నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో దారుణం జరిగింది. లక్ష్మీ నారాయణ్ సింగ్ అలియాస్ పప్పు సింగ్ (54) అనే జర్నలిస్టును దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపారు. నగరంలోని ఓ హోటల్ సమీపంలో గురువారం ఈ ఘటన జరిగింది. మృతుడు హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అశోక్ సింగ్‌కు మేనల్లుడు. పప్పు సింగ్‌పై కత్తులతో దాడి చేసిన నిందితులు ఆయన మెడ, పొట్ట, చేతులపై విచక్షణా రహితంగా పొడిచారు. ఆయన శరీరంపై 24 కు పైగా లోతైన గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన ఆయన్ను వెంటనే స్వరూప్ రాణి నెహ్రూ ఆసుపత్రికి తరలించారు.
అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం మృతుడికి, నిందితులకు మధ్య ఓ వివాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని అదనపు పోలీస్ కమిషనర్ అజయ్ పాల్ శర్మ తెలిపారు. అయితే, హత్యకు దారితీసిన కచ్చితమైన కారణాలపై లోతుగా విచారణ జరుపుతున్నామన్నారు. ”ఈ హత్యకు సంబంధించి విశాల్ అనే నిందితుడిని అరెస్ట్ చేశాం. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నాం,” అని అజయ్ పాల్ శర్మ మీడియాకు వివరించారు. మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.



