నీట్ వ్యవహారంలో సుప్రీం నిర్ణయం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మెడికల్ సీట్ల వ్యవహారంలో స్థానికత అంశానికి సంబంధించిన అంశంపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు వాదనలు ముగించింది. సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు సీజేఐ ధర్మాసనం వెల్లడించింది. మెడికల్ కోర్సు అడ్మిషన్లకు స్థానికతకు సంబంధించి నీట్‌కు ముందు నాలుగేండ్లు స్థానికంగా చదవాలని నిబంధనలు చేర్చుతూ… తెలంగాణ ప్రభుత్వం జీవో 33ని తీసుకొచ్చింది. ఈ జీవోలోని నిబంధన 3 (ఏ) ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొంది. అయితే ఈ జీవోను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌కు చెందిన కల్లూరి అభిరామ్‌తో పాటు మరో 160 మంది రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం… ‘ఒక విద్యార్థి తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వ గైడ్ లైన్స్ లేవు. మొదట గైడ్‌లైన్స్, రూల్స్ రూపొందించాలి’ అని ప్రభుత్వానికి సూచిస్తూ విద్యార్థులకు ఫేవర్‌గా గతేడాది సెప్టెంబర్ 5న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సెప్టెంబర్ 11న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఎస్ ఎల్పీపై మంగళవారం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి నేతత్వంలోని జస్టిస్ కె వినోద్ చంద్రన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. సీజేఐ కోర్టు జాబితాలో మొదటి అంశంగా ప్రారంభమైన ఈ కేసు విచారణ సుదీర్ఘంగా దాదాపు రెండున్నర గంటల పాటు సాగింది.
పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం…
తెలంగాణకు చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత నివాస నిబంధనను తీసుకువచ్చిందని తెలంగాణ ప్రభుత్వం తరపు సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. సంపన్న కుటుంబాల విద్యార్థులు లండన్, దుబారు, విదేశాలకు వెళ్లి 11, 12 వ తరగతి చదువుకుంటే ఎక్కడైనా సులభంగా మెడికల్ సీట్లు పొందవచ్చన్నారు. కానీ అలాంటి అవకాశాలు లేని, తెలంగాణ స్థానికతలో చదువుతున్న విద్యార్థులను దష్టిలో పెట్టుకొని ఈ రూల్ తెచ్చామన్నారు. ‘సంపన్నుల పిల్లలు విదేశాల్లో చదువుకొని తిరిగి రండి. నేను దాని గురించి చింతించడం లేదు. అది చాలా మంచిది. కానీ మళ్లీ స్థానిక కోటాలో సీటుకు నిజంగా వాళ్లు అర్హులు కాదు. బయటకు వెళ్లి, అక్కడ కోట్లు ఖర్చు చేసి, తిరిగి వచ్చే వ్యక్తుల కోసం మేం నిజంగా ఈ విధానం కోరుకోవడం లేదు’ అని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత విధానం రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డి) ప్రకారం ఉందన్నారు. ఈ నిబంధన ప్రకారం… ‘రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలకు, ప్రభుత్వ ఉపాధి, విద్యా విషయాల్లో సమాన అవకాశాలు, సౌకర్యాలు అందించవచ్చు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వేరు వేరు నిబంధనలు చేయొచ్చు?’ అని అన్నారు. 1974 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం… ఏపీలో నివసిస్తోన్న వారికి కూడా నివాస ప్రయోజనం ఇస్తున్నట్టు కోర్టుకు నివేదించారు. అయితే… తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014న ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా ఏపీ విభజన చట్టం 2014లో ఈ నివాస ప్రయోజనం(లోకల్) ను 2014కు కటాఫ్ చేసినట్టు వివరించారు. అయితే… సివిల్ సర్వీసెస్(ఐఏఎస్, ఐపీఎస్), ఇతర ఉద్యోగాల్లో పేరెంట్స్ డిప్యూటేషన్‌పై వెళ్లి పిల్లలు ఇతర రాష్ట్రాల్లో చదువుకొన్న వారి పిల్లలకు మినహాయింపు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ అంశాన్ని కొన్ని ప్రత్యేక కేసులతో ముడి పెట్డకుండా… లక్షలాది మంది తెలంగాణ స్థానిక విద్యార్థుల దష్టితో ఆలోచించాలని కోరారు. ఈ విషయం ఏపీ ప్రజలకు తెలుసునన్నారు. అయితే… పదేండ్లు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయని చెబుతోన్న రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకు 2028లో జీవో 33 (స్థానికతకు సంబంధించిన జీవో) ను అమలు చేయకూడదని సీజేఐ ప్రశ్నించారు. పదేండ్లు ముగిసినంత మాత్రానా… అందరికీ ఆర్టికల్ 371(డీ) లోని అంశాలు తెలియవని అభిప్రాయపడ్డారు. 2024 లో కొత్త నిబంధనలు తెస్తే… వచ్చే నాలుగేండ్లలో స్థానికంగా చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.
అస్సాం, హర్యానాల్లో ‘స్థానికత’లో నిబంధనలు
అస్సాం, హర్యానా, పలు రాష్ట్రాల్లోనూ స్థానికతకు సంబంధించిన అంశంలో నిబంధనలు ఉన్నాయని సింఘ్వీ కోర్టు దష్టికి తెచ్చారు. ఇందుకు సంబంధించి అనంతర్ మదన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా అండ్ అదర్స్(1995), డీఆర్ జోషి వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్య భారత్, రాజ్ దీప్ ఘోష్ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ అస్సాం కోర్టు తీర్పులను ప్రస్తావించారు. వైద్య/దంత విద్యలో ప్రవేశానికి స్థానిక పాఠశాలలో 10, 11, 12వ తరగతులు తప్పక చదవాలని హర్యానాలో నిబంధన ఉందన్నారు. ఇక అస్సాంలో 7వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు స్థానికంగా చదివితేనే… మెడికల్ సీట్ల పరీక్షకు అర్హులని గుర్తు చేశారు. అయితే… ప్రభుత్వ ఉద్యోగి అస్సాం వెలుపల పొస్టింగ్‌లో ఉంటే… వారి పిల్లలకు మాత్రమే మినహాయింపు ఉందన్నారు. చివరకు ఏపీలో స్థానికత అమలవుతోందని, ఒక్క తెలంగాణ స్టూడెంట్‌కు అక్కడ అవకాశం లేదన్నారు. కానీ… ఏపీ స్టూడెంట్స్‌కు తెలంగాణ అవకాశం ఇవ్వాలని కోరడం ఎంత వరకు సమంజసమని వాదించారు. తెలంగాణలో ఒక్కో మెడికల్ సీటు కోట్ల రూపాయలు ఉందని సింఘ్వీ న్యాయస్థానం దష్టికి తెచ్చారు. కేవలం డబ్బు ఉన్న వారికి మాత్రమే సీటు అనే పరిస్థితి ఉండకూడదని, తెలంగాణలోని సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితులను ప్రస్తావించారు. ఈ వాదనపై అభ్యంతరం తెలిపిన ధర్మాసనం… ‘హైదరాబాద్ ఈజ్ రిచ్ సిటీ. అయితే ఈ కేసులో ఆర్థిక పర అంశాలకు చోటు లేదు.’ అని వ్యాఖ్యానించింది. కేవలం రెండేండ్లు రాష్ట్రం అవతల చదువుకోవడానికి వెళ్తే తప్పేంటని సీజేఐ ప్రశ్నించారు. అలాగే విదేశాల్లో చదివే వారి కోసం ఎన్‌ఆర్‌ఐ కోటా ఉంటుందని, దాన్ని స్థానికతతో ముడిపెట్టొదన్నారు.
ఏపీ, తమిళనాడు, మహారాష్ట్రలోనూ…
మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీలోనూ ఇలాంటి స్థానికత నిబంధనలు అమలులో ఉన్నాయని కాళోజీ యూనివర్సిటీ తరపున సీనియర్ అడ్వొకేట్ గోపాల్ శంకర్ నారాయణన్ సీజేఐ బెంచ్ దష్టికి తెచ్చారు. 2014 విభజన చట్టాన్ని అనుసరించి పదేండ్ల తర్వాత స్థానికతపై తప్పనిసరిగా నిబంధనలు రూపొందించాలని భావిస్తోందన్నారు. ‘విభజన చట్టం 2014లోని సెక్షన్ 95 ప్రకారం… ఆర్టికల్ 371 (డి) కింద అందించబడినంత వరకు అన్ని ప్రభుత్వ, ప్రయివేట్, సాంకేతిక, వైద్య విద్యా సంస్థల్లో పదేండ్ల పాటు అలాగే కొనసాగుతాయి. ఈ టైంలో ప్రస్తుత ఉమ్మడి ప్రవేశ ప్రక్రియ ఉంటుంది.’ అని గుర్తు చేశారు. అయితే… ఆ పదేండ్ల కాలం ముగిసినందున తెలంగాణ కొత్త రూల్స్‌ను రూపొందిస్తుందన్నారు. మధ్యలో జస్టిస్ చంద్రన్ స్పందిస్తూ… ‘తెలంగాణలో క్రమంగా నాలుగేండ్లు విద్యనభ్యసించాలని రూల్ తెస్తున్నందున…. ఈ విషయం స్థానిక ప్రజలకు తెలుసునని భావించడం సరికాదు’ అని వ్యాఖ్యానించారు.
మరోవైపు సీజేఐ జోక్యం చేసుకొని…’1974 -2014 వరకు అంటే 48 ఏండ్ల పాటు వారికి ఈ విషయం తెలుసు… కానీ 2025 నుంచి వాళ్లకు తెలియదు’ అని వ్యంగ్యంగా స్పందించారు. ‘ప్రతి విద్యార్థి ఆర్టికల్ 371 డి గురించి తెలుసుకోవాలి అన్నట్టు మీ వాదనలు ఉన్నాయి. 8వ తరగతిలోనే రాజ్యాంగం గురించి తెలుసుకోవాలన్న విధంగా వాదించడం సరికాదు. చదువుకోలేని తల్లిదండ్రులు ఉంటారు.’ అని జస్టిస్ చంద్రన్ కామెంట్ చేశారు. ప్రభుత్వం తరపు సుదీర్ఘ వాదనల తర్వాత… స్టూడెంట్ల తరపు ప్రతివాదులు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తెచ్చిన జీవో కారణంగా తెలంగాణలో పుట్టి పదో తరగతి వరకు చదివినా స్థానిక కోటా దక్కడం లేదని తెలిపారు. 11, 12 వ తరగతులను చదవని కారణంగా నీట్ లో స్థానిక కోటా దక్కక నష్టపోతున్నట్లు కోర్టుకు నివేదించారు. సీనియర్ అడ్వొకేట్ రాజేంత్ బసంత్, ఏఓఆర్ భబ్నా దాస్‌లు వాదనలు వినిపిస్తూ… తల్లిదండ్రుల ఉద్యోగం కారణంగా కేరళ స్టూడెంట్ తెలంగాణలో అర్హత సాధించడాన్ని కోర్టు దష్టికి తెచ్చారు. అయితే… తెలంగాణ శాశ్వాత విద్యార్థులకు మాత్రమే ఈ ప్రయోజనం ఇవ్వాలని హైకోర్టు తీర్పులో స్పష్టం చేసిందని సీజేఐ గుర్తు చేశారు. 1974 ఆర్డర్ ప్రకారం స్థానిక ప్రాంతంగా… ‘శ్రీకాకుళం, విశాఖపట్నం, వెస్ట్, ఈస్ట్ గోదావరి, కష్ణ గుంటూరు, ప్రకాశం జిల్లాల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం(నాగర్జున వర్సిటీ). తెలంగాణ ప్రాంతానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉంది. అని స్పష్టం చేశారు. అన్ని వైపులా సుదీర్ఘ వాదనలను పరిగణనలోకి తీసుకొన్న ధర్మాసనం… ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని వాది, ప్రతివాదులకు సూచిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది.
‘స్థానికత’పై తీర్పు రిజర్వ్
- Advertisement -
- Advertisement -