నవతెలంగాణ-హైదరాబాద్: ఇండియా బ్లాక్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన బి.సుదర్శన్‌రెడ్డి పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. ఈ రోజు ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో ఇండియా బ్లాక్ నేతలతో చర్చించి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్. బీ. సుదర్శన్ రెడ్డిని ఇండియా బ్లాక్ ఉపరాష్ట్రపతి అభ్యర్తిగా ఖరారు చేశారు.
‘‘దేశంలోని ప్రఖ్యాత న్యాయనిపుణుల్లో బి.సుదర్శన్ రెడ్డి ఒకరు. ఆంధ్రప్రదేశ్, గువాహటి హైకోర్టులతోపాటు సుప్రీంకోర్టులోనూ న్యాయమూర్తిగా సేవలందించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంపై స్పష్టమైన అవగాహన కలిగిన వ్యక్తి. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని ఇండియా బ్లాక్ లోని పార్టీలన్నీ ఓ అభిప్రాయానికి వచ్చి ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి’’ అని ఖర్గే తెలిపారు. ప్రతిపక్షాలన్నీ ఒకే పేరును అంగీకరించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయమన్నారు ఖర్గే.
జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిది తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఆకులమైలారం . 1946 జులైలో జన్మించిన ఆయన 1971లో ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయవిద్య పూర్తి చేశారు. అనంతరం అదే ఏడాది డిసెంబర్ 27న బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్నారు. 1995 మే2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005లో గువాహటి హైకోర్టు సీజేగా పని చేశారు. 2007-11 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగాను సేవలందించిన ఆయన.. 2013 మార్చిలో గోవా తొలి లోకాయుక్తగా బాధ్యతలు స్వీకరించారు. వ్యక్తిగత కారణాలతో ఏడు నెలల్లోనే ఆ పదవికి రాజీనామా చేశారు.
ఖర్గే ఈ రోజు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ నివాసంలో జరిగిన సమావేశంలో కూటమి నేతలతో అనేక రౌండ్ల చర్చలు సాగాయి. కూటమిలోని అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైన పేర్ల గురించి చర్చించారు. ముందుగా మాజీ ఇస్రో శాస్త్రవేత్త మైలస్వామి అన్నాదురై, మహాత్మా గాంధీ మునిమనవడు, రచయిత తుషార్ గాంధీ పేర్లు కూడా చర్చించబడ్డాయి. ఆ తర్వాత కూటమి నేతల ఆమోదంతో తుదిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్. బీ. సుదర్శన్ రెడ్డి పేరు ఖరారు చేశారు.
ఎన్డీయే కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్టన్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకముందు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకాగానే జగదీష్ దన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో వచ్చే నెల 9న ఉపరాష్ట్రపతికి ఎన్నిక నిర్వహించనున్నారు. ఉపరాష్ట్రపతిని లోక్‌సభ-రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కళాశాల ఎన్నుకుంటుంది. ఖాళీలను మినహాయించి ప్రస్తుత ఎలక్టోరల్ కాలేజీలో 782 మంది సభ్యులు ఉన్నారు. అంటే గెలిచే పక్షానికి కనీసం 392 ఓట్లు ఉండాలి.