహించగా ఆయన హాజరై ప్రసంగించారు. ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థిసంఘంలో ఉన్నప్పుడు ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే.. తెల్లారి పేపర్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూసేవాళ్లమని, వార్త క్లిప్పింగ్‌లను కట్‌ చేసుకుని దాచుకునే వారమని అన్నారు. దూరదర్శన్‌లో చిన్న క్లిప్పింగ్‌ వచ్చేందుకు నానా తంటాలు పడేవారమని.. ఎమ్మెల్యేలతో ప్రయత్నించి న్యూస్‌ వస్తే ఆనందించే వాళ్లమంటూ నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. నాయకులకు, జర్నలిస్టులకు అవినాభావ సంబంధం ఉంటుందన్న మహేశ్‌గౌడ్‌.. తన ఎదుగుదలలో జర్నలిస్టులు కీలకంగా పని చేశారని గుర్తించారు. రాజకీయాలు కరప్షన్‌, దోపిడీ అన్నట్టు పలువురు వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిని గాడిలో పెట్టే బాధ్యత సైతం జర్నలిస్టులదే అని అన్నారు. ఎల్లో జర్నలిజం కాకుండా వాస్తవాలు రాయాలని, సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువచ్చే బాధ్యత జర్నలిస్టులదని, వాటిని సరిదిద్దే బాధ్యత తమదని తెలిపారు. ప్రస్తుతం పలువురు జర్నలిస్టులకు వేతనాలు వచ్చే పరిస్థితి లేదని, కష్టపడితేనే పూటగడిచే పరిస్థితులు ఉన్నాయని, అందుకే జర్నలిస్టుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని భరోసా ఇచ్చారు. జర్నలిస్టుల చిరకాలవాంఛ అయిన ఇండ్ల స్థలాలు కేటాయించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం సీఎంతో మాట్లాడి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అందుకు గల నియమ నిబంధనలు, సుప్రీం తీర్పులు పరిశీలిస్తామని, ఖాళీ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కలెక్టర్‌, ఆర్డీవోతో సమావేశం నిర్వహించి ఆరా తీస్తామని అన్నారు. అంతకుముందు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యేలు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త, డా.భూపతిరెడ్డి, మేయర్‌ కూరగాయల ఉమారాణి తదితరులు మాట్లాడారు. వెల్‌నెస్‌ ఆస్పత్రిలో జర్నలిస్టులకు, వారి కుటుంబీకులకు ఉచిత ఐపీ, ఓపీ సేవల కోసం రూపొందించిన హెల్త్‌కార్డులను ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

నక్సలిజం అంతిమలక్ష్యం ప్రజాసేవే
రాజకీయం అంటేనే ప్రజాసేవ అని మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని, గెలిచిన తర్వాత అందరి లక్ష్యం ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలని అన్నారు. అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ బీజేపీ నుంచి గెలిచినా అభివృద్ధిలో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి భాగస్వామ్యం అవుతున్నారని, పార్టీల పరంగా దారులు వేరైనా అంతిమలక్ష్యం ప్రజాసేవే అని అన్నారు. నక్సలైట్ల వల్ల ప్రభావితం అయిన కుటుంబాల్లో తమది సైతం ఒకటని, కానీ వారి అంతిమలక్ష్యం సైతం ప్రజాసేవే అని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ సైతం అదే లక్ష్యంతో పని చేస్తున్నదని, సెక్యులర్‌ భావాజాలంతో ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. మావోయిస్టులు ఆయుధాలు వీడాలని, ప్రజా సేవ చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -